మంత్రి శ్రీనివా‌స్‌గౌడ్‌ హత్య కుట్ర కేసు: సుపారీ ఎవరిచ్చారు.. రూ. 15 కోట్ల కథేంటి.. తుపాకులు ఎలా వచ్చాయి..!?

ABN , First Publish Date - 2022-03-10T15:20:42+05:30 IST

ఇందుకు సుపారీ ఇచ్చింది ఎవరు..? అందుకు అవసరమైన సుమారు రూ. 15 కోట్లు ఎవరు సర్థుబాటు చేస్తామన్నారు.? ఎందుకు హత్య చేయాలనుకున్నారు..? ఈ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారు..? తుపాకులు ఎలా వచ్చాయి..?

మంత్రి శ్రీనివా‌స్‌గౌడ్‌ హత్య కుట్ర కేసు: సుపారీ ఎవరిచ్చారు.. రూ. 15 కోట్ల కథేంటి.. తుపాకులు ఎలా వచ్చాయి..!?

  • నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు
  • నాలుగు గంటలపాటు విచారణ

హైదరాబాద్‌ సిటీ/పేట్‌బషీరాబాద్‌ : మంత్రి శ్రీనివా‌స్‌గౌడ్‌ హత్యకు కుట్ర చేసిన నిందితులను సైబరాబాద్‌ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. మొత్తం ఏడుగురిని నాలుగు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. దాంతో పేట్‌బషీరాబాద్‌ పోలీసులు బుధవారం ఉదయం 10:30 గంటలకు చర్లపల్లి జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని నేరుగా ఆల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.   వైద్య పరీక్షల  అనంతరం మధ్యాహ్నం 1:30కు పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం 2:30కు విచారణ ప్రారంభించి తిరిగి 6:30కు ముగించినట్లు తెలిసింది. శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేయడానికి మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు, మున్నార్‌ రవి, మధుసూదన్‌రాజు, అమరేందర్‌రాజు, నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌లు కుట్ర పన్నారని,  సైబరాబాద్‌ పోలీసులు దానిని భగ్నం చేశారని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.


తుపాకులపైనే దృష్టి.. 

నిందితులు ఢిల్లీలో మాజీ ఎంపీ సర్వెంట్‌ క్వార్టర్స్‌లో తలదాచుకున్నట్లు తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. నిందితులు హైదరాబాద్‌ నుంచి పారిపోతున్న సమయంలో దూలపల్లి ఫారెస్టులోని పొదల్లో పడేసి వెళ్లిన రెండు పిస్టల్స్‌, 8 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పేట్‌బషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ ఆధ్వర్యంలో మొదటి రోజు  విచారించిన పోలీసులు ప్రధానంగా మంత్రి హత్యకు సుపారీ ఇచ్చిన అంశంపైనే దృష్టి సారించినట్లు తెలిసింది. ఇందుకు సుపారీ ఇచ్చింది ఎవరు..? అందుకు అవసరమైన సుమారు రూ. 15 కోట్లు ఎవరు సర్థుబాటు చేస్తామన్నారు.? ఎందుకు హత్య చేయాలనుకున్నారు..? ఈ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారు..? తుపాకులు ఎలా వచ్చాయి..? ఎవరు సమకూర్చారు..? ఎంతకు కొన్నారు..? ఎవరి వద్ద కొనుగోలు చేశారు..? ఎక్కడి నుంచి సమకూర్చారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు నిందితులు మాకేం తెలియదనే సమాధానం మాత్రమే చెప్పినట్లు తెలిసింది. విచారణ సమయంలో పోలీసులు అడిగినదానికి సమాధానం చెప్పకుండా మొండికేసినట్లు తెలిసింది. 


నిందితులను కటకటాల్లోకి నెట్టిన పోలీసులు తదుపరి విచారణ కోసం కస్టడీకి తీసుకున్నారు. నిందితులను వేధించకుండా, ఇబ్బందులకు గురిచేయకుండా, థర్డ్‌ డ్రిగీ వంటి ప్రయోగాలు చేయకుండా న్యాయవాదుల సమక్షంలో, వీడియో తీస్తూ విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించినట్లు తెలిసింది. నాలుగు రోజుల కస్టడిలో భాగంగా బుధవారం నుంచి ఈ నెల 13 (శనివారం) వరకు విచారించనున్నారు. రోజూ విచారణ అనంతరం వైద్య పరీక్షల తర్వాత  రాత్రి 7 గంటల వరకు చర్లపల్లికి జైలుకు తరలించనున్నారు. తిరిగి మరుసటి రోజు ఉదయం కస్టడీకీ తీసుకోవాల్సి ఉంటుంది. నిందితులు మీడియా కంట పడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. స్టేషన్‌ బయట పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-03-10T15:20:42+05:30 IST