కౌలు రైతు కుదేలు!

ABN , First Publish Date - 2021-10-27T05:46:15+05:30 IST

మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది జిల్లాలోని కౌలు రైతుల పరిస్థితి. ప్రకృతి కన్నెర్ర చేయడంతో కౌలు రైతులు కుదేలయ్యారు. ఈయేడు పరిస్థితులు కౌలు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి.

కౌలు రైతు కుదేలు!
తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న వరి పంట(ఫైల్‌)

దెబ్బతీసిన గులాబ్‌ తుఫాన్‌ 

పొట్టదశలో పంటకు తీవ్ర నష్టం 

గణనీయంగా తగ్గిన దిగుబడి

రుద్రూరు, అక్టోబరు 26: మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది జిల్లాలోని కౌలు రైతుల పరిస్థితి. ప్రకృతి కన్నెర్ర చేయడంతో కౌలు రైతులు కుదేలయ్యారు. ఈయేడు పరిస్థితులు కౌలు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ఈ ఏడాది భారీ స్థాయిలో కురిసిన వర్షాలతో పాటు ఇటీవల గులాబ్‌ తుఫాన్‌ కౌలు రైతులను తీవ్ర నష్టాలకు గురిచేసింది. తుఫాన్‌ ప్రభావంతో పొట్ట దశలో ఉన్న వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట సైతం నేలకొరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో లాభం మాట దేవుడెరుగు పెట్టుబడి సైతం వస్తుందో లేదోనని కౌలు రైతులు దిగాలు చెందుతున్నారు. అంతేకాకుండా పలు రకాల తెగుళ్లు సైతం రైతులను వెంటాడుతూ వచ్చాయి. ఓ వైపు ప్రకృతి.. మరో వైపు తెగుళ్లు మరో వైపు కౌలు రైతులను నష్టాల ఊబిలోకి నెట్టాయి. పంట దిగుబడిని చూసి రైతు కంట కన్నీరు వస్తోంది. 

గణనీయంగా తగ్గిన దిగుబడి..

వాతావరణం సహకరిస్తే ఒక్కో ఎకరానికి సుమారు 50 నుండి 60 బస్తాల దిగుబడి వస్తుంది. కానీ, ఈ సంవత్సరం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు తుఫాన్‌ ప్రభావం సైతం అధికంగా ఉంది. దీంతో వరి పంట సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కౌలు కట్టలేని స్థితిలో రైతులు ఉన్నారు. పంట చేతికొచ్చిన సమయంలో తుఫాన్‌ ప్రభావంతో పంట మొత్తం నేలకొరిగింది. గింజలు పొలంలోనే రాలిపోయాయి. పంట నీట మునిగి మురిగిపోయింది. ప్రస్తుతం రైతులు వరికోత చేపట్టగా 30 బస్తాలకు మించి దిగుబడి రావడం లేదు. యజమానికి కౌలు చెల్లించడం ఎలా అని కౌలు రైతులు తలలు పట్టుకుంటున్నారు. 

పరిహారానికీ దూరం..

ప్రస్తుత పరిస్థితుల్లో పంట నష్టపరిహారం అందని ద్రాక్షలా మారుతోంది. ప్రకృతి కన్నెర్ర చేయడంతో వరిపంటకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సర్వేలు సైతం నిర్వహించారు. ప్రతిఏటా పంట నష్టం అంచనా నివేదికను అధికార యంత్రాంగం ప్రభుత్వానికి పంపుతున్నా పరిహారం మాత్రం అందడం లేదు. పరిహారం అందక దిగుబడి తగ్గి కౌలు రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం నష్టపోయిన కౌలు రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 

దిగుబడి తగ్గిపోయింది..

-రంజిత్‌, కౌలు రైతు, అక్బర్‌నగర్‌, రుద్రూరు

గులాబ్‌ తుఫాన్‌ రైతులను కోలుకోలేని స్థాయిలో దెబ్బతీసింది. వరిపంట గింజ కట్టే సమయంలో తుఫాన్‌ ప్రభావంతో వరిపంటకు నషం్ట వాటిల్లింది. చేతికొచ్చిన పంట నీటి పాలైంది. ప్రస్తుతం వరిపంటను కోస్తే దిగుబడి 60 బస్తాల నుండి 30 బస్తాలకు తగ్గిపోయింది. ప్రభుత్వమే కౌలు రైతులను ఆదుకోవాలి.

Updated Date - 2021-10-27T05:46:15+05:30 IST