కరోనాను కట్టడి చేద్దాం

ABN , First Publish Date - 2020-03-28T12:00:32+05:30 IST

నారాయణపేట మండలంలోని బోయిన్‌పల్లి తండా, సీకరమోని తండాలకు చెందిన దాదాపు 28మంది శుక్రవారం ముంబై నుంచి పేటకు

కరోనాను కట్టడి చేద్దాం

మాస్కులను అందించిన ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

సరిహద్దులో వలస వాసులకు తప్పని తిప్పలు

మక్తల్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌

పల్లెల్లో పెరుగుతున్న వలసల కార్మికులు

వెయ్యికి పెరిగిన వలస కూలీల సంఖ్య

స్టాంపులు వేసుకున్నా బయట తిరుగుతున్న దృశ్యం

మాగనూరు మీదుగా కాలినడకన వెళ్తున్న కూలీలు


 నారాయణపేట రూరల్‌/కోస్గి/మక్తల్‌ టౌన్‌/ఊట్కూరు/మాగనూరు, మార్చి 27 : నారాయణపేట మండలంలోని బోయిన్‌పల్లి తండా, సీకరమోని తండాలకు చెందిన దాదాపు 28మంది శుక్రవారం ముంబై నుంచి పేటకు వచ్చారు. పేట సరిహద్దులోని జలాల్‌పూర్‌ చెక్‌పోస్టు దగ్గర ఏర్పాటు చేసిన వైద్య శిబిరం దగ్గర ఏఎన్‌ఎం యశోద వారిని ఆపి పరీక్షించారు. డీఅండ్‌హెచ్‌ఓ శైలజ ప్రత్యేక చొరవ తీసుకుని వారిని 104వాహనంలో స్వగ్రామానికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. మండలంలోని కోటకొండ గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న నాటుసారా, బీరు సీసాలను నవ యువత సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టుకుని కాల్చివేశారు. కోస్గిలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పర్యటించారు. పట్టణంలో కరోనా వైరస్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు.


పట్టణంలో ప్రజలకు మాస్కులను అందించారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మ్యాకల శిరీష మునిసిపల్‌ కమిషనర్‌ శామ్యూల్‌జాన్‌, సీఐ ప్రేమ్‌కుమార్‌, జడ్పీటీసీ ప్రకాష్‌రెడ్డి, నాయకులు రాజేష్‌, కొడిగంటి హరికుమార్‌, నషీర్‌, ఓం ప్రకాష్‌, బాలేష్‌, మాస్టర్‌ శ్రీను, హన్మంత్‌, జగధీశ్వర్‌రెడ్డి తదితరులున్నారు. మక్తల్‌లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. పుర చైర్మన్‌ పావని సిబ్బందితో కలిసి మక్తల్‌ పట్టణంలో ఫాగింగ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాల్చెడ్‌ మల్లికార్జున్‌, సిబ్బంది పాల్గొన్నారు. ఊట్కూరు మండలానికి వలస వెళ్లిన ప్రజలు తిరిగి వస్తున్నారు. ముంబై, షోలాపూర్‌, బెంగళూర్‌, హైదారాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి కాలినడకన వస్తున్నారు. శుక్రవారం తిమ్మారెడ్డిపల్లి తండా, వల్లంపల్లి, ఓబ్లాపూర్‌, పగిడిమారి, అమీన్‌పూర్‌ ఇతర గ్రామాలకు సైతం కలిపి మండలంలో మొత్తం 254 మంది వచ్చారు.


ఇదిలా ఉంటే వక్ఫ్‌బోర్డు అధికారులతో పాటు, దేశంలోని ముస్లిం మత పెద్దలు ఇచ్చిన పిలుపుతో మండల వ్యాప్తంగా శుక్రవారం ప్రార్థనలు ప్రజలు వ్యక్తిగతంగా తమ ఇండ్లల్లో పూర్తి చేసుకున్నారు. ఏఎస్పీ భరత్‌, మఖ్తల్‌ సీఐ శంకర్‌ ఊట్కూర్‌, తహసీల్దార్‌ దానయ్య, ఎంపీడీఓ జయశంకర్‌ ప్రసాద్‌, ఎస్సై అబ్దుల్‌ రషీద్‌, డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డిల బృందం మండలంలో సందర్శించి రాకపోకల పరిస్థితిని పరిశీలించింది. కర్ణాటకలోని రాయిచూర్‌ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కార్మికులు మహబూబ్‌నగర్‌లో ఇటుక బట్టిలో పని చేసేవారు. కరోనా వైరస్‌ కారణంగా వారంతా  తిరిగి తమ తమ స్వగ్రామాలకు 75 కిలో మీటర్ల మేరక కాలినడకన వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచు రాజు, జానకమ్మ, మంజుల, జయప్రద, జడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, సుదర్శన్‌ గౌడ్‌, ఎస్సై శివ నాగేశ్వర్‌ నాయుడు, ఉప సర్పంచ్‌ సుధాఆంజనేయులు, వీఆర్‌వో, వీఆర్‌ఏలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


ఎస్‌ఐ శివనాగేశ్వర్‌ నాయుడు మాగనూరులో పలు కిరాణ దుకాణాలను పరిశీలించారు. నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్సై వెంబడి సర్పంచ్‌ రాజు, ఉప సర్పంచ్‌, వార్డు మెంబర్లు పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.


Updated Date - 2020-03-28T12:00:32+05:30 IST