వెలుగుల మాసం

ABN , First Publish Date - 2020-11-16T05:38:16+05:30 IST

ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే కార్తీకమాసం సోమవారంతో మొదలౌతుంది.

వెలుగుల మాసం


  1. నేటి నుంచి కార్తీకం
  2. శివకేశవులకు ప్రియమైన మాసం
  3. పూజలు, వ్రతాలు, దీక్షలకు సిద్ధం


 కర్నూలు(కల్చరల్‌), నవంబరు 15: ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే కార్తీకమాసం సోమవారంతో మొదలౌతుంది. శారీరక, మానసిక వికాసానికి దోహదపడే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ మాసంలో నిర్వహిస్తారు. పండుగలు, పూజలు, నోములు, వ్రతాలు, ఉపవాసాల నిర్వహణకు భక్తులు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని శివ, కేశవ ఆల యాల్లో కార్తీక మాస ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీశైలం, మహానంది, యాగంటి, మంత్రాలయం, అహోబిలం, మద్దిలేటి లక్ష్మీనర సింహ స్వామి, తర్తూరు రంగనాథస్వామి, గూడూరు రంగస్వామి, గోరంట్ల మాధవస్వామి క్షేత్రాలలో కార్తీకమాసం ఆరంభిస్తున్నారు. 

మానసిక వికాసం, ఆధ్యాత్మిక ప్రజ్ఞ ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని పొందు తాడని వేద పండి తులు చెబుతారు. మనిషిలో ఆధ్యాత్మిక భావుకత వికసిం చడానికి కార్తీక మాసానికి మించిన మాసం లేదు. హిందువుల ఇళ్లలో కార్తీక మాసంలో నిత్యం స్నానాలు, దాన, జప, ఉపవాస, వ్రతాలు కనిపిస్తాయి. ఈ ఏడాది తుంగభద్ర పుష్కరాలు ఆరంభమవుతున్నాయి. శబరిమల అయ్యప్ప భక్తులు మాల ధారణ చేస్తారు. మహిళలు సామూహికంగా కార్తీక దీపోత్సవంలో పాల్గొంటారు. కార్తీక వనభోజనాలు ప్రసిద్ధి పొందాయి. అయితే కరోనా నిబంధనలు ప్రభావం ఈ మాసంపైనా చూపనుంది.


కార్తీక సోమవారాలు

కార్తీక మాసంలో సోమవారాలకు ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని, నక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు  ఈ నక్షత్రంమీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది. సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవారం ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత వచ్చిందని పండితులు చెబుతారు. అలాగే సోమవారం ప్రీతికర మైనది కావడం కార్తీక మాసంలో సోమ వారం విశిష్టత సంతరిం చుకుంది. ఈ మాసంలో సోమవారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయించి, శివవ్రత నియమాలను పాటించడం వల్ల సిరి సంపదలు, సుఖ సౌఖ్యాలతో జనులు వర్ధిల్లుతారని శివపురాణం చెబుతోంది. 


శివకేశవులకు ప్రీతికరం

‘కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీమహా విష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదంతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం లేదు’ అని  స్కంద పురాణం చెబుతుంది. హిందూ పురాణాల ప్రకారం మనిషి చేసిన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి, అనంతమైన పుణ్య ఫలాలను అందించే మహిమాన్విత మాసమే కార్తీక మాసం. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండో మాసం. ఈ మాసంలోని పూర్ణిమ రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి తిథులలో శ్రీమహా విష్ణువును, మాస శివరాత్రి నాడు, సోమవారాల్లో శివుడిని బిల్వ పత్రాలతో పూజించాలని పెద్దలు చెబుతారు. శ్రీమహా విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లి, కార్తీక ఏకాదశి నాడు కళ్లు తెరుస్తాడని విష్ణుపురాణం చెబుతోంది. అందుకే ఈ మాసంలో ఆయా రోజుల్లో శివకేశవులను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. 


దీపారాధనలు.. నదీస్నానాలు

గృహిణులు  ఉభయ సంధ్యావేళల్లో దీపారాధన చేస్తారు. దీనివల్ల దైవాను గ్రహం కలుగు తుందని కార్తీక పురాణం చెబుతోంది. వెలిగే దీపం జ్ఞానానికీ, మోక్షానికి, శ్రేయస్సునకు, శుభ ఫలితాలకు సంకేతంగా భావిస్తారు. ఈ మాసంలో దీపం, బంగారం, నవధాన్యాలు దానం ఇవ్వడం వల్ల స్త్రీలకు ఐదోతనం నిలిచి ఉంటుందని,  సకల సౌభాగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇంటిముందు ముగ్గు వేసి దీపం వెలిగించడం, తులసి కోటలో దీపం పెట్టడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని కూడా వారు చెబుతున్నారు. 


కార్తీక మాసంలో స్నానాలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ మాసంలో వేకువజామునే నిద్రలేచి కృత్తికా నక్షత్రం అస్తమించేలోగా నదులు, చెరువుల్లో, అవి అందుబాటులో లేనప్పుడు గృహంలో తలస్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది. ఈ విధంగా స్నానంచేసి శివుడ్ని, లేదా విష్ణువుని, లేదా మరే దైవాన్నైనా ధ్యానించాలి. స్నానం చేసే సమయంలో అర్ఘ్యాదులు ఇవ్వడం వల్ల గంగానది, పుష్కర తీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్ర పండితులు సూచిస్తున్నారు. 


ఈ మాసంలో పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయాల నేది ఒక నియమం. దీనిని ‘నక్తం’ అంటారు. పగలు నిరాహారంగా ఉండలేని వారు పాలు, పండ్లు స్వీకరిస్తూ రాత్రి చంద్రదర్శనం చేసుకొని, తర్వాత దీపారాధ చేసుకొని భోజనం చేయాలని పండితులు చెబుతున్నారు. 


కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. శివుడు త్రిపురాసుడిని సంహరించిన రోజు ఇదే. అసుర శక్తులపై  విజయానికి చిహ్నంగా ఈ రోజు   దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. శివప్రీతి కోసం కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో తొమ్మిది ప్రమిదల్లోన్నైనా దీపాలు వెలిగించాలని పెద్దలు చెబతారు. చీకటిపడ్డాక ఆలయాల్లో జ్వాలా తోరణాలు వెలిగిస్తారు. ఆ తోరణాల కింద నుంచి శివపార్వతుల విగ్రహాలను తీసుకువెళతారు. కార్తీక పౌర్ణమి రోజున నదుల్లో, చెరువుల్లోనూ కార్తీక దీపాలు వెలిగించి వదులుతారు.   


కార్తీక మాసంలో ధాత్రీపూజలు విశేష ఫలితాలు ఇస్తాయని పురా ణాలు చెబుతున్నాయి. ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసం. కార్తీక మాసంలో ఉసిరిక వృక్షం కింద భోజనం చేయాలని  పండితులు చెబుతారు. 

Updated Date - 2020-11-16T05:38:16+05:30 IST