ఎస్సీలు, ఓబీసీలకు పెద్దపీట

ABN , First Publish Date - 2022-01-17T08:57:13+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (49) అయోధ్య నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలకు తెరపడింది.

ఎస్సీలు, ఓబీసీలకు పెద్దపీట

యూపీలో 107 మందితో  తొలి జాబితా

న్యూఢిల్లీ/లఖ్‌నవూ, జనవరి 16: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (49) అయోధ్య నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీ తన తొలి జాబితాను విడుదల చేసింది. 107 మంది అభ్యర్థులతో విడుదల చేసిన జాబితాలో సీఎం యోగి పేరు కూడా ఉంది. ఆయన గోరఖ్‌పూర్‌ అర్బన్‌ నుంచి బరిలో నిలవనున్నారు. ఇక్కడ ఆరో దశలో (మార్చి 3న) పోలింగ్‌ జరగనుంది. ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికైన యోగి.. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. గోరఖ్‌పూర్‌ ఆయన స్వస్థలం కావడం విశేషం. బీజేపీ బీసీల వ్యతిరేక పార్టీ అని ఎస్పీ ఆరోపించిన నేపథ్యంలో తాజా జాబితాలో కమలనాథులు 44 మంది ఓబీసీలకు అవకాశం ఇచ్చారు. అలాగే 43 మంది అగ్రవర్ణాల వారికి, 19 మంది ఎస్సీలకు సీట్లు కేటాయించారు. ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పేరు కూడా జాబితాలో ఉంది. ఆయన తన జన్మస్థలమైన సిరాథు నుంచి బరిలో నిలవనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల కోసం సిటింగ్‌ ఎమ్మెల్యేలు రాధామోహన్‌ దాస్‌, శీత్లాప్రసాద్‌లు తమ సీట్లను త్యాగం చేయనున్నారు. శనివారం బీజేపీ యూపీ ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తొలి జాబితాను విడుదల చేశారు. జనరల్‌ కేటగిరీ సీట్లలో కూడా దళితలను బరిలో నిలుపుతున్నామని వెల్లడించారు. తొలి జాబితాలో ఓబీసీలు, ఎస్సీలు 60% వరకు ఉన్నారని వివరించారు. 


ఈ జాబితాలో 63 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. కాగా, తనకు గోరఖ్‌పూర్‌ అర్బన్‌ సీటు కేటాయించినందుకు ప్రధాని మోదీకి, పార్టీ అధినాయకత్వానికి యోగి కృతజ్ఞతలు తెలిపారు. యూపీ మాజీ మంత్రి, బీఎస్పీ ఎమ్మెల్యే రాంవీర్‌ ఉపాధ్యాయ శనివారం బీజేపీలో చేరారు. కాగా, బీజేపీతో పొత్తు కుదిరిందని, 15 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని నిషాద్‌ పార్టీ అధ్యక్షుడు సంజయ్‌ నిషాద్‌ వెల్లడించారు. 2016లో స్థాపించిన ఈ పార్టీకి ఓబీసీల మద్దతు ఉంది. కాగా, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీయే ఇంటికి పంపించిందని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. యోగిని గోరఖ్‌పూర్‌ అర్బన్‌ నుంచి బరిలో దింపాలన్న బీజేపీ నిర్ణయాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తొలుత మథుర, ప్రయాగరాజ్‌, అయోధ్య లేదా దేవబంధ్‌ నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయని.. చివరికి యోగిని ‘ఇంటి (గోరఖ్‌పూర్‌)’కి పంపడం సంతోషంగా ఉందని చెప్పారు. యోగి ఇక అక్కడే ఉండొచ్చని, లఖ్‌నవూ తిరిగి రావాల్సిన అవసరం ఉండదని తెలిపారు. కాగా ఆదివారం ఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమి తరఫున ఏడుగురు అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేశారు. మాజీ మంత్రి, ఓబీసీ నేత దారాసింగ్‌ చౌహాన్‌, అప్నాదళ్‌ ఎమ్మెల్యే ఆర్‌.కె.వర్మ అఖిలేశ్‌ సమక్షంలో ఎస్పీలో చేరారు. అల్లర్లతో సంబంధం ఉన్నవారంతా ఎస్పీలో చేరుతున్నారని కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ అన్నారు. అలాంటి అల్లరిమూకలను పట్టుకునేవారు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ఆదివారం విశ్రాంత ఐపీఎస్‌ అసిమ్‌ అరుణ్‌ బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల జాబితా చూస్తే జైలుతో మొదలై.. బెయిలుతో ముగుస్తుందని ఎద్దేవా చేశారు. కాగా, ఏడీజీపీ హోదాలో ఉన్న అసిమ్‌ అరుణ్‌ వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. తనకు తొమ్మిదేళ్లు సర్వీసు ఉన్నప్పటికీ వీఆర్‌ఎస్‌ తీసుకొని, ప్రజాసేవ చేసేందుకే బీజేపీలో చేరినట్లు అరుణ్‌ చె ప్పారు. ఎస్పీ కంచుకోట కన్నోజ్‌ నుంచి అరుణ్‌ను బీజేపీ తరఫున నిలపవచ్చనే ప్రచారం ఉంది. 


పంజాబ్‌లో కాంగ్రెస్‌ తొలి జాబితా

పంజాబ్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ 86 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ చమ్‌కౌర్‌ సాహిబ్‌ నుంచి, పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్‌ సిద్దూ తూర్పు అమృత్‌సర్‌ నుంచి పోటీ చేస్తారు. ఉప ముఖ్యమంత్రులు సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావాకు డేరాబాబా నానక్‌, ఓం ప్రకాశ్‌ సోనికి అమృత్‌సర్‌ సెంట్రల్‌ టికెట్‌ను పార్టీ కేటాయించింది. 

Updated Date - 2022-01-17T08:57:13+05:30 IST