Abn logo
Sep 29 2021 @ 01:55AM

గీత దాటితే క్రమశిక్షణా చర్యలు

రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే రాజాలపై జగన్‌ ఆగ్రహం

కలిసి పనిచేసుకోవాలని  సూచన

లేకుంటే క్రమశిక్షణా  చర్యలు తప్పవని హెచ్చరిక

కార్పొరేషన్‌ ఎన్నికల్లో బాధ్యతగా వ్యవహరించాలని హితబోధ

ముఖ్యమంత్రి వద్ద  ఇద్దరు నేతల మౌనం

అంతకు ముందు వైవీ సుబ్బారెడ్డి వద్ద ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు పరస్పరారోపణలు చేసుకోవడంపై సీరియస్‌ అయ్యారు. ఇటీవల వీరిద్దురూ రోడ్డెక్కడంతో మంగళవారం సీఎం తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసుకు పిలిపించుకుని సుమారు అర గంట సేపు మాట్లాడారు. ‘ఒక కులంతో రాజకీయ పార్టీ నడవదు. అన్ని కులాల వారూ ఓట్లేయాలి.  నేతలు కులాల వారీగా విడిపోతే కష్టం. రాజకీయ పార్టీ అంటే అన్ని కులాలు ఉంటాయి. అందరూ కలిసి పనిచేసుకోవాలి. పార్టీ గీత దాటితే క్రమశిక్షణా చర్యలు తప్పవ’ని సీఎం వారిని హెచ్చరించినట్టు సమాచారం. బహుశా నవంబరులో రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇద్దరూ కలిసిమెలిసి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించినట్టు తెలిసింది. అంతకుముందు ఎంపీ, ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి వారి అభిప్రాయాలను, ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఇచ్చిన రిపోర్టును సీఎంకు అందజేశారు. సీఎంతో భేటీ సమయంలో ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌రాజు పాల్గొన్నారు. సీఎం వద్ద ఎంపీ, ఎమ్మెల్యే మౌనంగా ఉండడం గమనార్హం. అంతకుముందు వైవీ సుబ్బారెడ్డి వీరిద్దరితో విడివిడిగా ఒక్కో గంట  మాట్లాడారు. ఉదయం 11గంటలకు మొదలెట్టి, ఒంటిగంటవరకూ మాట్లాడారు. ఇక్కడ మాత్రం ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నట్టు సమాచారం. ‘ఇటీవల సీతానగరంలో ఎస్టీ అధ్యాపకుడిపై టీడీపీ నేత దాడి చేస్తే తాను బాధితుడిని పరామర్శించి అండగా ఉండడం తప్పా... ఈ పరిస్థితుల్లో రాజానగరంతో పాటు సిటీలో కొంతమంది కార్యకర్తలను తన మీదకు ఎమ్మెల్యే రాజా ఉసికొల్పార’ని ఎంపీ తెలిపినట్టు సమాచారం. ఇసుక తదితర కుంభకోణాలు, ఎస్సీలపై దాడుల విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.  రాజా కూడా ఎంపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సుబ్బారెడ్డికి వివరించినట్టు సమాచారం. రాజానగరం నుంచి సుమారు 500 మంది టీడీపీ, జనసేన కార్యకర్తలను ఎంపీ తిరుపతి తీసుకుని వెళ్లారని, ఇక్కడ వైసీపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని కూడా చెప్పినట్టు సమాచారం. పురుషోత్తపట్నం భూముల వ్యవహారం, ఆవ భూములను ఎంపిక చేయడం వల్ల రాజమహేంద్రవరం సిటీలో 25వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా పోయిన విషయాలు కూడా చర్చకు వచ్చినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లోపల జరిగిన విషయాలేమీ మీడియాకు చెప్పవద్దని కూడా హెచ్చరించినట్టు సమాచారం. ఎంపీ భరత్‌ మాత్రం... బుధవారం తాను రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడతానని తాడేపల్లిలో కలిసిన విలేకరులకు చెప్పడం గమనార్హం. వేర్వేరు వ్యూహాలతో వెళ్లినప్పటికీ సీఎం ఇద్దరిపైనా ఆగ్రహం వ్యక్తం చేయడం, కలిసి పనిచేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. అయితే వీరి కూడా వెళ్లిన నేతలు ఎవరిలోనూ ఆనందం కనిపించట్లేదు. ఎవరూ ఏ విషయాన్నీ చెప్పడానికి ఇష్టపడడం లేదు. 

 వివాదం ముగిసినట్టేనా?

సీఎం వద్ద ‘పంచాయితీ’ జరగడంతో వివాదం ముగిసినట్టేనా అనే చర్చ మొదలైంది. స్థానికంగా ఒకరిపై ఒకరు ఆఽధిపత్యం కోసం ప్రయత్నించడం వల్ల పైకి కలిసినట్టు కనిపించినా, విబేధాలు సద్దుమణిగే అవకాశమే ఉండదనే ప్రచారం జరుగుతోంది. జక్కంపూడి రాజా తన నియోజకవర్గంలోకి ఎంపీ రాకుండా చేయాలనే ఆలోచనతో ఉన్నారనే ప్రచారం ఉంది. అదే సమయంలో ఎమ్మెల్యేని కాదని ఎంపీ అక్కడ తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం మాట ప్రకారం వీరు ఎన్ని రోజులు కలిసి తిరుగుతారో చూడవలసిందే.