విగ్రహ ప్రతిష్ఠ పూజల్లో ఉభయదాతలు, అర్చకులు
కావలిటౌన్, మే 25: కావలి పట్టణం మద్దూరుపాడు జాతీయ రహదారి వద్దనున్న వీరాంజనేయస్వామి ఆలయంలో బుధవారం వీరాంజనేయస్వామి, గణపతి, సుబ్రమణ్యస్వాముల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. నూతనంగా నిర్మించిన వీరాంజేయస్వామి ఆలయంలో పరాంకుశం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో టీటీడీ ఆగమ పండితులు రమేష్ ఆచార్యులు పర్యవేక్షణలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠామహోత్సవంలో భక్తజనం పెద్దఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవలతో ప్రారంభించిన పూజలు హోమం, మూలమంత్ర హోమం, యంత్ర, శిఖర ప్రతిష్ఠ, పూర్ణాహుతి, కుంభాభిషేకం, గోబ్రాహ్మణ సందర్శనం, సర్వదర్శనం తదితర పూజలతో జరిగిన విగ్రహమహోత్సవం భక్తులను కనువిందు చేసింది. మధ్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ గావించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ప్రదాన కార్యదర్శి గుత్తికొండ కిషోర్, మన్నెమాల కృష్ణారెడ్డి ప్రమీలమ్మ దంపతులు, పాల్గొని పూజలు నిర్వహించారు. రాత్రి సీతారాముల కల్యాణం, వీరాంజనేయస్వామి పల్లకీ సేవలు, గ్రామోత్సవం వైభవంగా జరిగాయి.