పునరపి విజయన్!

ABN , First Publish Date - 2021-05-03T08:45:26+05:30 IST

కేరళ రాష్ట్రంలో ఇదో అద్భుతం..! చరిత్ర..! గడిచిన నాలుగు దశాబ్దాలుగా అధికార పార్టీ/కూటమికి రెండోసారి విజయం అనేది మృగతృష్ణే..! కానీ.. కేరళ సీఎం పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ కూటమి చరిత్రను తిరగరాసింది...

పునరపి విజయన్!

  • కేరళలో రెండోసారి గెలుపుతో చరిత్ర తిరగరాత

కేరళ రాష్ట్రంలో ఇదో అద్భుతం..! చరిత్ర..! గడిచిన నాలుగు దశాబ్దాలుగా అధికార పార్టీ/కూటమికి రెండోసారి విజయం అనేది మృగతృష్ణే..! కానీ.. కేరళ సీఎం పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ కూటమి చరిత్రను తిరగరాసింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను నిజం చేస్తూ.. స్పష్టమైన మెజారిటీని సాధించింది. విపక్ష యూడీఎఫ్‌ కూటమిపై ఘన విజయాన్ని సాధించింది. ఈ చరిత్రాత్మక విజయం వెనక విజయన్‌దే కీలక పాత్ర! నిఫా, కరోనా మహమ్మారులను సమర్థంగా ఎదుర్కోవడం.. 2018 వరదల తర్వాత పరిస్థితులను వేగంగా చక్కబెట్టడం, అభివృద్ధి, సంక్షేమ పథకాలే.. కేరళ ఓటర్లు ఆయన వెంట ఉండేలా చేశాయి. ఇందుకు సంకేతంగా.. గత ఏడాది డిసెంబరులో జరిగిన సెమీఫైనల్స్‌ (స్థానిక సంస్థల ఎన్నికలు)లోనే తమ తీర్పును విస్పష్టంగా చెప్పేశారు. చరిత్ర సృష్టించిన పినరయి విజయన్‌ విజయానికి బాటలు పడడానికి ప్రధాన కారణాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.


బడి, ఆస్పత్రికి పెద్దపీట

దేశంలోనే అధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కేరళ. పినరయి హయాంలో బడుల అభివృద్ధికి పెద్దపీట వేశారు. 2016లో అధికారంలోకి రాగానే శిథిలావస్థలో ఉన్న బడుల పునరుజ్జీవనానికి నడుంబిగించారు. గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను కూడా ప్రపంచ స్థాయి ప్రమాణాలను అనుగుణంగా తీర్చిదిద్దారు. పబ్లిక్‌ ఎడ్యుకేషన్‌ రీజువెనేషన్‌ మిషన్‌(పెర్మ్‌) పథకాన్ని ప్రారంభించి, మారుమూల ప్రాంతాల్లోనూ బడులను నిర్మించారు. పేద విద్యార్థుల కోసం పథకాలను ప్రారంభించారు. అదేవిధంగా ప్రజా వైద్య రంగంలో వనరులను కల్పించారు. ఎంతలా అంటే.. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలోనూ రిసెప్షెన్‌ వ్యవస్థను తీసుకువచ్చారు. ఒక రోగి ఆస్పత్రిలో అడుగుపెట్టింది మొదలు.. ఉచిత మందులు తీసుకునే వరకు.. సహాయం చేసేలా సిబ్బందికి తర్ఫీదునిప్పించారు. విద్య, వైద్యం విషయంలో పేదల గుండెల్లో గూడుకట్టుకున్నారు. వీటితోపాటు.. రోడ్లు, కల్వర్టులు, వంతెనలెన్నో ఆయన హయాంలో నిర్మితమయ్యాయి. 


బీభత్సం సృష్టించిన వరదలు..

కేరళకు 2018 ఆగస్టులో వచ్చిన వరదలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అన్ని జిల్లాలోనూ.. 54 లక్షల మంది తీవ్రంగా ప్రభావితులయ్యారు. 483 మంది మృతిచెందగా.. 140 మంది గల్లంతయ్యారు. ఆ సమయంలో ఆయన కంటిమీద కునుకు లేకుండా పరిస్థితులను పర్యవేక్షించారు. 3,274 పునరావాస కేంద్రాల్లో 10 లక్షల మందికి ఆసరా కల్పించారు. కోలుకోవడానికి ఐదారేళ్లు పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనాలు వేసినా ఏడాదిలోనే పరిస్థితులను చక్కదిద్దగలిగారు.


ప్రభావం చూపని అవినీతి ఆరోపణలు

ఎల్‌డీఎఫ్‌ కూటమిని అవినీతి కుంభకోణాలు చాలా వరకు ఇబ్బంది పెట్టాయి. ప్రధానంగా స్వప్న సురేశ్‌ గోల్డ్‌స్కామ్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పాత్ర ఉందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మీడియాకు లీకులిచ్చింది. ఎన్నికల వేళ.. కేరళకు కేంద్ర దర్యాప్తు సంస్థలు క్యూ కట్టాయి. ఈడీ, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), కస్టమ్స్‌.. ఇలా కేంద్ర సంస్థల అధికారులు లెఫ్ట్‌ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై విచారణలు జరిపాయి. అయితే.. అవినీతి ఆరోపణలేమీ విజయన్‌ దిగ్విజయంపై ప్రభావం చూపలేకపోయాయి. కేరళ ఓటర్లు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. విజయన్‌ సంక్షేమ పథకాలకే జైకొట్టారు.


