ఖజానాకు కిక్కు

ABN , First Publish Date - 2022-05-20T05:26:30+05:30 IST

ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. బీర్లపై రూ.10, ఫుల్‌బాటిల్‌పై రూ.80 నుంచి రూ.160 వరకు పెంచిన సర్కారు ఈ ధరలు వెంటనే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ఖజానాకు రూ.80 కోట్ల అదనపు ఆదాయం రానున్నది. సిద్దిపేట జిల్లాలో 93 వైన్‌ షాపులు, 14 బార్లు ఉన్నాయి. నిత్యం సుమారు రూ.3 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. గతేడాది 71 వైన్‌షాపులు ఉండగా అదనంగా మరో 22 పెంచారు.

ఖజానాకు కిక్కు

మద్యం ధరలను భారీగా పెంచిన సర్కారు

 బీరుపై రూ.10, ఫుల్‌బాటిల్‌పై రూ.80 నుంచి రూ.160 పెంపు

ఖజానాకు రూ.80 కోట్ల అదనపు ఆదాయం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 19: ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. బీర్లపై రూ.10, ఫుల్‌బాటిల్‌పై రూ.80 నుంచి రూ.160 వరకు పెంచిన సర్కారు ఈ ధరలు వెంటనే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ఖజానాకు రూ.80 కోట్ల అదనపు ఆదాయం రానున్నది. సిద్దిపేట జిల్లాలో 93 వైన్‌ షాపులు, 14 బార్లు ఉన్నాయి. నిత్యం సుమారు రూ.3 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. గతేడాది 71 వైన్‌షాపులు ఉండగా అదనంగా మరో 22 పెంచారు. జిల్లాలో మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల వలె నడుస్తున్నది. ఏప్రిల్‌ నెల విక్రయాలను పరిశీలిస్తే 83,738 మద్యం కార్టన్లు, 1,83,906 బీర్ల కార్టన్లు అమ్ముడుపోయాయి. ఒక్కో కార్టన్‌లో 12 సీసాలు ఉంటాయి. ఏప్రిల్‌ నెలలో రూ. 86.80 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. వర్షాకాలం, చలికాలంలో మద్యం విక్రయాలు మరింత పెరుగుతాయి. జిల్లాలో అత్యధికంగా ప్రీమియం బ్రాండ్‌ మద్యమే  అమ్ముడవుతుంది. 


ప్రతీ నెల రూ. 8 కోట్ల అదనపు ఆదాయం

ప్రభుత్వం బీరు సీసాపై రూ.10, మద్యం ఫుల్‌బాటిల్‌పై రూ.80 నుంచి రూ.160 వరకు ధరలు పెంచారు. క్వార్టర్‌ సీసాపై రూ.20, హాఫ్‌ బాటిల్‌పై రూ.40 వరకు పెంచారు. ప్రీమియం బ్రాండ్లపై ఈ పెంపు రెట్టింపు చేశారు. ఏప్రిల్‌ నెలలో 10 లక్షల మద్యం బాటిళ్లు విక్రయించారు. ఒక్కో బాటిల్‌పై రూ. 80 చొప్పున భారం పడగా రూ.8 కోట్ల అదనపు విక్రయాలు జరుగుతున్నాయి. ఇక 22లక్షల బీరు సీసాలపై ఒక్కోదానికి రూ.10 చొప్పున పెంచగా రూ.2కోట్ల పైచిలుకు భారం పడింది. ఈ లెక్కన ప్రతీనెల రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చింది. ఈ లెక్కన ఖజానాకు సంవత్సరానికి రూ.80 నుంచి రూ.100 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనున్నది. 


పాత స్టాక్‌ను కొత్త ధరలకు విక్రయం

మద్యం ధరలు పెరగడంతో వైన్‌షాపులు, బార్లలో పాత స్టాకును కొత్త ధరలతో విక్రయించడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వ నిర్ణయం ఆబ్కారీ శాఖకు, మద్యం వ్యాపారులకు వరంగా మారుతున్నాది. గత కరోనా సమయంలోనూ షాపుల్లో ఉన్న మద్యం నిల్వలను చాలావరకు అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అంతకుముందు మద్యం ధరలు పెంచిన సమయంలోనూ పాత స్టాకుకు కొత్త ధరలు వసూలు చేశారు. అయినా ఆబ్కారీ శాఖ అధికారులు చూసీచూడనట్లుగా ఉంటున్నారు.

Updated Date - 2022-05-20T05:26:30+05:30 IST