లైఫ్ ఆఫ్టర్ కరోనా: ఆక్వారంగ రైతుల బాధలు వర్ణనాతీతం

ABN , First Publish Date - 2020-05-16T00:06:39+05:30 IST

రొయ్యల చెరువుల వద్ద సందడి లేదు. చేపల చెరువుల దగ్గర బేరం లేదు. ఆక్వా ఉత్పత్తులకి సరైన గిట్టుబాటు ధర లేదు.

లైఫ్ ఆఫ్టర్ కరోనా: ఆక్వారంగ రైతుల బాధలు వర్ణనాతీతం

కరోనా వ్యాప్తి.. లాక్‌డౌన్‌ విధింపు వంటి పరిణామాలు ఆక్వారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆక్వా ఉత్పత్తుల సేకరణ, రవాణా, ఎగుమతి వంటి అంశాల్లో తీవ్ర ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. దీంతో ఆక్వా సాగుపై ఆధారపడిన ఎందరో రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. ఆక్వా ఎగుమతుల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్‌ కొత్త కష్టాలను ఎదుర్కొంటోంది. 


రొయ్యల చెరువుల వద్ద సందడి లేదు. చేపల చెరువుల దగ్గర బేరం లేదు. ఆక్వా ఉత్పత్తులకి సరైన గిట్టుబాటు ధర లేదు. దీంతో కౌంట్‌ బాగున్నా.. వలలు వేయడానికి రైతులు వెనుకాడుతున్నారు. ఒకవేళ పట్టివేత చేపట్టినా సరుకుని ఎగుమతి చేసే మార్గం లేదు. ఆక్వా బిజినెస్‌ మొత్తం కొలాప్స్‌ అయ్యింది. ఈ పరిణామం అంతటికీ కరోనా భయమే ప్రధాన కారణం. మన దేశంతోపాటు పలు ఇతర దేశాల్లో లాక్‌డౌన్‌ విధించడం, అంతర్జాతీయ రాకపోకలపై తాత్కాలికంగా బ్యాన్‌ విధించడం వంటి అంశాలు ఆక్వా రైతుల ఆశలని తూట్లు పొడిచాయి. రోడ్డు, రైలు, వాయు మార్గాలన్నీ మూతపడటంతో వేరే దేశాలకు కాదు కదా.. కనీసం పొరుగు జిల్లాలకు కూడా ఆక్వా ఉత్పత్తులను రవాణా చేయలేని దుస్థితి! 


ఆక్వారంగ రైతుల బాధలు వర్ణనాతీతం. ఒక పక్క ఫీడ్‌ సమస్య.. మరో పక్క రవాణాకి అవసరమైన వాహనాలు రావు. కావలసినంత ఐస్‌ దొరకదు. ప్రాసెసింగ్‌ యూనిట్లు పనిచేయవు. ఎగుమతి ఆర్డర్లు సైతం రద్దయ్యాయి. ఇలా ఒకదాని తర్వాత మరో సమస్య ఆక్వా రైతుని అల్లాడించేస్తోంది. కొద్ది మంది పెద్ద రైతులు మినహా మిగతా అందరి పరిస్థితి ఇలాగే ఉంది! 


ఆక్వా ఉత్పత్తుల్లో అత్యధికం రొయ్యలు, ఆ తర్వాత స్థానంలో చేపలు, కొంత మేర పీతలు ఉంటాయి. ఆక్వా కల్చర్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌కి అగ్రస్థానం. రాష్ట్రంలో తొలుత చేపల పెంపకం మొదలైంది. 1990ల తర్వాత రొయ్యల సాగు ఊపందుకుంది. మన దేశం నుంచి విదేశాలకు జరిగే రొయ్యల ఎగుమతుల్లో మూడింట రెండు వంతులు ఒక్క ఏపీ నుంచే జరుగుతున్నాయి. తద్వారా ఎంతో విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. 


ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది తీరప్రాంత జిల్లాలో ఆక్వా సాగు జరుగుతోంది. 975 కిలోమీటర్ల పొడవునా రొయ్యలు, చేపల చెరువులు విస్తరించి ఉన్నాయి. నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలు ఆక్వా సిరులకి పెట్టింది పేరు! ఉప్పునీటి- మంచినీటి చెరువుల్లో రొయ్యలు, చేపల పెంపకం జరుగుతుంటుంది. ఈ ప్రాంతంలోనే రొయ్యల సీడ్‌, చేపల సీడ్‌ తయారీ కేంద్రాలు అధికంగా ఉన్నాయి. రొయ్యలు, చేపల ఫీడ్‌ వ్యాపారం కూడా జోరుగా సాగుతుంటుంది. చేపలను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. రొయ్యలు మాత్రం నూరుశాతం విదేశాలకే ఎగుమతి అవుతాయి. 2018- 2019 సంవత్సరంలో రొయ్యల ఎగుమతి ద్వారా దేశానికి 4, 610 మిలియన్‌ డాలర్ల ఆదాయం లభిస్తే.. ఇందులో ప్రధాన వాటా ఆంధ్రప్రదేశ్‌దే అని చెప్తే ఆశ్చర్యం లేదు! 


ఏపీ నుంచి ప్రధానంగా చైనా, అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌, దుబాయ్‌, సౌదీ అరేబియా, ఒమన్‌, ఖతార్‌, కాంబోడియా వంటి దేశాలకు ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. చెన్నై, కృష్ణపట్నం పోర్టుల ద్వారా సముద్రమార్గంలో ఈ రవాణా జరుగుతుంటుంది. ప్రాసెసింగ్‌ చేసిన కంటైనర్లలో సరుకుని భద్రంగా నిల్వచేసి పంపుతారు. నిజానికి మార్చి, ఏప్రిల్‌ నెలల మధ్య రొయ్యలు పెద్ద ఎత్తున మార్కెట్‌కి వస్తాయి. అయితే కరోనా కారణంగా అంతర్జాతీయ రాకపోకలు నిలిచిపోవడంతో.. రొయ్యల ఎక్స్‌పోర్ట్‌ బిజినెస్‌ జీరోకి పడిపోయింది. ఎగుమతి ఆర్డర్లకి బ్రేక్‌పడటంతో ప్రాసెసింగ్‌ యూనిట్ల యజమానులు పనులు బంద్‌ చేశారు. దీంతో ఆక్వా రైతులు ఆగమాగం అవుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా  దేశవ్యాప్తంగా మాల్స్‌, హోటల్స్‌ వంటివి బంద్‌ కావడంతో స్థానికంగా కూడా ఆక్వా ఉత్పత్తులకి డిమాండ్‌ కొరవడింది. ఆక్వా సాగుకు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలు కూడా ఎంతో కీలకం. ఈ సీజన్‌లో ఆక్వా సాగుకు క్రాప్‌ హాలీడే ప్రకటించవచ్చునన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే హెచరీల నుంచి రొయ్య పిల్లల కొనుగోళ్లు, కంపెనీల నుంచి మేత కొనుగోళ్లు వంటివి ఆగిపోతాయి. ఆయా కంపెనీలూ ఆటుపోట్లకి గురవుతాయి. వాటిపై ఆధారపడినవారి ఉపాధి కూడా దెబ్బతింటుంది. 


ఆక్వా సాగులో సాధకబాధకాలు అనేకం. ఎప్పుడూ ఏదో ఒక కష్టం రైతులను వెంటాడుతుంటుంది. తాజాగా ఇప్పుడు కరోనా వైరస్‌ తోడయ్యింది. రైతులను  లాక్‌డౌన్‌లోకి నెట్టేసింది. రొయ్యలు, చేపల చెరువులపై భారీగా పెట్టుబడులు పెట్టినవారికి దిక్కుతోచడం లేదు. ఇది లైవ్‌ స్టాక్‌తో కూడిన వ్యాపారం కనుక.. నిర్దిష్ట సమయంలో ఉత్పత్తి, దిగుబడి, ఎగుమతి వంటివి జరిగిపోవాలి. లేదంటే నష్టాలు మూటగట్టుకోవల్సిందే! డిసెంబ‌ర్, జ‌న‌వ‌రి నెలల్లో చెరువుల్లో వేసిన సీడ్ ఇప్పుడు చేతికందే ద‌శ‌కి చేరింది. దీన్ని మార్కెట్‌కి త‌ర‌లించాల‌నే ఆలోచన‌లో రైతులు ఉన్నప్పుడే లాక్‌డౌన్ అనే పిడుగు వారిపై పడింది.  


