Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

గాన భారతి

twitter-iconwatsapp-iconfb-icon

ఏడుదశాబ్దాలకు పైగా సినీసంగీత ప్రియులను తన గానమాధుర్యంతో ఓలలాడించిన సుప్రసిద్ధగాయని లతా మంగేష్కర్ నిష్క్రమణ తీవ్ర దిగ్భ్రాంతికీ, మనోవేదనకూ గురిచేసింది. సినీనేపథ్యగానానికి దూరంగా ఉంటూ, తొమ్మిదిపదులు దాటిన వయసులో కన్నుమూసినప్పటికీ, సంగీతాభిమానులు ఆమె లేరన్నవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. మాయదారి కరోనా ఆమెను తమనుంచి దూరం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. సరిగ్గానెలరోజుల క్రితం ఆమె ఆస్పత్రిలో చేరినప్పుడు రోగలక్షణాలు స్వల్పమేనన్నారు, న్యూమోనియాతో పోరాటంలోనూ ఆమెదే విజయమన్నారు. మధ్యలో ఆరోగ్యం కుదుటపడిందని విన్నప్పుడు ఇంతటి వయసులోనూ ఈ మొండిమనిషిదే పైచేయి అయినందుకు సంతోషించారు. కానీ, అనేకమంది మహానుభావులను మనకు దక్కకుండా చేస్తున్న మహమ్మారి ఈ కోకిలమ్మను ఇలా వెనకదెబ్బతీస్తుందని ఊహించలేదు.


దేశం ఆమెకు ఘన నివాళులర్పిస్తోంది, ఘనంగా స్మరించుకుంటోంది. కోట్లాది గొంతుకల్లో ఆమె మళ్ళీమళ్ళీ పలుకుతోంది. మాధ్యమాలన్నీ ఆమె పాటలతో మారుమోగిపోతున్నాయి. మీకు తెలుసా అంటూ ఆమె ప్రస్థానానికి సంబంధించిన ప్రతీ విశేషాన్నీ అందరూ అందరితోనూ పంచుకుంటున్నారు. అధికారిక లాంఛనాలతో సాగిన అంతిమసంస్కారాల ఘట్టంలో దేశప్రధాని నుంచి అన్ని రంగాల ప్రముఖులవరకూ పాల్గొంటే, అంతిమయాత్రలో రహదారికి ఇరువైపులా నిలబడి వేలాదిమంది అశ్రునివాళులర్పించారు. రాష్ట్రపతినుంచి రాష్ట్రాల అధినేతలవరకూ అందరూ స్మరించుకున్నారు. ప్రపంచస్థాయి గాయకురాలిని కోల్పోయినందుకు ఉపఖండం యావత్తూ బాధపడింది.


సినిమాలే ఇష్టంలేని సంగీత కుటుంబం నుంచి ఆమె సినీరంగ ప్రవేశం ఒక విశేషమైతే, ఆ ప్రయాణం కూడా ఆదిలో అంత సజావుగా సాగలేదు. పదమూడేళ్ళ పసివయసులో తండ్రిని కోల్పోవడంతోనే నెత్తినపడిన కుటుంబబాధ్యత ఆమెను మరింత మొండిగా మార్చాయి. తొలి మరాఠీ గీతంనుంచే ఎదురుదెబ్బలు తప్పలేదు. ఆర్థికకష్టాలు, అవకాశాల వెతుకులాట మరింత సానబట్టాయి. తిరస్కారానికి వెరవక, అవకాశం కోసం దేబిరించక పట్టుదలతో వేసిన ప్రతీ అడుగు ఆమెను ఈ స్థాయికి చేర్చాయి. ఆమె మంచితనమే కాదు, మొండితనం గురించి కూడా కథలు కథలుగా చెప్పుకుంటారు. సుప్రసిద్ధగాయకులతో సైతం పాడను పొమ్మనడానికి ఆమె వెరవలేదు. మరాఠీమూలాలున్న మనిషికి ఉర్దూ పలకడం రాదనీ, బాలీవుడ్‌లో పాటకు పనికిరాదనీ ఓ సుప్రసిద్ధ సినీహీరో మాటజారితే, దానిని సీరియస్ గా తీసుకొని ఉర్దూ నేర్చుకున్న జగమొండి లత. ఆ తరువాత గజల్స్ లో సైతం ఆమె ఉచ్చారణ పండితులకు తీసిపోనిరీతిలో ఉండటాన్ని సినీ విశ్లేషకులు గొప్పగా చెబుతుంటారు. ఈ పీలగొంతు సినిమాకు పనికిరాదని చీదరించినవారే ఆ తరువాత ఆమె పాటకోసం నిరీక్షించవలసి రావడం వెనుక లత గానమాధుర్యంతో పాటు, కఠోరశ్రమ కూడా ఉన్నది. గానామృతాన్ని పంచిన ఆ కంఠం జీవితంలోని ప్రతీ ఘట్టాన్నీ ఆవిష్కరించింది, మాధుర్యాన్నీ, విషాదాన్నీ పలికింది. ఆమె నోటినుంచి వచ్చిన ప్రతీపాటా ఆణిముత్యమై మెరిసింది. సినీగీతాలు సరేసరి, ఆరుదశాబ్దాల క్రితం ఆమె గొంతులో పల్లవించి నెహ్రూని కంటతడిపెట్టించిన దేశభక్తి గీతం ఇప్పటికీ మనలను ఉత్తేజితులను చేస్తూనే ఉన్నది.


ఆమె గాత్రమా‌ధుర్యానికి పులకించిన  దేశం నలభైయేళ్ళక్రితం పద్మభూషణ్ తో ఆరంభించి, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్, పదేళ్ళనాటి భారతరత్న వరకూ సమున్నతంగానే గౌరవించుకుంది. ఆమెను వరించని పురస్కారమేదీ దాదాపుగా లేదు. రాజ్యసభ సభ్యత్వంతో ప్రభుత్వం ఆమెను గౌరవిస్తే, రూపాయి వేతనం తీసుకోకుండా ఆ గౌరవాన్ని నిలబెట్టుకున్న వ్యక్తిత్వం ఆమెది. ఆమె పాటలు రాబోయే తరాలనోట ప్రతిధ్వనిస్తాయి. భౌతికంగా మనకు దూరమైన ఆ దివ్యమైన గళం వేలాది మధురగీతాల్లో అజరామరం. తన గళమాధుర్యంతో కోట్లాదిమందిని మైమరిపింపచేసిన ఆమె వారి మనస్సుల్లో సజీవంగా నిలిచిపోతారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.