పిల్లలనైనా బతకనివ్వండి

ABN , First Publish Date - 2021-08-20T07:57:35+05:30 IST

‘‘మేము ఏమైపోతామో తెలియదు. మా భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

పిల్లలనైనా  బతకనివ్వండి

  • కాబూల్‌ ఎయిర్‌పోర్టు వద్ద హృదయవిదారక దృశ్యాలు
  • ముళ్ల కంచెల మీదుగా తమ పిల్లలను విదేశీ సైనికులకు అప్పగిస్తున్న తల్లిదండ్రులు..
  • లోపలికి విసిరేస్తున్న మరికొందరు
  • విమానాశ్రయం వద్ద ఇప్పటిదాకా 12 మంది మృతి
  • నిరసనకారులపై కొనసాగుతున్న తాలిబన్ల అరాచకాలు
  • అసదాబాద్‌లో కాల్పులు.. పలువురి మృతి, కొందరికి గాయాలు
  • అప్ఘానిస్థాన్‌కు ఆయుధాలు అమ్మకూడదని అమెరికా నిర్ణయం


కాబూల్‌, ఆగస్టు 19: ‘‘మేము ఏమైపోతామో తెలియదు. మా భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కనీసం మా పిల్లలనైనా ఈ నరకం నుంచి బయటకు పంపాలి’


..ఇదీ ప్రస్తుతం చాలామంది అఫ్ఘాన్‌ తల్లిదండ్రుల మనసుల్లో మెదులుతున్న మాట. అందుకే.. గుండెను బండరాయిగా చేసుకుని.. ఇక పిల్లల్ని తమ జీవితంలో చూడలేమని తెలిసీ.. కన్నబిడ్డలను విమానాశ్రయం చుట్టూ వేసిన ఇనప ముళ్లకంచెల మీదుగా అవతలివైపు ఉన్న విదేశీ సైనికులకు ఇచ్చేస్తున్నారు. వారు తీసుకోవడానికి ముందుకు రాకపోతే.. ‘మీరే మా బిడ్డలను తీసుకెళ్లి కాపాడండి’ అంటూ ముక్కుపచ్చలారని పిల్లలను విసిరేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు చిన్నారులు ఆ ముళ్లకంచెల్లో చిక్కుకుని హృదయవిదారకంగా రోదిస్తుండడం తమ హృదయాలను కలచివేస్తోందంటూ యూకే సైనికులు కంటతడి పెడుతున్నారు. ‘‘ఆ దృశ్యాలను తలచుకుని మా సైనికుల్లో చాలా మంది రాత్రిపూట రోదిస్తున్నారు. నేను వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సివస్తోంది’’ అని యూకే సైనికాధికారి ఒకరు తెలిపారు. 


ఆదివారం నుంచి ఇప్పటిదాకా కాబూల్‌ ఎయిర్‌పోర్టు వద్ద దాదాపు 12 మంది చనిపోయారు. కొంతమంది తొక్కిసలాటల్లో చనిపోగా.. మరికొందరు కాల్పుల్లో ప్రాణాలుకోల్పోయారు. మరోవైపు.. నిరసనకారులపైనా తాలిబన్ల అరాచకం కొనసాగుతోంది. వారు చెబుతున్న మార్పు మాటల్లోనే ఉంది తప్ప చేతల్లో లేదని మరోమారు స్పష్టమైంది. అఫ్ఘాన్‌ స్వాతంత్య్ర దినమైన ఆగస్టు 19న (గురువారం) దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు తాలిబన్ల పాలనను వ్యతిరేకిస్తూ తమ జాతీయ జెండాలను ఎగురవేస్తూ నిరసన ప్రదర్శించారు. ఆ ప్రదర్శనలను తాలిబన్లు తమదైన శైలిలో కాల్పులతో, లాఠీచార్జ్‌తో అడ్డుకున్నారు. కునార్‌ ప్రావిన్స్‌లోని అసదాబాద్‌లో తాలిబన్లు నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో పలువురు చనిపోయినట్టు తెలుస్తోంది. తాలిబన్ల పాలనను వ్యతిరేకిస్తూ జలాలాబాద్‌లో బుధవారం జరిపిన ప్రదర్శనలపై వారు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వరుసగా రెండోరోజూ అవే దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.  కాగా.. తాలిబన్లకు వ్యతిరేకంగా ధైర్యంగా రోడ్ల మీదకు వచ్చి, జాతీయ జెండాను ఎగురవేసి నిరసనలు తెలుపుతున్నవారికి, దేశగౌరవాన్ని నిలుపుతున్నవారికి శాల్యూట్‌ చేస్తున్నట్టు అఫ్ఘాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ప్రకటించారు. అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్లు పాలించలేనంత.. పాకిస్థాన్‌ మింగేయలేనంత పెద్ద దేశమని ట్వీట్‌ చేశారు. ‘‘ఉగ్రవాదులకు తలొగ్గిన అధ్యాయం మీ చరిత్రలో లేకుండా చూసుకోండి’’ అంటూ పాకిస్థాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.


అన్ని దేశాలూ ఆదుకోవాలి..

