చిన్నారుల్లో లారింగోమలాసియా

ABN , First Publish Date - 2021-10-21T06:03:47+05:30 IST

ఏడాదిలోపు చిన్నారులు గురక సమస్యతో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా ఉపశమనం లభించడం లేదా? అయితే అప్రమత్తం కావాల్సిందే అంటున్నారు చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) వైద్య నిపుణుడు డాక్టర్‌ సంతోష్‌.

చిన్నారుల్లో లారింగోమలాసియా

ఏడాదిలోపు వారిని వేధిస్తున్న సమస్య

గురక ప్రధాన లక్షణం

ప్రతి 2,100 మందిలో ఒకరు బాధితులు

నర్సీపట్నం ప్రాంతంలో 48 మందిలో గుర్తింపు

ఈఎన్‌టీ వైద్యుడు సంతోష్‌ పరిశోధన

ముందస్తు జాగ్రత్తలతో సమస్యకు చెక్‌ చెప్పేందుకు అవకాశం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

ఏడాదిలోపు చిన్నారులు గురక సమస్యతో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా ఉపశమనం లభించడం లేదా? అయితే అప్రమత్తం కావాల్సిందే అంటున్నారు చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) వైద్య నిపుణుడు డాక్టర్‌ సంతోష్‌. ఈ సమస్యను ‘లారింగోమలాసియా’గా పేర్కొంటారని, ఒక్కొక్కసారి ఆకస్మిక మరణానికి కారణం కావచ్చునని చెబుతున్నారు. నర్సీపట్నం ప్రాంతంలో ఈ తరహా సమస్యలతో వచ్చే చిన్నారులపై ఆయన పరిశోధన చేశారు. తన పరిశోధనలో గుర్తించిన అంశాలను ఈ నెల తొమ్మిదో తేదీన గీతం యూనివర్సిటీలో జరిగిన ‘అసోసియేషన్‌ ఆఫ్‌ ఓటోలారింగోలజిస్ట్స్‌’ సౌత్‌ జోన్‌ కాన్ఫరెన్స్‌లో ప్రజెంట్‌ చేశారు. పరిశోధనలో వెల్లడైన అంశాలపై అందిస్తున్న ప్రత్యేక కథనం...


ఎవరిలో ఈ సమస్య...

ఈ సమస్య సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఏడాదిలోపు చిన్నారుల్లో కనిపిస్తుంది. చిన్నారులు తీవ్రమైన గురకతో బాధపడడం, డొక్కలు ఎగరేయడం వంటి లక్షణాలు ఉంటాయి. సాధారణంగా ప్రతి 2,100 మంది చిన్నారుల్లో ఒకరికి ఈ సమస్య వస్తుంది. నర్సీపట్నం ప్రాంతంలో 120 మంది చిన్నారులు ఈ తరహా సమస్యతో వచ్చినప్పుడు వారికి పరీక్షలు నిర్వహించగా... 48 మంది లారింగోమలాసియాతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఈ స్థాయిలో బాధితులు వుండడం కొంత ఆందోళన కలిగించే అంశంగా డాక్టర్‌ సంతోష్‌ చెబుతున్నారు. 


లారింగోమలాసియా అంటే... 

