రాజ్యాంగ రక్షణ కోసం కలిసి పోరాడుదాం

ABN , First Publish Date - 2022-05-20T05:27:41+05:30 IST

రాజ్యాంగ రక్షణ కోసం కలిసి పోరాడుదామని తెలంగాణ అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మెన్‌ గజ్జల కాంతం పిలుపునిచ్చారు.

రాజ్యాంగ రక్షణ కోసం కలిసి పోరాడుదాం
సమావేశంలో మాట్లాడుతున్న గజ్జెల కాంతం

సుభాష్‌నగర్‌, మే 19: రాజ్యాంగ రక్షణ కోసం కలిసి పోరాడుదామని తెలంగాణ అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మెన్‌ గజ్జల కాంతం పిలుపునిచ్చారు. గురువారం నగరంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని వర్గాల మేధావులు, ప్రజా, కుల సంఘాల నాయకులతో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ దేశానికి అందించిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ రిజర్వేషన్లు నిర్వీర్యం చేస్తూ అమలు చేయడం లేదన్నారు. రిజర్వేషన్లు అమలు చేయాల్సి వస్తుందనే రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ వంటి 23 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ సూచనలు పాటిస్తోందని, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కుట్రలు చేస్తోందన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని ఓ కేంద్ర మంత్రి మాట్లాడారని, దానిని ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి ఖండించలేదన్నారు. 2014 నుంచి ఈ రోజు వరకు రిజర్వేషన్లు అమలు చేయలేదని విమర్శించారు.  రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉద్యోగాల ప్రకటనతో కలిపి మొత్తం లక్షా 20 వేల ఉద్యోగాలను కల్పించిందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో  రిజర్వేషన్లు అమలు కావడంలేదన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో దళిత, గిరజన, మైనార్టీ వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఏకమై పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. జూన్‌ 11న కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో తలపెట్టిన రాజ్యాంగ రక్షణ ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గోని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సముద్రాల అజయ్‌, క్యాదాసి ప్రభాకర్‌, కైరొద్దీన్‌, సర్దార్‌ రాణా, బొంకూరి సురేందర్‌సన్ని, షమీమ్‌, నీర్ల ప్రభాకర్‌, యనమల మంజుల, కేమసారం తిరుపతి, కేమసారం సమ్మయ్య, జీఎస్‌ ఆనంద్‌, గర్రె రాజయ్య, పెద్దెల్లి శేఖర్‌, కొలిపాక శ్రీనివాస్‌, కందుల చంద్రయ్యగౌడ్‌, భీమాసాహెబ్‌, సందబోయిన రామకృష్ణ, కోండ్ర స్వరూప పాల్గొన్నారు.


Updated Date - 2022-05-20T05:27:41+05:30 IST