బార్లలోనూ బాదుడే!

ABN , First Publish Date - 2022-07-20T05:00:18+05:30 IST

జిల్లాలో 46 బార్లు, 180 మద్యం దుకాణాలు ఉండగా, సరాసరి రోజుకు రూ.3 కోట్లకుపైగానే మద్యం వ్యాపారం జరుగుతుంటుంది.

బార్లలోనూ  బాదుడే!
ఈ మధ్య బార్లలో మందు తాగుతుంటే కిక్కుఎక్కడం లేదబ్బా!

మద్యం ధరలకు రెక్కలు

ఒకచోట రూ.70, మరోచోట రూ.120 అధికం

షాపుల కంటే బార్‌లలోనే కోరిన బ్రాండ్లు

కేటాయింపులో ఎక్సైజ్‌ శాఖ ఇష్టారాజ్యం

అధికారుల తీరుపై విమర్శల వెల్లువ 


మద్యం ధరలు చూస్తే మందుబాబులకు తాగక ముందే కిక్కెక్కుతోంది. పోనీ ఇంత ధర పెట్టి నచ్చిన బ్రాండు తాగుదామనుకుంటే ఆ పరిస్థితీ లేదు. అదేంటో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కనిపించని ప్రముఖ బ్రాండ్లు బార్లలో మాత్రం పుష్కలంగా దొరుకుతున్నాయి..  ఇదే అదునుగా బార్ల యజమానులు మద్యం ప్రియులను నిలువునా దోచుకుంటున్నారు.    ఇందులో ఎక్సైజ్‌, సెబ్‌, పోలీసులకు కూడా భాగమందుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


నెల్లూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 46 బార్లు, 180 మద్యం దుకాణాలు ఉండగా, సరాసరి రోజుకు రూ.3 కోట్లకుపైగానే మద్యం వ్యాపారం జరుగుతుంటుంది. గతంలో కొన్ని పేరెన్నిగల బ్రాండ్లు మాత్రం మార్కెట్లో ఉండగా వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక అనామక బ్రాండ్లు వచ్చాయి. ఈ మద్యం కూడా తాగేందుకు చాలా ఇబ్బందిగా ఉందని, అనారోగ్యం పాలవుతున్నట్టు మందుబాబులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మందుబాబులు ఎక్కువగా పాత బ్రాండ్లపైనే మొగ్గు చూపుతున్నారు. అయితే కింగ్‌ఫిషర్‌, మేన్సనహౌస్‌, మార్ఫ్యూస్‌, బ్లెండర్‌స్ర్పైడ్‌, కైరాన వంటి బ్రాండ్లు ప్రభుత్వ దుకాణాల్లో దొరకడం లేదు. ఉదాహరణకు ఒక దుకాణానికి రోజుకు వంద కేసులు అవసరమైతే పది కేసులతో సరిపెడుతున్నారు. మిగిలినవన్నీ కొత్త బ్రాండ్లతో నింపేస్తున్నారు. అయితే పాత బ్రాండ్లన్నీ బార్లలో దొరుకుతుండడం గమనార్హం. ప్రభుత్వ దుకాణాలకు రాని సరుకు బార్లకు ఎలా వస్తోందన్నదే ఇక్కడ ప్రశ్న. ప్రభుత్వ దుకాణాలు ప్రారంభించిన మొదట్లో ఆయా సూపర్‌వైజర్లు వారికి జరిగే సేల్‌ ప్రకారం బ్రాండ్లను ఇండెంట్‌ పెట్టేవారు. అప్పుడు ఎక్కువగా పాత బ్రాండ్లనే ఇండెంట్‌ పెడుతుండేవారు. కానీ తర్వాత ఇండెంట్‌ పెట్టే అధికారాన్ని వారి నుంచి ఎక్సైజ్‌ అధికారులు లాగేసుకున్నారు. ఇప్పుడు ఏ దుకాణానికి ఏ బ్రాండ్‌ సరుకు ఎంత పంపాలన్నది అధికారులే నిర్ణయిస్తున్నారు. ఇదే సమయంలో బార్ల యజమానులు కూడా ఎక్కువగా పాత బ్రాండ్లకే ఇండెంట్‌ పెడుతున్నారు. ఈ క్రమంలో ఎక్సైజ్‌ అధికారులు మందుబాబులు ఇష్టపడే బ్రాండ్లను బార్లకే కేటాయిస్తున్నారు. ప్రభుత్వ దుకాణాలకు అరకొరగా సర్దుతున్నారు. అందులోనూ నెల నుంచి డిస్టిలరీల నుంచి మద్యం సరఫరా తగ్గింది. వచ్చిన అరకొర పాత బ్రాండ్లను బార్లకు పంపుతూ కొత్త బ్రాండ్ల మద్యాన్ని ప్రభుత్వ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. 


నచ్చిన ధరకు అమ్ముతాం..


ప్రభుత్వ దుకాణాల్లో మంచి బ్రాండ్లు లేకపోవడంతో ఎక్కువ మంది బార్ల వైపు చూస్తున్నారు. ఇదే అదునుగా బార్లలో దోపిడీకి తెరలేపారు. గతంలో బార్లలో బీరు లేదా క్వార్టర్‌ సీసా ఎమ్మార్పీపై రూ.50 అధికంగా వసూలు చేస్తుండేవారు. పెద్ద హోటళ్లలో ఉన్న బార్లలో తప్పితే మిగిలిన అన్ని బార్లలో దాదాపు ఇదే ధరను అనుసరించేవారు. ఇటీవల  రూ.70 అధికంగా వసూలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు కొన్ని బార్లలో మాత్రమే ఈ ధరను పాటిస్తున్నారు. డిమాండ్‌ పెరగడంతో చాలా బార్లలో ధరలు అమాంతం పెంచేశారు. అయ్యప్పగుడి వద్దనున్న ఓ బార్‌లో రూ.90 నుంచి రూ.120, కనుపర్తిపాడు వద్దనున్న ఓ బార్‌లో రూ.80-90 అధికంగా వసూలు చేస్తున్నారు. సిటీలో ఉన్న ఇంకొన్ని బార్లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్దంగా బయటకూ మద్యం  విక్రయిస్తున్నారు. ఇంత ధర ఏమిటని మందుబాబులు ప్రశ్నిస్తే బార్లలోని సిబ్బంది దురుసుగా ప్రవరిస్తున్నారు. ‘మాకు ఫలానా రేటుకే అమ్ముకోవాలన్న నిబంధనలేమీ లేవు.  నచ్చిన ధరకు అమ్ముకుంటాం. మేము అందరికీ మామూళ్లు ఇవ్వాలంటే ఆ మాత్రం ధరకు అమ్మకపోతే గిట్టుబాటు కాదు’ అంటూ ఓ బారు యజమాని వ్యాఖ్యానించడం గమనార్హం.  ఇంత బహిరంగ దోపిడీ జరుగుతుంటే ఎక్సైజ్‌ శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. 


పైస్థాయి అధికారులనే అడగాలి!


మాకు రెండు సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి. వీటిలో సమస్యల వల్ల సరుకు సరిగా రావడం లేదు.. వచ్చిన దానినే సేల్స్‌ ఎఫెక్ట్‌ కాకుండా ప్రభుత్వ దుకాణాలు, బార్లకు సర్దుతున్నాం. పాత బ్రాండ్ల సరఫరా అనేది నా సబ్జెక్టు కాదు. పైస్థాయి అధికారులను అడగాలి. 

- వెంకట్రామిరెడ్డి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌


Updated Date - 2022-07-20T05:00:18+05:30 IST