ఇప్పుడున్న పరిస్థితుల్లో రొయ్యలు లేదా చేపలను నిల్వ చేసుకునే అవకాశం రైతులకి లేదు. శీతల గిడ్డంగులన్నీ నిండిపోయాయి. దేశీయ మార్కెట్‌లోనూ డిమాండ్‌ లేదు. దీంతో రెంటికీ చెడ్డ రేవడి అన్నట్టుగా తయారైంది ఆక్వా రైతుల పరిస్థితి. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో ఏపీకి చెందిన ఎక్కువ మంది రైతులు 1990ల తర్వాత ఈ రంగంవైపు అడుగులు వేశారు. ఎక్స్‌పోర్ట్స్‌కి మార్గం సుగమం కావడం వారికి బాగా కలిసివచ్చింది. ఆక్వా లాభదాయకంగా ఉండటంతో లిక్కర్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారసంస్థలు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. మొదట్లో చేపల ఉత్పత్తిపై దృష్టిపెట్టినా తర్వాత కాలంలో రొయ్యలసాగు వారికి బాగా కలిసొచ్చింది. స్థానిక రైతులు తొలినాళ్లలో టైగర్‌ రొయ్యల వైపు మొగ్గుచూపారు. ఇప్పుడు వనామీ రకం రొయ్యలను ఎక్కువగా సాగుచేస్తున్నారు. 2017- 2018 నాటికి ఏపీలో 62, 342 హెక్టార్లలో వనామీ రకం రొయ్యల సాగు జరిగింది. 2018- 2019 లెక్కల ప్రకారం దేశంలో 6.14 లక్షల టన్నుల రొయ్యల దిగుబడి వస్తే.. అందులో 4.59 లక్షల టన్నులు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉత్పత్తి కావడం గమనార్హం! ఆ తర్వాత స్థానాల్లో బెంగాల్‌, గుజరాత్‌, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాలున్నాయి. 


రొయ్యల సాగులో 40-70, 80-100 కౌంట్‌ మధ్యలో రొయ్యలు ఎక్కువగా పెరుగుతుంటాయి. కిలోకి 30, 40, 50 కౌంట్‌ వచ్చే రొయ్యలకి ఎగుమతుల మార్కెట్‌లో గిరాకీ ఎక్కువ. అంత కౌంట్‌ వచ్చే వరకు చెరువుల్లో వాటిని జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత రైతులపై ఉంటుంది. ఇప్పుడు చాలా చెరువుల్లో 30 కౌంట్‌ వచ్చిన రొయ్యలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని పట్టడం, ప్రాసెసింగ్‌ యూనిట్లకి తరలించడం వంటి పనులు సజావుగా సాగే అవకాశం లేకపోవడంతో రైతాంగం దిగులు పడుతోంది! ఎక్స్‌పోర్ట్‌ లేకపోవడంతో ఇప్పటికే కోల్డ్‌ స్టోరేజీలన్నీ ఆక్వా స్టాక్‌తో నిండిపోయాయి. కొత్తగా పట్టివేత చేపడితే ఆ సరుకుని ఏంచేసుకోవాలో తెలియని పరిస్థితి! దీంతో రొయ్య ధర కూడా అంతకంతకూ తగ్గిపోయింది. ఫిబ్రవరిలో 30 కౌంట్‌ ఉన్న కిలో రొయ్య ధర 480 రూపాయలు ఉండేది. లాక్‌డౌన్‌ తర్వాత 250 రూపాయలకు ఇస్తామన్నా కొనేవాళ్లు దొరకడం లేదు. పోనీ.. వాటిని చెరువుల్లోనే కాపాడుకుందామంటే తగినంత మంది కూలీలు అందుబాటులో లేరు. దీంతో తమకి దిక్కుతోచడం లేదని ఆక్వా రైతులు ఆవేదన చెందుతున్నారు. 