బీజేపీ దీటుగా ఆన్‌లైన్‌ ప్రచారం..

ఆన్‌లైన్‌, సోషల్‌ మీడియాలో ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలతో విజయం సాధించడం బీజేపీ స్టైల్‌. ఈ విషయంలో బీజేపీ ఐటీ సెల్‌ మిగతా పార్టీలకంటే ముందుంటుంది. అయితే.. విజయన్‌ కూడా ‘సైబర్‌ ఆర్మీ’ పేరుతో ఎల్‌డీఎఫ్‌ తరఫున ఓ ఐటీ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఐదేళ్లలో కేరళలో జరిగిన అభివృద్ధి, సాధించిన ఫలాలు, విజయన్‌ కృషి, ప్రజలకు చేకూరిన లబ్ధిపై సామాజిక మాధ్యమాల్లో భారీఎత్తున ప్రచారం చేశారు. సైబర్‌ ఆర్మీ ప్రచారం ముందు బీజేపీ ఐటీ సెల్‌ కొంత వెనకబడిందనే చెప్పవచ్చు.


మహమ్మారుల్ని ఎదుర్కొని..

నిఫా, కొవిడ్‌ మహమ్మారుల్ని పినరయి సర్కారు సమర్థంగా ఎదుర్కొంది. కొవిడ్‌ విషయంలో.. మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు కేరళలోనే నమోదయ్యాయి. దేశంలో మొట్టమొదటి కరొనో కేసు నమోదైంది కూడా ఇక్కడే. అయితే.. మరణాల రేటు మాత్రం చాలా తక్కువ. ఇందుకు కారణం.. కేరళ సర్కారు అందిస్తున్న వైద్యం. ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ ఉత్పాదక ప్లాంట్లను ఏర్పాటు చేసింది. రోజుకు 140 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించింది. కరోనాపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి.. అవగాహన పెంపొందించారు. ఫలితంగా.. కేసులు భారీగానే ఉంటున్నా.. రోజువారీ ఆక్సిజన్‌ అవసరం 54 టన్నులుగా ఉంది. దీంతో అదనపు ఆక్సిజన్‌ ఉన్న రాష్ట్రంగా కేరళ గుర్తింపు పొందింది. కొవిడ్‌ నియంత్రణలో గత ఏడాది కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజకు ఐక్యరాజ్య సమితి గుర్తింపు దక్కడాన్ని బట్టి.. అక్కడ కొవిడ్‌ కేర్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొవిడ్‌ బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకు.. ఏడాది నుంచి ఉచితంగా 15 సరుకులతో కూడిన కిట్లను అందజేస్తున్నారు. ఈ పథకం ఇప్పటికీ కొనసాగుతోంది.


మతతత్వానికి స్థానం లేదు: విజయన్‌

కేరళలో బీజేపీకి స్థానం లేదని, మతతత్వానికి తావు లేదని కేరళ సీఎం పినరయి విజయన్‌ ఉద్ఘాటించారు. గత ఎన్నికల్లో పాగా వేసిన బీజేపీ నుంచి ఆ ఒక్క స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నామన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ పైనా విరుచుకుపడ్డారు. ‘‘రాహుల్‌ పోరాటం చేయాల్సింది బీజేపీపై. కేరళలో మాపైన కాదు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీని ఓడించేందుకు ప్రచారం చేస్తే బాగుంటుంది. బెంగాల్‌లో సీపీఎంతో కాగ్రె్‌సకు వింత పొత్తు ఉంది. కానీ కేరళలో కాదని గుర్తించాలి’’ అని వ్యాఖ్యానించారు. కాగా.. విజయన్‌కు ప్రధాని మోదీ సహా పలువురు నేతలు అభినందనలు తెలిపారు.  సీతారాం ఏచూరి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తదితరులు ఆయనకు అభినందనలు చెప్పిన వారిలో ఉన్నారు.



జననం: 1945 మే 24న మలబార్‌ జిల్లా పినరయి గ్రామం

తల్లిదండ్రులు: పినరయి కోరన్‌, కల్యాణి

విద్యార్హతలు: బీఏ..  భార్య: కమలా విజయన్‌.. పిల్లలు: ఇద్దరు

రాజకీయ ప్రవేశం: 1964లో సీపీఎంలో చేరిక.. 1998 నుంచి 2015 వరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పగ్గాలు. 2002లో సీపీఎం పొలిట్‌బ్యూరోలో స్థానం. 2007లో పొలిట్‌బ్యూరో నుంచి సస్పెండ్‌ అయినా.. తర్వాత తిరిగి బాధ్యతలు.

అసెంబ్లీలో కాలుపెట్టింది: కుతుపరంబ నుంచి 1970, 1977, 1991లో విజయం. 1996లో పయ్యూర్‌, 2016లో ధర్మదోమ్‌ నుంచి ఎన్నిక

మంత్రిగా బాధ్యతలు: విద్యుత్తు మంత్రిగా (1996-98) బాధ్యతలు

ముఖ్యమంత్రిగా: 2016 మే 25 నుంచి..


Updated Date - 2021-05-03T08:45:26+05:30 IST