ప్రాణం మింగిన క్వారీ

ABN , First Publish Date - 2021-12-07T05:54:09+05:30 IST

అధికార పార్టీ నాయకుల కాసుల దాహానికి నిండు ప్రాణం బలైంది. ప్రమాదమని తెలిసినా క్వారీల్లో ఇష్టారాజ్యంగా ఖనిజాన్ని దోచేస్తున్నారు.

ప్రాణం మింగిన క్వారీ

  1. కొండరాళ్లు విరిగిపడి హిటాచీ ఆపరేటర్‌ మృతి
  2. కొచ్చెర్వు సమీపంలో అక్రమ తవ్వకాలు
  3. అనుమతి లేకుండా భారీ యంత్ర వినియోగం
  4. అధికార పార్టీవారి అడ్డగోలు వ్యవహారాలు


డోన్‌, డిసెంబరు 6: అధికార పార్టీ నాయకుల కాసుల దాహానికి నిండు ప్రాణం బలైంది. ప్రమాదమని తెలిసినా క్వారీల్లో ఇష్టారాజ్యంగా ఖనిజాన్ని దోచేస్తున్నారు. అనుమతులు లేకున్నా భారీ యంత్రాలతో తవ్వేస్తున్నారు. ఫలితంగా డోన్‌ మండలం కొచ్చెర్వు గ్రామ సమీపంలోని క్వారీలో సోమవారం కొండరాళ్లు విరిగి పడి హిటాచీ మిషన్‌ ఆపరేటర్‌ మహేష్‌ (21) అక్కడికక్కడే మృతి చెందాడు. కొచ్చెర్వు సమీపంలో తెనాలి సురేష్‌కు వెయిట్‌సెల్‌ క్వారీ ఉంది. డోన్‌, ప్యాపిలి మండలాల్లో కీలకంగా ఉన్న ఇద్దరు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఈ క్వారీ నడుస్తోంది. వారి ఆధ్వర్యంలోనే క్వారీలో భారీ ఎత్తున వెయిట్‌సెల్‌ ఖనిజాన్ని బయటకు తీస్తున్నారు. క్రిష్ణగిరి మండలంలోని కోయలకొండ గ్రామానికి చెందిన మహేష్‌ కొచ్చెర్వు సమీపంలోని క్వారీలో హిటాచీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ప్రతి రోజూ భారీ యంత్రంతో వందల టన్నుల ఖనిజాన్ని బయటకు తీస్తున్నాడు. ఇదే పనిలో నిమగ్నమై ఉండగా కొండపై ఉన్న రాళ్లు విరిగి యంత్రంపై పడ్డాయి. ఆపరేటర్‌ మహేష్‌ మీద కూడా పెద్ద బండరాయి పడింది. దీంతో మహేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కొందరు అధికార పార్టీ నాయకులు క్వారీ నుంచి హుటాహుటిన మృతదేహాన్ని డోన్‌ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. 


అక్రమ తవ్వకాలు


కొచ్చెర్వు సమీపంలోని వెయిట్‌సెల్‌ ఖనిజం లభించే క్వారీని డోన్‌ పట్టణానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త లీజుకు తీసుకున్నాడు. లీజు గడువు ముగిసిపోయింది. దీంతో అధికార పార్టీకి చెందిన కీలక నాయకులు ఆ క్వారీని ఆధీనంలోకి తీసుకున్నారు. క్వారీలో విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ప్రతి రోజూ వెయ్యి టన్నుల వరకు వెయిట్‌సెల్‌ ఖనిజాన్ని బయటకు తీస్తున్నట్లు సమాచారం. భారీ యంత్రాలను క్వారీలో ఏర్పాటు చేసుకుని ఖనిజాన్ని కొల్లగొడుతున్నారు. క్వారీలో తవ్వకాలకు బళ్లారి మైన్స్‌ సేఫ్టీ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతులు ఉండాలి. లేదంటే క్వారీలో యంత్రాలతో ఖనిజాన్ని బయటకు తీయకూడదు. కానీ అధికార పార్టీ నాయకులు ఆ నిబంధనలను తుంగలో తొక్కేశారు. భారీ యంత్రాలతో ముడి ఖనిజాన్ని ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయినా మైనింగ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని సమాచారం. 


అక్కడి ఖనిజమే ఫ్యాక్టరీలకు సరఫరా


డోన్‌ ప్రాంతంలో ఫర్టిలైజర్‌ ఫ్యాక్టరీలు విస్తృతంగా ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలకు అవసరమైన వెయిట్‌ సెల్‌ ముడి ఖనిజం కొచ్చెర్వు క్వారీ నుంచే సరఫరా అవుతోంది. కొచ్చెర్వు సమీపంలోని క్వారీల్లో వెయిట్‌ సెల్‌ ఖనిజం ఎక్కువగా లభిస్తుంది. ఇది అధికార పార్టీ కీలక నాయకులకు కల్పతరువుగా మారింది. ప్రతి రోజూ క్వారీ నుంచి డోన్‌ ప్రాంతంలోని ఫర్టిలైజర్‌ ఫ్యాక్టరీలన్నింటికీ ఖనిజాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజూ వెయ్యి టన్నుల వరకు వెయిట్‌సెల్‌ ఖనిజం సరఫరా అవుతోంది. టన్ను రూ.250 మాదిరిగా ముడి ఖనిజాన్ని ఫ్యాక్టరీలకు రవాణా చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా రూ.లక్షలు అక్రమంగా ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 


బెంచ్‌ సిస్టమ్‌ నిబంధనలకు తూట్లు


క్వారీల్లో బెంచ్‌ సిస్టమ్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. కొచ్చెర్వు సమీపంలోని క్వారీల్లో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. బెంచ్‌ సిస్టమ్‌ పద్ధతిలో ఖనిజాలను వెలికితీయాలని భూగర్భ గనుల శాఖ నిబంధనలు ఉన్నాయి. క్వారీల్లో ప్రమాదాలను నివారించేందుకు బెంచ్‌ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు. ఈ విధానంలో క్వారీల్లో స్టెప్‌ బై స్టెప్‌ ఖనిజాలను వెలికి తీయాల్సి ఉంటుంది. కానీ.. కొచ్చెర్వు క్వారీల్లో బెంచ్‌ సిస్టమ్‌ ఎక్కడా అమలు కాలేదు. అధికార బలంతో అడ్డగోలుగా ఖనిజాన్ని దోచేశారన్న విమర్శలు ఉన్నాయి. క్వారీల్లో కింద నుంచి పై వరకు నేరుగా తవ్వి తీశారు. ప్రమాదాలు జరగకుండా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. క్వారీల్లో కొండను చూస్తేనే ప్రమాదకరంగా కనిపిస్తోంది. అలాంటి క్వారీలో భారీ యంత్రాలతో పని చేసే ఆపరేటర్లకు ఏమాత్రం భద్రత లేదని స్పష్టమౌతోంది. బెంచ్‌ సిస్టమ్‌ లేనందువల్లే కొండరాళ్లు విరిగి పడి ఆపరేటర్‌ మహేష్‌ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అయినా భూగర్భ గనుల శాఖ అధికారులు నోరు మెదపక పోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-12-07T05:54:09+05:30 IST