భూ బాధిత రైతు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-08-11T06:04:09+05:30 IST

భూ బాధిత రైతు ఆత్మహత్యాయత్నం

భూ బాధిత రైతు ఆత్మహత్యాయత్నం

  • బైపాస్‌ రోడ్డులో భూమి కోల్పోయిన రైతు
  • పరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆవేదన
  • ఎమ్మెల్యే సమీప బంధువు ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నం
  • ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న రైతు 
  • పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.. బాధితుడికి కౌన్సెలింగ్‌
  • పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్న టీఆర్‌ఎస్‌ నాయకులు

తాండూరు, ఆగస్టు 10 : బైపాస్‌ రోడ్డులో భూమిని కోల్పోయిన రైతు.. పరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్‌కు చెందిన శామమ్మకు సర్వేనెంబర్‌-61లో 20 గుంటల భూమి ఉంది. అట్టి భూమిని బైపాస్‌ రోడ్డు నిమిత్తం ప్రభుత్వం ఏడాది క్రితం స్వాధీనం చేసుకుంది. అయితే, ఆ భూమిని స్వాధీనం చేసుకునే ముందు తనకు డబ్బులు చెల్లిస్తేనే భూమి ఇస్తానని శామమ్మ మొండికేసింది. దీంతో ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తన సమీప బంధువు టీఆర్‌ఎస్‌ నాయకుడు ఇందర్‌చెడ్‌ రాజుకు బాధ్యతలు అప్పగించారు. బైపాస్‌ రోడ్డు నిమిత్తం తీసుకున్న భూమికి ప్రభుత్వం పరిహారం చెల్లించకపోతే తాను ఇప్పస్తానని ఇందర్‌చెడ్‌ రాజు హామీ ఇచ్చాడు. ఈక్రమంలో హామీ ఇచ్చి  నెలలు గడుస్తున్నా పరిహారం ఇవ్వకపోవడంతో బుధవారం శామమ్మ కుమారుడు నరేష్‌ పెట్రోల్‌ డబ్బాతో తాండూరులోని ఇందర్‌చెడ్‌ రాజు ఇంటి వద్దకు చేరుకుని ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం టీఆర్‌ఎస్‌ నాయకులు బాల్‌రెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతు సమస్యను పరిష్కరించేందుకు ఆర్డీవో దృష్టికి తీసుకెళతామని, పరిహారం కింద డబ్బులు ఇప్పించేందుకు కృషి చేస్తామని నరే్‌షకు నచ్చజెప్పారు. అదేవిధంగా ఈనెల 16వ తేదీన కలెక్టర్‌ వద్దకు తీసుకెళతామని ఆర్డీవో హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈమేరకు టీఆర్‌ఎస్‌ నాయకులు రాజు, బాల్‌రెడ్డిలు సంబంధిత శాఖ అధికారితో ఫోన్‌లో మాట్లాడారు. వీలైనంత త్వరగా బాధిత రైతుకు పరిహారం చెల్లించేలా చూడాలని వారు కోరారు.

Updated Date - 2022-08-11T06:04:09+05:30 IST