మనం పీల్చే గాలి లోపలకు వెళ్లాలంటే... ముక్కు నుంచి ఒక ప్రధాన ద్వారం ఉంటుంది. ఈ ద్వారం మొదటి భాగాన్ని లారిన్స్‌ అంటారు. దీన్ని ప్రధాన గేటుగా చెప్పవచ్చు. అక్కడి నుంచే మాట కూడా వస్తుంది. ఇది (వాయిస్‌ బాక్స్‌) చాలా పలుచగా ఉంటుంది. అయితే ఈ లారింగోమలాసియా సమస్యతో బాధపడే చిన్నారుల్లో వాయిస్‌ బాక్స్‌ మరింత పలుచగా ఉంటుంది. ఊపిరి తీసుకున్నప్పుడు ఒత్తిడికి గురై లోపలకు వెళ్లిపోతుంది. అలా లోనికి వెళ్లిన వాయిస్‌ బాక్స్‌... బయటకు గాలి వదిలినప్పుడు అడ్డుపడుతుంది. దీనివల్ల రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌ ఏర్పడి చిన్నారులు మరణించే ప్రమాదం ఉంది. దీన్ని సడన్‌ ఇన్‌ఫాంట్‌ డెత్‌ సిండ్రోమ్‌గా పేర్కొంటారు. కొందరు చిన్నారుల్లో ఈ సమస్య వల్ల ఎదుగుదల ఉండదు. 


లక్షణాలు కనిపిస్తే.. 

ప్రధానంగా గురక, డొక్కలు ఎగరేయడం, మందులు వాడినా జలుబు తగ్గకపోవడం, ఎక్కిళ్లు రావడం, వాంతులు అవుతుండడం వంటివి దీని లక్షణాలు. ఈ సమస్య ఎనిమిదో నెల వచ్చేంత వరకు పెరుగుతుంటుంది. దీనిని తట్టుకుని బతికున్న చిన్నారుల్లో రెండేళ్ల తరువాత సమస్య తగ్గుతున్నట్టు సంతోష్‌ చెబుతున్నారు. కానీ ఈ సమస్య వల్ల ఎంతమంది చనిపోతున్నారో నిర్ధారించలేకపోతున్నారు.


ప్రివెన్షన్‌కు డేటా స్టడీ

ఈ సమస్యతో వచ్చిన 48 మంది చిన్నారులు, వారి తల్లులతోపాటు ఈ సమస్య లేని మరో 48 చిన్నారులు, వారి తల్లులపై పరిశోధన చేశారు. గర్భిణిగా వున్న సమయంలో డేటాను స్టడీ చేశారు. అందులో వారు వాడిన మందులు, ఎప్పుడు గర్భం దాల్చినదీ, ఎప్పుడు పెళ్లి జరిగిందన్న విషయాలపై అధ్యయనం చేశారు. ముఖ్యంగా లెరింగో మలేసియాతో బాధపడుతున్న చిన్నారుల తల్లులు 18 నుంచి 19 ఏళ్ల మధ్య పెళ్లి చేసుకున్నట్టు గుర్తించారు. అదేవిధంగా 20 ఏళ్లలోపు గర్భం దాల్చినట్టుగా గుర్తించారు. మొదటి, రెండో బిడ్డకు మధ్య ఎడం లేకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం, గర్భిణిగా వున్న సమయంలో రక్తహీనతతో బాధపడిన వాళ్లకు పుట్టిన చిన్నారుల్లో ఈ సమస్య వున్నట్టు గుర్తించారు. ఓరల్‌ కాల్షియం డ్రాప్స్‌ ఇవ్వడం ద్వారా చిన్నారులు ఈ సమస్య నుంచి రికవరీ అవుతారని సంతోష్‌ చెబుతున్నారు. 


ఎండోస్కోపీతో గుర్తింపు

ఈ పరిశోధనకు చీఫ్‌ కాంట్రిబ్యూటర్‌గా నర్సీపట్నానికి చెందిన డాక్టర్‌ లక్ష్మీకాంత్‌ వ్యవహరించారు. 16 రోజుల చిన్నారి తీవ్రమైన గురకతో వచ్చినప్పుడు ఎండోస్కోపీ చేయగా... మొదటిసారి లారింగోమలాసియా సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు. అనంతరం పరిశోధన ప్రారంభించారు. ఆ చిన్నారికి మెరుగైన మందులు ఇవ్వడం వల్ల ప్రస్తుతం ఆరోగ్యంగా వున్నట్టు సంతోష్‌ వెల్లడించారు.  

Updated Date - 2021-10-21T06:03:47+05:30 IST