పట్టణప్రగతిలో అగ్రభాగాన నిలుద్దాం

ABN , First Publish Date - 2022-05-20T05:38:50+05:30 IST

పట్టణప్రగతిలో అగ్రభాగాన నిలుద్దామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులకు సూచించారు.

పట్టణప్రగతిలో అగ్రభాగాన నిలుద్దాం
హైదరాబాద్‌లో పట్టణ ప్రగతిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

జూన్‌ 3 నుంచి కార్యక్రమం ప్రారంభం

మున్సిపాలిటీల రూపురేఖలు మారాలి

ఉమ్మడి మెదక్‌ జిల్లా మున్సిపాలిటీలు ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండాలి

వనరులు ఉన్న చోట కొత్త మత్స్య సహకార సంఘాల ఏర్పాటు 

ఎమ్మెల్యేలు, అధికారుల సమీక్షా సమావేశంలో

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు


సంగారెడ్డిరూరల్‌/మెదక్‌ మే19: పట్టణప్రగతిలో అగ్రభాగాన నిలుద్దామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులకు సూచించారు.  పట్టణప్రగతిపై గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. వచ్చేనెల జూన్‌3 నుంచి పట్టణప్రగతి ప్రారంభమవుతుందని, కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పల్లెప్రగతితో రాష్ట్రంలోని గ్రామాలు చక్కటి రూపును సంతరించుకున్నాయని, అదేస్థాయిలో మున్సిపాలిటీలు మాత్రం బాగుపడలేదన్నారు. ఈ దఫా పట్టణ ప్రగతిలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల రూపురేఖలు మారాలన్నారు. మున్సిపాలిటీల్లో వైకుంఠధామాలు, వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ పనులు వేగవంతం చేయాలని, మొక్కలు పెద్దఎత్తున పెంచాలని, వాటి సంరక్షణ బాధ్యత మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులదేనని మంత్రి స్పష్టం చేశారు. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం మొక్కల సంరక్షణ చేపట్టకపోతే మున్సిపల్‌ ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీల్లో అన్ని డ్రైన్లు, మోరీలు శుభ్రం చేయాలని సూచించారు. 


చెత్త సేకరణలో మధ్యప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

చెత్త సేకరణ విషయంలో మధ్యప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఆ రాష్ట్రంలోని ఇండోర్‌ పట్టణం ఐదు సార్లు జాతీయ అవార్డు సాధించిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అక్కడ ఐదు రకాలుగా చెత్త సేకరణ చేపడుతున్నారని చెప్పారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి అవసరమయితే సిబ్బంది, ప్రజాప్రతినిదులను ఇండోర్‌ పర్యటనకు ప్రభుత్వం పంపుతుందని, అక్కడి విషయాలు నేర్చుకుని మనం కూడా ఇక్కడ అమలు చేద్దామన్నారు. చాలా మున్సిపాలిటీల్లో డంప్‌యార్డు నిర్మాణాలు పూర్తికాలేదని, ఆ నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ మున్సిపాలిటీలో మంచి స్థలం చూసి బృహత్‌ పట్టణ ప్రగతి వనం ఏర్పాటు చేయాలని, మియా వాకీ (యాదాద్రి మోడల్‌) ప్లాంటేషన్‌ చేపట్టాలని, ప్రతి మున్సిపాలిటీలో స్థల సేకరణ చేపట్టి క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలన్నారు. యూత్‌ కమిటీ వేయాలని ఆ కమిటీకి ప్రభుత్వం క్రీడాసామగ్రి సరఫరా చేస్తుందన్నారు. మన దేశంలో, రాష్ట్రంలో బీపీ, షుగర్‌, డయాబెటిక్‌ పేషంట్లు పెరుగుతున్నారని, ఈ విషయాన్ని సీఎం గుర్తించి ఆరోగ్యవంతులైన పౌరులను తయారుచేసేందుకు క్రీడలు అవసరమని అందుకు మైదానాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు.  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గ్రీన్‌ఫండ్స్‌ మున్సిపాలిటీల్లో ప్లాంటేషన్‌ కోసమే ఖర్చు చేయాలన్నారు. ప్రతి మున్సిపాలిటిలో నీటికనెక్షన్‌ పూర్తిగా ఇచ్చారా? లేదా? అని చూడాలని, నల్లా కనెక్షన్లు ప్రతి ఇంటికీ ఇవ్వాలని, దీంతో పాటు నీటి పన్ను పూర్తిగా వసూలు చేయాలని సూచించారు. ఇష్టానుసారంగా నీటిని వదలకుండా ప్రతిరోజు క్రమపద్ధతిలో నీరు వదిలేలా మున్సిపల్‌ కమిషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు.  మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలలు, ఆసుపత్రులు పరిశుభ్రంగా ఉంచాలని, మొక్కలు పెంచి ప్రతి ప్రభుత్వ ప్రాంగణాల్లో క్లీనంగ్‌ అండ్‌ గ్రీనింగ్‌ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పట్టణ ప్రగతితో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల రూపురేఖలు మారాలని, అధికారులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. 


