ఉచితం పరిమితం..!

ABN , First Publish Date - 2022-09-08T05:58:10+05:30 IST

కేంద్రం మంజూరు చేస్తున్న ఉచిత రేషన్‌ పథకం కొందరికే పరిమితమైంది.

ఉచితం పరిమితం..!

ఉదయం పూట అందరికీ రేషన్‌ 

సాయంత్రం కొందరికే ఉచితం 

ఉచిత రేషన్‌కు  ముందుస్తుగా టోకెన్‌ల జారీ

జిల్లాలో 1.19 లక్షల మంది మాత్రమే అర్హులు

లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం అమలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి) 

కేంద్రం మంజూరు చేస్తున్న ఉచిత రేషన్‌ పథకం కొందరికే పరిమితమైంది. రెండో నెలలోనూ రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కేంద్ర పరిధిలోని కార్డుదారులకే ఉచిత రేషన్‌ అందిస్తున్నారు. కిలో రూపాయి బియ్యం పొందే లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత రాకుండా రాష్ట్రప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉదయం పూట తెల్లకార్డుదారులందరికీ రేషన్‌ అందిస్తున్నారు. షార్టెక్స్‌ బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇంటింటికీ రేషన్‌ వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. సాయంత్రం రేషన్‌ డీలర్ల వద్ద ఉచిత రేషన్‌ ఇస్తున్నారు. ఉచిత రేషన్‌కు అర్హత ఉన్న లబ్ధిదారులకు వలంటీర్లు  ముందస్తుగా టోకెన్‌లు జారీ చేస్తున్నారు. ఇవి తీసుకుని రేషన్‌ డిపోలకు వెళితే బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 5,33,453 కార్డుదారులున్నారు. వారికి ప్రతినెలా 7,200 టన్నుల నాన్‌ షార్టెక్స్‌    బియ్యాన్ని పంపిణీ చేస్తుంటారు. ఉచిత  రేషన్‌కు వచ్చేసరికి జిల్లాలో 1.19 లక్షల మందికే అర్హులుగా తేల్చారు. వారికే ఉచిత  రేషన్‌ ఇస్తున్నారు. సుమారు రూ. 1.80 లక్షల టన్నుల బియ్యాన్ని మాత్రమే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. 

గతంలో అందరికీ..

కరోనా లాక్‌డౌన్‌ నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్‌ బియ్యం అందిస్తోంది. నెలలో  మొదటి పదిహేను రోజులు నాన్‌ షార్టెక్స్‌ బియ్యాన్ని ఇచ్చేవారు. తదుపరి  15 రోజుల్లో ఉచిత రేషన్‌ పంపిణీ ప్రారంభమయ్యేది. అప్పట్లో తెల్లకార్డుదారులందరికీ ఉచిత రేషన్‌ ఇస్తూ వచ్చారు. ఇలా నెలల తరబడి ఉచిత రేషన్‌ మంజూరు చేశారు. గడచిన పద నెలలనుంచి ఉచిత రేషన్‌ను రాష్ట్రప్రభుత్వం నిలిపివేసింది. కేంద్రం ఇస్తున్నా సరే రాష్ట్రం చేతులెత్తేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. గత నెల నుంచి ఉచిత రేషన్‌ ఇస్తున్నారు. అందరికీ ఇవ్వడం లేదు. కేవలం 1.19 లక్షల మంది కార్డుదారులకే ఉచిత రేషన్‌ను పరిమితం చేశారు. జిల్లాలో 4.14 లక్షల కార్డుదారులను పక్కన పెట్టేశారు. దీనిపై కార్డుదారుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో లోపాయికారిగా టోకెన్‌లు జారీ చేస్తున్నారు. కేంద్రం పరిధిలోకి వచ్చే కార్డుదారులకు టోకెన్‌లు పంపిణీ  చేస్తున్నారు. వారే సాయంత్రం పూట రేషన్‌ డిపోల్లో బియ్యం తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో కార్డుదారులందరికీ ఉచిత రేషన్‌ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. అయినా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. ప్రజా వ్యతిరేకత లేకుండా లోపాయికారిగా పంపిణీ చేస్తున్నారు. 


Updated Date - 2022-09-08T05:58:10+05:30 IST