నిమ్మ ధర పతనం

ABN , First Publish Date - 2022-05-24T05:45:34+05:30 IST

కాయలు లేనప్పుడు ధరలు ఉన్నాయి. కాయలు ఉన్నప్పుడు ధరలు లేవు. గత నెలలో బస్తా రూ.5 వేలు పలకగా ప్రస్తుతం వాతావరణంలో మార్పులు వచ్చి చల్లబడడంతో నిమ్మ ధరలు అమాంతంగా బస్తా రూ.1200 పడిపోయాయి.

నిమ్మ ధర పతనం
రైల్వేకోడూరు నియోజకవర్గంలో సాగులో ఉన్న నిమ్మ తోట

నాడు బస్తా రూ.5 వేలు.. నేడు రూ.1200
ఒక్కసారిగా పడిపోయిన నిమ్మకాయల ధర

రైల్వేకోడూరు, మే 23:
కాయలు లేనప్పుడు ధరలు ఉన్నాయి. కాయలు ఉన్నప్పుడు ధరలు లేవు. గత నెలలో బస్తా రూ.5 వేలు పలకగా ప్రస్తుతం వాతావరణంలో మార్పులు వచ్చి చల్లబడడంతో నిమ్మ ధరలు అమాంతంగా బస్తా రూ.1200 పడిపోయాయి. ధరలు ఉన్నపళంగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేరళలోని ఎర్నాకుళం, తిరుచ్చూరు, ముంబాయ్‌, కర్ణాటక రాష్ట్రంలోని హొస్పేట తదితర రాష్ట్రాలకు గతంలో ముమ్మరంగా వ్యాపారులు ఎగుమతులు చేసేవారు. రైల్వేకోడూరునుంచి రైళ్లలో ఎగుమతులు చేస్తారు. కేరళ, ముంబాయ్‌ల్లో ఉన్న వ్యాపారులతో మంచి సంబంధాలు ఉండేవి. ప్రస్తుతం ముంబాయికి రాజంపేట నుంచి పంపుతున్నారు. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, చిట్వేలి, పెనగలూరు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో రైతులు నిమ్మతోటలను సాగు చేస్తున్నారు. నియోజకవర్గంలో గతంలో నిమ్మసాగు అధికంగా చేసేవారు. 2000-03 సంవత్సరాల్లో తీవ్ర కరువుతో నిమ్మ తోటలు చాలా వరకు ఎండిపోయాయి. ప్రస్తుతం బోరు బావుల కింద కొందరు రైతులు సాగు చేస్తున్నారు. గతంలో ఎక్కువగా రైల్వేకోడూరు రైల్వేస్టేషన్‌ కేంద్రంగా ఎర్నాకుళం, ముంబాయిలకు పంపేవారు. చిన్న, చిన్న వ్యాపారులు తిరుపతి, రాజంపేట, కడప, అనంతపురం, చిత్తూరు తదితర ప్రాంతాలకు ఎగుమతులు చేసేవారు. ఎర్నాకుళంలో మార్కెట్‌ ధరలు పడిపోవడంతో నిమ్మ కాయల ధరలు తగ్గిపోయాయి. గ్రేడ్‌-1 నిమ్మకాయలు బస్తా గత నెలలో రూ.5 వేల ధర పలకగా ప్రస్తుతం బస్తా ధర రూ.1200 పడిపోయింది. రెండో రకం కాయలు రూ.1000 నుంచి రూ.900 వరకు ధరలు పలుతున్నాయి. ప్రతి ఒక్క బస్తాకు రూ.200 ఖర్చు వస్తుందని వ్యాపారులు అంటున్నారు. రైల్వేకోడూరులో 5 నిమ్మకాయల మండీలున్నాయి. గత ఏడాది వ్యాపారులు ప్రతిరోజూ 200 బస్తాలను రవాణా చేసేవారు. ప్రస్తుతం కేవలం కోడూరు నుంచి కేవలం 30 బస్తాల నిమ్మకాయలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.

కాయలు ఉన్న సమయంలో ధరలు లేవు
గత నెలలో కాయలు లేవు. ధరలు మాత్రం బాగా ఉన్నాయి. ప్రస్తుతం కాయలు ఉన్నా ధరలు లేవు. గతంలో బస్తా రూ.5 వేలు పలికింది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ధరలు అమాంతంగా పడిపోయాయి. ప్రస్తుతం ఉన్న నిమ్మ ధరలకు పెట్టిన పెట్టుబడి కూడా రాదు. దీంతో రైతులకు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
- సుగవాసి శివయ్య, నిమ్మ రైతు, రైల్వేకోడూరు



Updated Date - 2022-05-24T05:45:34+05:30 IST