3.8 కోట్ల మంది జనాభా ఉన్న అఫ్ఘానిస్థాన్‌ తాజా పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఆహారకొరతను ఎదుర్కోబోతోందంటూ ఐక్యరాజ్యసమితి అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్ఘానిస్థాన్‌ ఆహారం కోసం ప్రధానంగా దిగుమతులపై ఆధారపడిన దేశం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశానికి ఎగుమతి, దిగుమతులు కష్టమే. దీంతో తమ కళ్లముందే అక్కడ ఆహార సంక్షోభం నెలకొంటోందని అఫ్ఘానిస్థాన్‌లో ‘ప్రపంచ ఆహార పథకం’ అధిపతి మేరీ ఎల్లెన్‌ ఆవేదన వెలిబుచ్చారు. ప్రపంచదేశాలన్నీ కలిసి అఫ్ఘానిస్థాన్‌ను ఈ కష్టకాలంలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 


అప్ఘానిస్థాన్‌కు ఆయుధాల అమ్మకాలను నిలిపివేయాలని బైడెన్‌ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు డిఫెన్స్‌ కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చింది. కాగా.. తాలిబన్లు మారిపోలేదని, తమ ఉనికిని చాటుకోవడం కోసం ఆరాటపడుతున్నారని.. ప్రపంచ యవనికపై చట్టబద్ధమైన గుర్తింపు కోరుకోవాలా వద్దా తేల్చుకోలేని సంక్షోభంలో ప్రస్తుతం ఉన్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఏబీసీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అక్కడి నుంచి అమెరికా దళాల ఉపసంహరణ, తరలింపుపై ఇంకా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఉండాల్సిందన్న వాదనలను బైడెన్‌ కొట్టిపారేశారు. అమెరికా సైన్యానికి చెందిన హమ్‌వీలు(హైమొబిలిటీ మల్టీపర్పస్‌ వీల్డ్‌ వెహికల్‌).. ఆయుధాలు, బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్లు ఇప్పుడు తాలిబన్ల వశమయ్యాయి. తమకు అప్పనంగా దక్కిన ఆ వాహనాల్లో తాలిబన్లు అమెరికన్‌ సైనిక దుస్తులు ధరించి, ఎం4, ఎం18 అసాల్ట్‌ రైఫిళ్లు .. ఎం24 స్నైపర్‌ రైఫిళ్లు ధరించి తిరుగుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 


అఫ్ఘాన్‌ శరణార్థులకు అండగా నిలుస్తాం: భారత్‌

అఫ్ఘాన్‌ పరిణామాల నేపథ్యంలో భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌, బ్రిటన్‌ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి.  సాధారణ అఫ్ఘాన్‌ పౌరులు, శరణార్థుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారికి అండగా నిలబడాలని అభిప్రాయానికి వచ్చాయి. ఈ దిశగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఎస్‌.జైశంకర్‌, డొమినిక్‌ రాబ్‌.. ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు.  అక్కడ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ సహా వివిధ దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. అఫ్ఘాన్‌ సంక్షోభంపై చర్చిం చారు. గురువారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో ఉగ్రవాదంపై చర్చ జరిగింది.  ఈ సమావేశం ముగిసిన తర్వా త జైశంకర్‌ విలేకరులతో మాట్లాడారు.  ప్రస్తుతానికి తమ దృష్టంతా అఫ్ఘాన్‌లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తీసుకురావడం పైనే ఉందన్నారు.  


బయటపడతామా? 

అఫ్ఘాన్‌లోని భారతీయుల ఆందోళన 

తాలిబన్ల చెరలో ఉన్న అఫ్ఘానిస్థాన్‌లో 450 మంది దాకా భారతీయులు చిక్కుకుపోయారు. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం అమెరికా, ఇతర దేశాల రాయబార కార్యాలయలతో సంప్రదిస్తోంది. అఫ్ఘాన్‌ నుంచి మన రాయబార కార్యాలయ సిబ్బంది మొత్తా న్నీ తరలించిన నేపథ్యంలో అక్కడి భారతీయులు మన అధికారులను సంప్రదించడానికి వీలుగా ‘స్పెషల్‌ అఫ్ఘానిస్థాన్‌ సెల్‌’ను ఏర్పాటు చేశారు. దానికి వచ్చిన కాల్స్‌ ఆధారంగా అక్క డ 450 మంది దాకా మనోళ్లు ఉన్నట్టు అంచనాకు వచ్చారు. కాగా, కాబూల్‌లోని గురుద్వారాలో చిక్కుకుపోయిన హిందువులు, సిక్కుల రక్షణకు అక్కడి తాలిబన్లు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆ గురుద్వారా ప్రెసిడెంట్‌ గుర్నామ్‌సింగ్‌ తెలిపినట్టు అకాలీదళ్‌ నేత మంజీందర్‌ సింగ్‌ సిర్సా ప్రకటించారు. తాలిబన్లు కూడా ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఈ మేరకు ఒక వీడియోను కూడా వారు ట్వీట్‌ చేశారు. 


దేశ భద్రతకు పెను సవాళ్లు: రాజ్‌నాథ్‌

అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రతకు సంబంధించిన సవాళ్లు మరింతగా పెరిగాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. గురువారం ఆయన ‘డిఫెన్స్‌ ఇండియా స్టార్టప్‌ చాలెంజ్‌ 5.0’ను ఆవిష్కరించారు. స్వీయ ఆధారిత రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.  

Updated Date - 2021-08-20T07:57:35+05:30 IST