భూసేకరణం!

ABN , First Publish Date - 2022-01-03T05:16:58+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో సాగు జలాలు అందించే కీలకమైన ప్రాజెక్టులు ఇవి. వెయ్యి ఎకరాల భూములు అవసరం ఉంది. ఇప్పటికే 680 ఎకరాల కోసం రెవెన్యూ శాఖకు ఇరిగేషన్‌ అధికారులు రిక్విజేషన్‌ పంపారు. మరో 320 ఎకరాల సేకరణ సమస్యగా మారింది.

భూసేకరణం!
గండికోట ఎత్తిపోతల పథకం హెడ్‌ పంపింగ్‌ కేంద్రం

గండికోట-చిత్రావతి లిఫ్టు, మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య

సాగుపొలాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపని రైతులు

320 ఎకరాల కోసం ఆగిన పనులు

రైతులు సహకరించాలని సీఎం జగన్‌ విన్నపం

అయినా.. ముందుకు రాని అన్నదాతలు

అమరావతి కోసం పైసా ఖర్చు లేకుండా..

33 వేల ఎకరాలు సేకరించిన నాటి సీఎం 

సొంత నియోజకవర్గంలోనే 320 సేకరణకు రైతులను ఒప్పించలేని జగన్‌


ముఖ్యమంత్రి జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో సాగు జలాలు అందించే కీలకమైన ప్రాజెక్టులు ఇవి. వెయ్యి ఎకరాల భూములు అవసరం ఉంది. ఇప్పటికే 680 ఎకరాల కోసం రెవెన్యూ శాఖకు ఇరిగేషన్‌ అధికారులు రిక్విజేషన్‌ పంపారు. మరో 320 ఎకరాల సేకరణ సమస్యగా మారింది. భూములు ఇచ్చేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం నాటి సీఎం చంద్రబాబు రైతులను ఒప్పించి 33 వేల ఎకరాలు సేకరించారు. ప్రపంచ గుర్తింపు పొందేలా అమరావతి నిర్మాణానికి సై అన్నారు. భూసేకరణ సమస్య వల్లే రూ.4200 కోట్లతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు మొదలు పెట్టలేకపోతున్నామని సాక్షాత్తు సీఎం జగన్‌ పేర్కొనడం కొసమెరుపు. అది కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గంలోనే. గండికోట-చిత్రావతి లిఫ్ట్‌, మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు భూసేకరణ సమస్యపై ప్రత్యేక కథనం.


(కడప-ఆంధ్రజ్యోతి): కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో 10 టీఎంసీల సామర్థ్యంతో చిత్రావతి జలాశయం, 6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పైడిపాలెం జలాశయం నిర్మించారు. 1.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం. గండికోట జలాశయం నుంచి చిత్రావతి, పైడిపాలెం జలాశయాలకు కృష్ణా జలాలు ఎత్తిపోస్తున్నారు. గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకం సామర్థ్యం 2 వేల క్యూసెక్కులు, గండికోట-పైడిపాలెం లిఫ్ట్‌ సామర్థ్యం 1000 క్యూసెక్కులు. పూర్తి సామర్థ్యంతో రిజర్వాయర్లు నింపాలంటే 60 రోజులు కృష్ణా జలాలు ఎత్తిపోయాలి. గత చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు పూర్తి చేసి పులివెందులకు సాగునీరు ఇచ్చారు. శ్రీశైలం జలాశయానికి చేరే వరద యేటేటా తగ్గుతుండడం వల్ల వరద ఉన్న 30 రోజుల్లోనే 16 టీఎంసీలు ఎత్తిపోసేందుకు రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకంలో భాగంగా గండికోట-చిత్రావతి లిఫ్ట్‌ సామర్థ్యం 4 వేలకు, గండికోట-పైడిపాలెం లిఫ్ట్‌ను 2 వేల క్యూసెక్కులకు పెంచుతూ ఈ లిఫ్టులకు సీఎం జగన్‌ 2020 డిసెంబరు 24న శంకుస్థాపన చేశారు. రూ.3 వేల కోట్లతో టెండర్లు పిలిస్తే.. మెగా కంపెనీ టెండర్లు దక్కించుకుంది. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ నిబంధనల మేరకు కాంట్రాక్ట్‌ సంస్థ క్షేత్రస్థాయిలో సర్వే చేసింది. పనులు చేపట్టాలంటే భూసేకరణ సమస్య అడ్డంకిగా మారింది.  


