ఉపాధి పనులకు భూమి కరువు

ABN , First Publish Date - 2022-04-30T04:50:05+05:30 IST

ఇబ్రహీంపట్నం డివిజన్‌లో వ్యవసాయ భూములన్నీ వెంచర్లుగా

ఉపాధి పనులకు భూమి కరువు

  • వెంచర్లుగా మారిన వ్యవసాయ భూములు
  • పెట్టుబడిదారుల చేతుల్లోకి..
  • కూలీలకు ఉపాధి కరువు
  • పనులు కల్పించడంలో అధికారుల అవస్థలు


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో వ్యవసాయ భూములన్నీ వెంచర్లుగా మారడంతో ఉపాధి కూలీలతో పనులు చేయించేందుకు భూములు దొరకడం లేదు. కొద్దిపాటిగా ఉన్న వ్యవసాయ భూముల్లో పనులు చేయించుకోవడానికి రైతులు ముందుకు రావడం లేదు. కూలీలకు పనులు కల్పించేందుకు అధికారులు భూములు వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. తప్పని పరిస్థితిలో ఫారెస్టు భూముల్లో ఉపాధి పనులు చేయిస్తున్నారు. 


ఇబ్రహీంపట్నం, ఏప్రిల్‌ 29: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా వేలాది మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో కేంద్ర ప్రభుత్వం కూలీలకు ఈ పథకం కింద పనులు కల్పిస్తుంది. కాగా ఇబ్రహీంపట్నం డివిజన్‌లో పనులు కల్పించడానికి భూములు కరువయ్యాయి. హైదరాబాద్‌ మహానగరానికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు వెంచర్లుగా మారాయి. మరికొన్ని భూములు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా వెంచర్లు, ఫాం ల్యాండ్‌లే దర్శనమిస్తున్నాయి. ఇవిగాక మరో నాలుగు వేల ఎకరాల భూములను ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో కూలీలకు పనులు కల్పించాలంటే అధికారులు భూములను వెతుక్కోవాల్సి వస్తోంది. ఒకప్పుడు 30, 40 ఎకరాలున్న రైతులకు.. ప్రస్తుతం 4, 5 ఎకరాల భూమి కూడా లేదు. కారణం కరువు ప్రాంతమైన ఈ ఏరియాలో పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం అతి తక్కువ ధరలకు భూములమ అమ్ముకున్నారు. పలుచోట్ల పాతిక, ముప్పై ఏళ్ల క్రితం తక్కువ ధరలకు పెట్టుబడిదారులకు భూములను తెగనమ్ముకున్న రైతులు.. ఇప్పుడు వారి దగ్గరే రోజు కూలీలుగా మారిన సందర్భాలున్నాయి. అప్పట్లో రైతులు పొలాల్లో భూమి లెవల్‌ పనులు, పండ్ల తోటలకు గుంతలు తీయడం లాంటివి చేయించేవారు. ఇప్పుడు రైతులెవరూ తమ పొలాల్లో పనులు చేయించడానికి ముందుకు రాకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఫారెస్టు భూముల్లో కూలీలు ఉపాధి పనులు చేస్తూ వస్తున్నారు. 


ఫారెస్టు భూములే దిక్కు

ఇబ్రహీంపట్నం డివిజన్‌లో వ్యవసాయ భూములు కనుమరుగవడంతో ఉపాధి పనులు ఎక్కడ చేయించాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ప్రాంతంలో వేల ఎకరాలు రిజర్వు ఫారెస్టు భూములున్నాయి. నాలుగైదేళ్లుగా ఇవే భూముల్లో ఖండిత కందకాల పనులు చేయిస్తున్నారు. వీటిలో కూడా గతంలో తీసిన కందకాల స్థానంలోనే మళ్లీ కందకాలు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇబ్రహీంపట్నం మండలంలో రాయపోల్‌, నాగనపల్లి, పోల్కంపల్లి గ్రామాల కూలీలు ఇబ్రహీంపట్నంలోని నల్లకంచె, ఎర్రకంచె అటవీ భూముల్లో పనులు చేస్తున్నారు. దండుమైలారం కూలీలు హఫీజ్‌పూర్‌ అటవీ కంచెలో.. చెర్లపటేల్‌గూడ, తుర్కగూడ, కప్పాడు, తులేకలాన్‌ కూలీలు ఆగాపల్లి ఫారెస్టు భూముల్లో.. ఎలిమినేడు కూలీలు ఎలిమినేడు ఫారెస్టు భూముల్లో.. పోచారం, ఉప్పరిగూడ కూలీలు కొంగర కలాన్‌ అటవీ కంచెలో పనులు చేస్తున్నారు. అలాగే యాచారం మండలం గున్‌గల్‌ ఫారెస్టులో ధర్మన్నగూడ, చిన్నతూండ్ల, గడ్డమల్లాయగూడ, గున్‌గల్‌ గ్రామాలకు చెందిన కూలీలు... తాడిపర్తి ఫారెస్టులో తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన కూలీలు ఖండిత కందకాల పనులు చేస్తున్నారు. అలాగే మంచాల మండలానికి సంబంధించి ఆగాపల్లి ఫారెస్టులో నోముల, లింగంపల్లి, ఆగాపల్లికి చెందిన కూలీలు.. చిత్తాపూర్‌ ఫారెస్టులో చిత్తాపూర్‌కు చెందిన కూలీలు పనులు చేస్తున్నారు. ఇవేగాక అబ్ధుల్లాపూర్‌మెట్‌, కందుకూరు, మహేశ్వరం మండలాల్లో కూడా ఉపాధి పనులు చేయడానికి భూములను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండేళ్లుగా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరడంతో వీటిల్లో కూడా పూడిక తీయలేకపోతున్నారు. 


