ఇసుకకు కటకట

ABN , First Publish Date - 2020-06-04T09:01:16+05:30 IST

‘‘అమ్మ పెట్టదు...అడుక్కు తిననివ్వదు’’ అన్న చందంగా వుంది జిల్లాలో మైనింగ్‌ ..

ఇసుకకు కటకట

రాజమండ్రి నుంచి అరకొరగా సరఫరా

వచ్చిన కొద్దిపాటి ఇసుక ప్రభుత్వ పనులకు కేటాయింపు

ప్రైవేటు భవన నిర్మాణదారులకు అందని పరిస్థితి

స్థానిక నదులు, గెడ్డల్లో ఇసుక తవ్వకాలపై నిఘా

గ్రామీణ ప్రాంతంలో తీవ్ర కొరత

లాక్‌ డౌన్‌ నిబంధనలు సడలించినా....పునఃప్రారంభకాని భవన నిర్మాణాలు


చోడవరం/నక్కపల్లి/అచ్యుతాపురం/అనకాపల్లి రూరల్‌, జూన్‌ 3:‘‘అమ్మ పెట్టదు...అడుక్కు తిననివ్వదు’’ అన్న చందంగా వుంది జిల్లాలో మైనింగ్‌ శాఖ తీరు. ప్రభుత్వ డిపోల్లో ఇసుక లేదు. ఒకవేళ కొద్దిమొత్తంలో వున్నా...ఆన్‌లైన్‌లో స్టాక్‌ చూపించడం లేదు. ఇటు ప్రభుత్వ డిపోల్లో ఇసుక లేకపోవడం, అటు స్థానికంగా నదుల్లో తవ్వుకోనివ్వకపోవడంతో భవన నిర్మాణదారులతోపాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో అనకాపల్లి, అచ్యుతాపురం, చోడవరం, నక్కపల్లి, నర్సీపట్నంలో ప్రభుత్వం ఇసుక డిపోలు ఏర్పాటుచేసింది. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్‌ వరకు ఇసుక రవాణాను కూడా ఆపేశారు. ఆ తరువాత కొంతమేర సడలింపులు ఇవ్వడంతో రాజమండ్రి నుంచి అరకొరగా ఇసుక వస్తున్నది. అయితే దీనిని ప్రభుత్వ అవసరాలకు, నాడు-నేడు పథకం కింద పాఠశాలల అభివృద్ధి, గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇతర పనులకు మళ్లిస్తున్నారు. దీంతో సాధారణ వినియోగదారులకు ఇసుక లభించని పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌ 4.0 నుంచి భవన నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఇసుక లేకపోవడంతో పనులు పునఃప్రారంభం కాలేదు. 


చోడవరం మండలం నరసాపురం డిపోలో లాక్‌డౌన్‌కు ముందు సుమారు 19 వేల టన్నుల ఇసుక వుండగా, దీనిని నాడు-నేడు పనులకు తరలించారు. లాక్‌డౌన్‌తో గోదావరి నుంచి ఇసుక సరఫరా ఆగిపోయింది. కొద్దిరోజుల నుంచి ఒకటీ అరా లారీల్లో ఇసుక వచ్చినా...దానిని కూడా ప్రభుత్వ పనులకు మళ్లిస్తున్నారు. ప్రస్తుతం నరసాపురం డిపో నుంచి 40 వేల టన్నుల ఇసుకకు డిమాండ్‌ ఉంది. కానీ పది టన్నులు ఇసుక కూడా ఇక్కడ లేదు. ఈ డిపోలో ఇసుక నిల్వలను ఆన్‌లైన్‌లో చూపించకపోవడంతో భవన నిర్మాణదారులు బుక్‌ చేసుకోలేకపోతున్నారు.


నక్కపల్లిలో నిల్‌

మే 11వ తేదీన రాజమహేంద్రవరం నుంచి నక్కపల్లి డిపోకు 3 వేల టన్నుల ఇసుక వచ్చింది. 18వ తేదీ నాటికి దాదాపు పూర్తిగా అమ్ముడుపోయింది. ఆ తరువాత కొద్దిమొత్తంలో వస్తున్నప్పటికీ ప్రభుత్వ అభివృద్ధి పనులకు కేటాయిస్తూ, ప్రైవేటు వ్యక్తులకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు అనుమతి ఇవ్వడం లేదు. ప్రస్తుతం 50 నుంచి 75 టన్నులు మాత్రమే ఉంది. దీనిని ఆన్‌లైన్‌లో బుక్‌ చేయడానికి అనుమతి లేదని, పాఠశాలల్లో నాడు-నేడు పనుల కోసం కేటాయించారని అక్కడ సిబ్బంది చెప్పారు. 


అచ్యుతాపురంలోనూ ఖాళీ

అచ్యుతాపురం డిపోకు పది రోజుల నుంచి ఇసుక రావడం లేదు. లాక్‌డౌన్‌ విధించిన తరువాత సుమారు రెండు నెలలపాటు రాజమండ్రి నుంచి ఇసుక రాలేదు. పది రోజుల క్రితం సుమారు 100 టన్నుల ఇసుక వచ్చింది. దీనిని ప్రభుత్వ పనులకు కేటాయించినట్టు అధికారులు చెప్పారు. ప్రస్తుతం డిపోలో ఇసుక లేదు. ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేమని సిబ్బంది అంటున్నారు. స్థానిక ఎస్‌ఈజడ్‌లో నిర్మాణాలకు ఇసుక గణనీయంగా అవసరమైనప్పటికీ అందుబాటులో లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి.  


అనకాపల్లిలో....

అనకాపల్లి రూరల్‌: అనకాపల్లి మండలం కోడూరు డిపోలో ప్రస్తుతం 100 టన్నుల ఇసుక ఉంది. కానీ దీనిని ప్రభుత్వ పనులకు కేటాయించినట్టు అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇసుక చేతికి అందడానికి వారం నుంచి పది రోజులు పడుతున్నదని పలువురు భవన నిర్మాణదారులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులతో నిర్మాణ పనులు ప్రారంభించాలనుకున్నామని, కానీ ఇసుక అందుబాటులో లేకపోవడంతో మొదలుపెట్టలేదని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు సైతం ఇసుక కొరత కారణంగా పనులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. 

Updated Date - 2020-06-04T09:01:16+05:30 IST