డిసెంబర్‌లో ఆక్వా మేత ధరలను వ్యాపారులు టన్నుకి 6 వేల రూపాయల చొప్పున పెంచేశారు. ఎకరా చెరువులో రొయ్య కిలో 50 కౌంట్‌కి రావాలంటే సుమారు 6 లక్షల రూపాయల వరకు ఖర్చువుతుంది. 30, 40 కౌంట్‌కి చేరాలంటే ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. తెల్ల మచ్చల వ్యాధి, ఆక్సిజన్‌ లోటు వంటి సమస్యలు తలెత్తితే రైతులు హడలిపోతారు. ఎందుకంటే ప్రతి చిన్న అంశమూ ఈ వ్యాపారాన్ని అతలాకుతలం చేసేస్తుంది. ఇలాంటి క్లిష్ట సమస్యలన్నీ ఎదుర్కొని సాగు చేతికి అందుతుందన్న సమయంలో కరోనా పడగ విప్పింది.. ఆక్వా రైతుకి నిద్రలేకుండా చేసింది. ఈ ఒక్క సీజన్‌లోనే ఏపీలోని ఆక్వా రైతులు సుమారు 1200 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయినట్టు అంచనా! ఏదో ఒక ధరకి రొయ్యలను విక్రయించడానికి రైతులు సిద్ధపడుతున్నా ప్రతిబంధకాలు తప్పడంలేదు. రొయ్య తల తీసి ఇస్తే కొనుగోలు చేస్తామని కమీషన్‌దారులు షరతు పెడుతున్నారు. ఇదే తరుణంలో ప్రాసెసింగ్‌ ప్లాంట్లలో రొయ్య తల ఒలిచే కూలీలు దొరకడం లేదు. 


ఆక్వా రైతుల సమస్యలను గమనించిన ఏపీ సర్కారు 50 మంది సిబ్బందితో ప్రాసెసింగ్‌ ప్లాంట్లను నిర్వహించుకోవచ్చునని తాజాగా అనుమతి ఇచ్చింది. ఆక్వా ఉత్పత్తులకి మద్దతు ధర కూడా ప్రకటించింది. మద్దతు ధర లభించేలా నోడల్ ఏజెన్సీగా "ద మెరైన్ ప్రొడ‌క్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ'' అంటే ఎంపెడాకు అధికారాలు ఇచ్చామని చెప్పింది. అయితే ఈ వెసులుబాటులేవీ వెంటనే ఆక్వా రంగంపై ప్రభావం చూపించకపోవచ్చునని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రాసెసింగ్‌ యూనిట్లు అన్నీ పూర్తిస్థాయిలో పని మొదలుపెట్టి, శీతల గిడ్డంగుల్లో ఉన్న సరుకు కంటైనర్లలోకి లోడ్‌చేసి.. ఎగుమతులు చేపట్టినప్పుడే రైతులు ఊపిరి పీల్చుకుంటారని వారు చెబుతున్నారు. 


కరోనా వార్తలు వెలువడిన కొత్తల్లో లేదా లాక్‌డౌన్‌ విధించే ముందు కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వారంగ ప్రాధాన్యాన్ని అంతగా గమనంలోకి తీసుకోలేదు. ఏటా వేలకోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చిపెడుతున్న ఈ రంగానికి సరైన ప్రత్యామ్నాయం సూచించలేదు. ఆ పని చేసి ఉంటే ప్రస్తుత సమస్యలు తలెత్తేవి కాదని ఆక్వా రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే విబ్రియా వైరస్‌ కారణంగా రొయ్యలసాగు దెబ్బతింటోంది. ఆ దెబ్బ మీద కరోనా మరో దెబ్బ కొట్టింది. ఉన్న సరుకు పట్టివేతకు అవకాశం లేకపోగా.. చెరువుల నిర్వహణకు, లైవ్‌ స్టాక్‌ని కాపాడుకోవడానికి అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఇవీ ప్రస్తుతం ఆక్వా రైతులను అల్లాడిస్తున్న ప్రధాన సమస్యలు. ఈ గండం నుంచి వారు గట్టెక్కడానికి కేంద్ర- రాష్ట్రప్రభుత్వాలు ఎలాంటి చేయూత అందిస్తాయో చూద్దాం. 


ఆక్వా రైతులు దేశానికి సిరుల పంట అందిస్తున్నారు. అలాంటి వారిని ఆదుకోవడం పాలకుల తక్షణ బాధ్యత. లాక్‌డౌన్‌ కారణంగా వారికి జరిగిన నష్టాన్ని పూడ్చడంతోపాటు.. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు అవసరమైన అన్ని చర్యలు వెంటనే చేపట్టాలి. అప్పుడే.. వారి ముఖాల్లో ఆనందం చూడగలుగుతాం. 

Updated Date - 2020-05-16T00:06:39+05:30 IST