Abn logo
Apr 23 2021 @ 23:03PM

సిమెంట్‌ రోడ్లా... నీటి కుంటలా..?

దుర్వాసనతో అల్లాడుతున్న ప్రజలు

పందుల సంచారం

రైల్వేకోడూరు, ఏప్రిల్‌ 23: సిమెంట్‌ రోడ్లు వేశారు. అయితే నీటి కుంటల్లా మారుతున్నాయి. ప్రజలు దుర్వాసనతో అల్లాడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షం వల్ల నీరు నిల్వ ఉండిపోయి మురుగు నీరులా మారింది. దీంతో దోమలు రాత్రి వేళ ప్రజల పైకి దాడులు చేస్తున్నాయి. పందుల సంచారం ఎక్కువైంది. నీటి కుంటలా ఉన్న సిమెంట్‌ రోడ్ల పై స్వైరవిహారం చేస్తున్నాయి.  చింతంనగర్‌, రంగనాయకులపేట, గాంధీనగర్‌, పగడాలపల్లె తదితర ప్రాంతాల్లో సిమెంట్‌ రోడ్డుపై వెళ్లాలంటే ప్రజలు ముక్కుమూసుకుని వెళ్లాల్సిందే. వివరాల్లోకి వెళితే...రైల్వేకోడూరు పట్టణంలోని చింతంనగర్‌, గాంధీనగర్‌, పగడాలపల్లె, రంగనాయకులపేట తదితర ప్రాంతాల్లో గతంలో సిమెంట్‌ రోడ్లు వేశారు. వర్షం కురిసినప్పుడల్లా నీరు నిల్వ ఉంటోంది.  అదే కాకుండా కొందరు బాత్‌ రూం నుంచి నీరు సిమెంట్‌ రోడ్ల పైకి వదులుతున్నారు. దీంతో తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. సిమెంట్‌ రోడ్ల నిర్మాణం జరిగే సమయంలో ఇంజినీర్లు సక్రమంగా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు ఉండవని ప్రజలు అంటున్నారు. ఇంజినీర్లు పట్టించుకోకపోవడం, కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వేయడంతో రోడ్లపై నీరు నిలుస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిమెంట్‌ రోడ్లపై బర్రెలు కట్టేసి వాటి మూత్రం కూడా నిల్వ ఉంటోంది.  దీంతో ఎక్కువగా దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా దాడులు చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే కరోనా దానికి తోడు దోమల వల్ల వచ్చే వ్యాధులతో ప్రజలు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు. బాత్‌ రూం నీరు సిమెంట్‌ రోడ్లు పైకి రాకుండా చేయాలని, వర్షం నీరు నిల్వ కుండా చర్యలు తీసుకోవాలని పలు సార్లు అధికారులకు విన్నపాలు చేస్తుకున్నామని ప్రజలు వాపోయారు. చింతంనగర్‌లో నిల్వ ఉన్న నీటిని తొలగించేందుకు పంచాయతీ అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. అయితే ఇంకా నీరు నిల్వ ఉందని, రాత్రి వేళలో దోమలతో అల్లాడుతున్నామని, దుర్వాసనలు తగ్గలేదని ప్రజలు వాపోతున్నారు. ఆయా ప్రాంతాల్లో స్కూళ్లు ఉన్నాయి. విద్యార్థులు కూడా దుర్వాసనలు తట్టుకోలేపోతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు తగు చర్యలు తీసుకుని సిమెంట్‌ రోడ్లపైకి నీరు నిల్వ కాకుండా చేయాలని, సిమెంట్‌ రోడ్లు పై బాత్‌రూం నీరు రాకుండా నివారించాలని, డ్రైనేజీని ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంత ప్రజలు కోరుతున్నారు.


Advertisement