తెలంగాణ  మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శంగా నిలవాలి

తెలంగాణ మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శంగా నిలవాలని, అందులో ఉమ్మడి మెదక్‌ జిల్లా మున్సిపాలిటీలు అగ్రభాగాన ఉండాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో, మున్సిపాలిటీల వారీగా నల్లా కనెక్షన్లు, మున్సిపల్‌ నీటి పన్నుల వసూలు తీరు,డంపుయార్డు, వైకుంఠధామం, వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెటఖ్‌ నిర్మాణ పనులు పురోగతి మొక్కలను పెంచి వాటిని సంరక్షించాలని కలెక్టర్లకు సూచించారు. ఎర్టీబడ్‌ స్కీంలో భాగంగా ఐదు శాతం రిబెడ్‌తో పన్ను వసూళ్లు చేసి రాష్ట్రంలో జహీరాబాద్‌ తొలి స్థానంలో నిలవడంపై మంత్రి హరీశ్‌రావు జహీరాబాద్‌ మున్సిపల్‌ సిబ్బందిని అభినందించారు. సమీక్షా సమావేశంలో ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి,  క్రాంతికిరణ్‌, పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మాణిక్‌రావు, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఫారుఖ్‌హుస్సేన్‌, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, ఫారెస్ట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, సంగారెడ్డి, మెదక్‌ కలెక్టర్లు హన్మంతరావు, హరీశ్‌, మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, మున్సిపల్‌ కమిషనర్లు, చైర్మన్లు పాల్గొన్నారు.


కాళేశ్వరం జలాలతో చెరువులు  కళకళ 

చెరువులు, జలాశయాలు కాళేశ్వరం నీటితో కళకళలాడుతున్నాయని,  వీటిలో చేపల పెంపకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మత్స్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త మత్స్యపారిశ్రామిక సంఘాలను ఏర్పాటు చేయాలని, నూతన సభ్యత్వాలు ఇవ్వాలని మత్స్యకారులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారని త్వరలోనే సంఘాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిపారు. గతంలో నీటి వనరులు లేనప్పుడు రెండున్నర ఎకరాలకు ఒకరు చొప్పున మత్స్య కార సంఘ సభ్యునిగా ఎంపిక చేశారని, కానీ ఇప్పుడు సమృద్ధిగా నీటి వనరులు పెరగడంతో ఎకరాకు ఒక సభ్యున్ని ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మెదక్‌ జిల్లాలో 263 సొసైటీల్లో 15,724 సభ్యులు ఉన్నారని, జిల్లావ్యాప్తంగా 1379 జలాశయాలను వారు వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఇంకా 235 నీటి వనరులకు కొత్తగా సొసైటీలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సొసైటీలో సభ్యులు ఎక్కువగా ఉంటే బీమా, రుణ సౌకర్యం సులువుగా లభిస్తుందని వారందరికీ ప్రభుత్వ సబ్సిడీ పథకాలు అందుతాయని తెలిపారు. మండలాలు, నియోజకవర్గాల వారీగా నీటి వనరుల పరిస్థితిని లెక్కగట్టాలని, మత్స్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో పాటు మెదక్‌, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌ రెడ్డి, మదన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, మత్స్యశాఖ కమిషనర్‌ లచ్చిరామ్‌ భూక్యా, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T05:38:50+05:30 IST