బాదుడే ఆమోదం!

ABN , First Publish Date - 2022-03-20T05:03:25+05:30 IST

రిజిస్ట్రేషన్ల బాదుడుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అయింది. జిల్లాలో మార్కెట్‌ విలువలను విపరీతంగా పెంచుతూ రిజిస్ట్రేషన్‌ శాఖ రూపొందించిన నివేదికకు ఆమోదముద్ర పడింది.

బాదుడే ఆమోదం!
జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం, రిజిస్ట్రార్‌ బాలాంజనేయులు

విపరీతంగా భూముల మార్కెట్‌ విలువ పెంపు

ముగిసిన అభ్యంతరాల స్వీకరణ

పెంచిన విలువలకు కమిటీల గ్రీన్‌ సిగ్నల్‌

ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమలు?


నెల్లూరు (హరనాథపురం), మార్చి 19 : రిజిస్ట్రేషన్ల బాదుడుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అయింది. జిల్లాలో మార్కెట్‌ విలువలను విపరీతంగా పెంచుతూ రిజిస్ట్రేషన్‌ శాఖ రూపొందించిన నివేదికకు ఆమోదముద్ర పడింది. ప్రభుత్వం తేదీ ప్రకటించగానే పెంపు అమలులోకి రానుంది. గత నెలలో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడటంతో రిజిస్ట్రేషన్‌ శాఖ మార్కెట్‌ విలువలు పెంచుతూ ప్రతిపాదనలు తయారుచేసింది. ఈ ప్రతిపాదనలకు మండల, డివిజన్‌, జిల్లాస్థాయి మార్కెట్‌ విలువల రివిజన్‌ కమిటీలు ఆమోదం తెలిపాయి. ఈ ప్రతిపాదనలను రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌, తహసీల్దార్‌, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులో ప్రజల అభ్యంతరాల కోసం ఉంచింది. అభ్యంతరాల గడువు ముగిచడంతో మళ్లీ ఆ కమిటీలు సమావేశమై  మార్కెట్‌ విలువల తుది నివేదికకు ఆమోదం తెలిపాయి. దీంతో భూములు, స్థలాల ధరలకు రెక్కలొచ్చాయి.


150 శాతం వరకు పెంపు

10 నుంచి 150 శాతం ఉండేలా భూములు, స్థలాల మార్కెట్‌ విలువలను పెంచారు. మార్కెట్‌ విలువల పెంపుతో స్టాంపు డ్యూటీని రిజిస్ట్రేషన్‌ సమయంలో ప్రజలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. స్టాంపు డ్యూటీ ద్వారా ఖజానా నింపుకొనేందుకు ఇష్టానుసారంగా ఽధరల పెంపునకు ప్రభుత్వం పూనుకొన్నట్లు సమాచారం. నెల్లూరు నగరంతోపాటు గూడూరు, కావలి, నాయుడుపేట, సూళ్లూరుపేట, ముత్తుకూరు, వింజమూరు తదితర చోట్ల భూములు, స్థలాల విలువలు భారీగా పెరిగాయి. 


రియల్టర్ల హవా

కొన్నిచోట్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పాడిందే పాటగా వెంచర్లు వేసిన ప్రాంతాలలో స్థలాలకు మార్కెట్‌ విలువలు భారీగా పెరిగాయి. జిల్లా విభజన సాకుతో భూములు, స్థలాల మార్కెట్‌ విలువలను రిజిస్ట్రేషన్‌-స్టాంపుల శాఖ విపరీతంగా పెంచేసింది. కొందరు రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు రియల్టర్లకు అనుకూలంగా భూముల మార్కెట్‌ విలువలను పెంచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిసారి మార్కెట్‌ విలువల పెంపు జరిగినప్పుడు ఐదు నుంచి 10 శాతం వరకు పెంపు ఉండేది. ఈ పెంపు ఆగస్టులో సాధారణంగా జరుగుతుండేది. స్థానిక స్థితిగతులకనుగుణంగా ఈ పెంపు ప్రతిపాదనలు తయారు చేయాలి. కానీ ఈ ఏడాది పెంపు ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచే చేపటనున్నట్లు సమాచారం.  


ప్రభుత్వ ఉత్తర్వుల తర్వాతే!

- బాలాంజనేయులు, జిల్లా రిజిస్ట్రార్‌

పెంచిన విలువల ప్రతిపాదనలకు,  ప్రజల అభ్యంతరాల తరువాత మార్కెట్‌ విలువల రివిజన్‌ కమిటీలు ఆమోదం తెలిపాయి. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన వెంటనే అమలు చేస్తాం. అప్పటివరకు ప్రస్తుత విలువలనే పరిగణలోకి తీసుకొంటాం.  

Updated Date - 2022-03-20T05:03:25+05:30 IST