గతంలోకి వెళితే..

పథకం ప్రారంభంలో సర్కారు తుమ్మ, పొదల తొలగింపు, రాతి కట్టల నిర్మాణం, కొండవాలు ప్రాంతాల్లో వర్షపు నీటిని నిలువ చేసే కట్టడాలు, మట్టి కట్టల నిర్మాణం, భూమి చదును, సరిహద్దు కందకాల తవ్వకం, ఫాం పాండ్స్‌, ఊట కుంటల నిర్మాణం, పూడిక మట్టిని రైతు పొలాలకు తరలించుట, ఇందిర జలప్రభ కింద ఎస్సీ, ఎస్టీ, చిన్న సన్నకారు రైతుల పొలాల్లో పండ్లతోటల్లో భూసంరక్షణ కందకాలు తవ్వే పనులు చేపట్టారు. ఇవేగాక డంపింగ్‌ యార్డుల్లో భూమి చదును, ఇంకుడుగుంతల నిర్మాణం, పశువుల తొట్ల నిర్మాణం, నాడెప్‌ కంపోస్టు పిట్లు, మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల్లో, ఎండిన బావుల్లో పూడికతీత, బావుల రీచార్జి స్ట్రక్చర్ల నిర్మాణం, చౌడు భూముల్లో ఎర్రమట్టిని తోలడం, హరితహారం కింద గుంతలు తీయడం లాంటి పనులు చేపట్టారు. ఫీడర్‌ ఛానల్‌ పునరుద్ధరణ, వీటిలో పూడికతీత పనులు చేపట్టారు. ఆ మధ్యకాలంలో శ్మశాన వాటికల లెవల్‌ పనులు, వీటిలో పొదలు తొలగింపు, చెట్లు నాటడం, ఉపాధి కింద వేసిన మట్టి రోడ్ల పునరుద్ధరణ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. పశువుల తొట్ల నిర్మాణం, పశువులకు షెడ్ల నిర్మాణం, పశుగ్రాసాల పెంపు, మేకల షెడ్లు, కోళ్ల షెడ్ల నిర్మాణం పనులు చేపట్టేవారు. అలాగే వ్యక్తిగత ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడుగుంతల నిర్మాణం, బయోటాయిలెట్ల నిర్మాణం, మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల్లో చెట్లు పెంచడం, అలుగు మరమ్మతు పనులు, నర్సరీల్లో మొక్కలు పెంచడం లాంటి పనులు చేసేవారు. వ్యవసాయ భూములన్నీ వెంచర్లుగా మారడంతో ఉపాధి పనులు ఎక్కడ చేయించాలో అధికారులకు తెలియడం లేదు. ప్రసుత్తం అటవీ భూముల్లో కందకాలు తీయడం, అక్కడక్కడ భూమి లెవలింగ్‌ పనులు, పొదల తొలగింపు, చెరువు కట్టలపై చెట్ల తొలగింపు పనులు మాత్రమే నడుస్తున్నాయి. 


పనుల కల్పనకు ప్రత్యామ్నాయం చూస్తున్నాం..

ఈ ప్రాంతంలో అర్బన్‌ మండలాల్లో వ్యవసాయ పొలాలు చాలావరకు ఇతరుల చేతుల్లోకి వెళ్లాయి. దీంతో పనులు కల్పించడానికి ప్రత్యామ్నాయం చూస్తున్నాం. ఉన్న పొలాల్లో పనులు చేపట్టడానికి రైతులు ముందుకు రావడం లేదు. ఈ క్లస్టర్‌లో 9 మండలాలుండగా ప్రసుత్తం రోజుకు 21 వేయి మంది ఉపాధి పనులు చేస్తున్నారు. 

-సక్రియా, ఏపీడీ, ఉపాధి హామీ పథకం


కూలీ గిట్టుబాటైత లేదు

వేసవి ఎండలు మండుతున్నయ్‌. ఫారెస్టుల్లో కందకాల పనులు చేస్తున్నా రోజుకు 150-160 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. రాయపోల్‌ నుంచి ఆటోలో రానుపోను చార్జీలే 30 రూపాయలైతుంది. ఈసారి ఎండాకాలం అలవెన్స్‌ కూడా తీసేయడంతో మరింత ఇబ్బంది పడుతున్నాం. వెంటనే అలవెన్స్‌ను చేర్చాలి.

- గువ్వల్ల పెంటమ్మ, రాయపోల్‌, ఇబ్రహీంపట్నం 


వ్యవసాయానికి అనుసంధానం చేయాలి

పంటల పెట్టుబడులు చూస్తే రైతులకు గిట్టుబాటు అయిత లేదు. కూరగాయ పంటలు వేస్తే కూలీలకే రోజుకు 300 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. కూరగాయలకు ధరలు లేని సమయంలో పెట్టుబడులు కూడా ఎల్తలేవు. అందుకే రైతులు చాలామంది వ్యవసాయం వదిలి ఇతర పనులు చేసుకుంటుండ్రు. ఈ పరిస్థితుల్లో ఉపాఽధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. 

- బూడిద రవికాంత్‌రెడ్డి, కప్పాడు, ఇబ్రహీంపట్నం 

Updated Date - 2022-04-30T04:50:05+05:30 IST