ఆక్రమణల జోరు.. అధికారుల బేజారు !

ABN , First Publish Date - 2022-07-03T04:45:50+05:30 IST

పీలేరు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఓ పట్టాన ఆగేటట్టు లేదు.

ఆక్రమణల జోరు.. అధికారుల బేజారు !
పీలేరు ఇందిరమ్మ కాలనీ వద్ద అధికారులు నాటిన బోర్డు (ఫైల్‌)

ఓవైపు తొలగిస్తున్నా మరోవైపు నిర్మాణాలు

తలలు పట్టుకుంటున్న అధికారులు 


పీలేరు, జూలై 2: పీలేరు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఓ పట్టాన ఆగేటట్టు లేదు. అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా ఆక్రమణదారుల జోరుకు కళ్లెం వేయలేకున్నారు. పీలేరు పట్టణంలో మంగళవారం ఒక్కరోజే మూడు వేర్వేరు స్థలాల్లో జరుగుతున్న ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను స్థానిక రెవెన్యూ అధికారుల అడ్డుకున్నారు. అంతేకాకుండా అప్పటి వరకు జరిగిన కట్టడాలను కూల్చివేశారు. ఈ సంఘటనతో పీలేరు ప్రాంతంలో భూ ఆక్రమణలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గతంలో జరిగిన భూఆక్రమణలు, అక్రమ కట్టడాల వల్ల రాజుకున్న వేడి చల్లారక ముందే ఈ ఆక్రమణలు బయటపడడంతో వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 


ఆక్రమణలు తొలగించిన అధికారులు 

పీలేరు ఇందిరమ్మ కాలనీ సమీపంలోని సర్వే నెంబరు 1131/5, ముడుపుల వేముల పంచాయతీ పరిధిలోని ఏపీఐఐసీ లే-ఔట్‌, పీలేరు-తిరుపతి మార్గంలోని ప్రభుత్వ స్థలాల్లో జరుగుతున్న ఆక్రమణలను రెవెన్యూ అధికారులు మంగళవారం అడ్డుకుని అక్కడ జరిగిన కట్టడాలను కూడా కూల్చివేశారు. సర్వే నెంబరు 1131/5లో ఇది వరకే రెవెన్యూ అధికారులు ‘ఇది ప్రభుత్వ స్థలం’ అంటూ బోర్డు కూడా నాటారు. ఆ బోర్డు అక్కడ ఉండగానే కొంత మంది అక్కడ 13 ఇళ్ల నిర్మాణాల కోసం పునాదులు వేసుకున్నారని, వాటన్నింటినీ అధికారులు ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ముడుపులవేముల ఏపీఐఐసీ లే-ఔట్‌లో ఆక్రమణకు గురైన రోడ్డును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పీలేరు-తిరుపతి మార్గంలో ప్రభుత్వ స్థలంలో చేపడుతున్న నిర్మాణాలను తొలగించారు. గతంలోనూ అధికారులు ఇందిరమ్మ కాలనీ, తిరుపతి రోడ్డులో పలు అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చి వేశారు. అయినప్పటికీ అక్రమార్కులు ఎటువంటి బెరుకూ లేకుండా తిరిగి నిర్మాణాలు చేపట్టడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 


అక్రమార్కులకు కల్పతరువుగా ఇంటి పట్టాలు 

ప్రభుత్వం పేదలకు మంజూరు చేసే ఇంటి పట్టాలు పీలేరులోని అక్రమార్కులకు కల్పతరువుగా మారాయి. గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన తహసీల్దార్ల సంతకాలతో కూడిన ఇంటి పట్టాలు ప్రస్తుతం పీలేరులో ఇబ్బడి ముబ్బడిగా షికారు చేస్తున్నాయి. 2006లో పీలేరు తహసీల్దారుగా పనిచేసిన అధికారి దగ్గర నుంచి ఏడాది క్రితం పనిచేసిన అధికారి వరకు వారి సంతకాలతో కూడిన పట్టాలు పుచ్చుకుని చాలా మంది పట్టణంలో చెలరేగిపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతరుల పేరిట రిజిష్టర్‌ అయిన భూముల్లో సైతం రెవెన్యూ వారిచ్చిన పట్టాలు చూపుతూ ఆయా భూముల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఎక్కడైనా వివాదాలు జరిగితే ఆయా పట్టాలను పరిశీలించి ఏవి నిజమైనవో తేల్చాల్సిన అధికారులు కూడా మీనమేషాలు లెక్కిస్తుండడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పీలేరు-తిరుపతి మార్గంలో శుక్రవారం ఇటువంటి సంఘటనే వెలుగు చూసింది. పీలేరు మండలం గూడరేవుపల్లె పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు 200/2లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తిమ్మాపురం రఘురామిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేరిట 3.39 ఎకరాల భూమి రిజిష్టర్‌ అయి ఉంది. దాని పక్కనే 53 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ భూమిలో తమకు పట్టాలిచ్చారంటూ కొంత మంది శుక్రవారం రఘురామిరెడ్డికి చెందిన భూమిని చదును చేస్తుండగా ఆయన అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమికి హద్దులు గుర్తించకుండానే అధికారులు పట్టాలు మంజూరు చేశారని, పట్టాలు పొందిన వారు తమ భూమిలోకి ప్రవేశించి చదును చేస్తున్నారని ఆయన వాపోయారు. ఇటువంటి సంఘటనలు పీలేరులో నిత్యకృత్యమైపోయాయి. 


ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తున్నాం

- రవి, తహసీల్దారు, పీలేరు

పీలేరు పరిసర ప్రాంతాల్లో వెలుగు చూస్తున్న ఆక్రమణలపై కఠినంగానే వ్యవహరిస్తున్నాం. ప్రాథమిక దశలోనే కొన్ని చోట్ల గుర్తించి వాటిని ధ్వంసం  చేస్తున్నాం. ప్రభుత్వ భూముల్లో గతంలో నాటిన బోర్డులు కూడా కనిపించడం లేదు. ఇకపై వాటిని తొలగించే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. భూములకు విపరీతమైన ధరలు రావడంతో ఆక్రమణలు, వివాదాలు ఎక్కువైపోతున్నాయి. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. వారి అనుమతులు, సూచనలతో పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటాం.  



Updated Date - 2022-07-03T04:45:50+05:30 IST