భూములు ఇచ్చేందుకు ఒప్పుకోని హిమకుంట్ల రైతులు

గండికోట నుంచి చిత్రావతికి నీటిని ఎత్తిపోసే లిఫ్ట్‌ 30 కి.మీ.లు పైపులైన్‌, పైడిపాలెంకు ఎత్తిపోసే లిఫ్ట్‌ 16 కి.మీ.లు పైపులైన్‌ నిర్మించాలి. ఈ రెండు లిఫ్టులకు వేర్వేరు అలైన్మెంట్‌ ద్వారా పైపులైన్‌, కాలువలు, టన్నెల్స్‌ నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం 550 ఎకరాల భూసేకరణ చేయాలి. పైడిపాలెం లిఫ్ట్‌కు ఎలాంటి సమస్య లేదు. గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకం 2 వేల క్యూసెక్కులు ఎత్తిపోసే ప్రస్తుత పైపులైన్‌ అనంతపురం జిల్లా నుంచి 47 కి.మీ.లు ఉంది. పాత అలైన్మెంట్‌ పక్కనే కాకుండా పూర్తిగా కడప జిల్లాలోనే మరో 2 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో గండికోట, లావనూరు, వై.కొత్తపల్లి, హిమకుంట్ల, సింహాద్రిపురం, బిదినంచర్ల, వెలిగండ్ల, నిడ్జంపల్లి, పార్నపల్లి మీదుగా పైప్‌లైన్‌ నిర్మించేలా కొత్త అలైన్మెంట్‌కు డిజైన్‌ చేశారు. హిమకుంట్ల సమీపంలో 14 కి.మీ.లు పైప్‌లైన్‌ నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం 120 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని ఇంజనీర్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.15 లక్షలకు మించి ఇచ్చే పరిస్థితి లేదని సమాచారం. అక్కడ స్థిరాస్తి వ్యాపారాలు పెరగడం వల్ల ఎకరం రూ.కోటి నుంచి రూ.1.50 కోట్లు పలుకుతోందని రైతులు అంటున్నారు. సాగు భూములే ఎకరా రూ.25-50 లక్షలు పలుకుతోందని అంటున్నారు. దీంతో ప్రభుత్వ రేట్లకు భూములు ఇచ్చేందుకు రైతులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో భూసేకరణ సమస్యగా మారింది. పైప్‌లైన్‌ అలైన్మెంట్‌కు సమీపంలోనే 42 మీటర్ల వెడల్పుతో సాగునీటి కాలువ ఉంది. కేవలం 350 క్యూసెక్కులకే కాలువ నిర్మాణం చేశారు. ఆ కాలువను 2350 క్యూసెక్కులకు విస్తరిస్తే.. భూసేకరణ సమస్య ఉండదని రైతులు అంటున్నారు. అన్నదాత ఆసక్తి చూపని 120 ఎకరాలు మినహా.. 430 ఎకరాలకు ల్యాండ్‌ రిక్విజేషన్‌ కోసం రెవెన్యూ అధికారులకు నివేదిక పంపామని ఇంజనీర్లు పేర్కొన్నారు. రైతుల కోరిక మేరకు అలైన్మెంట్‌ మార్చి ప్రస్తుతం ఉన్న కాలువను విస్తరిస్తారా..? బలవంతంగా భూసేకరణ చేసి సర్వే చేసిన అలైన్మెంట్‌ ప్రకారమే గండికోట-చిత్రావతి లిఫ్ట్‌ పైప్‌లైన్‌ నిర్మిస్తారా..? వేచి చూడాల్సిందే. 


సంపులకు భూములు ఇవ్వని రైతులు

పులివెందుల నియోజకవర్గంలో పీబీసీ, జీకేఎల్‌ఐ, సీబీఆర్‌ పరిధిలో తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టు సాగు లక్ష్యంగా మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 1.22 లక్షల ఎకరాలకు సూక్ష్మసేద్యం ద్వారా సాగునీరు ఇచ్చే ఈ కీలక ప్రాజెక్టుకు రూ.1200 కోట్లతో టెండర్లు పిలిస్తే.. ఈ పనులు కూడా మెగా కంపెనీనే దక్కించుకుంది. ప్రతి 120-140 ఎకరాలకు ఒక సంపు చొప్పున 850 సంపులు నిర్మించాలి. ఒక్కో సంపుకు 0.60 ఎకరాల ప్రకారం 450 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఇక్కడ కూడా భూసేకరణ సమస్యగా మారింది. మెజార్టీగా సన్న చిన్నకారు రైతులే ఉన్నారు. ఉన్న పొలంలో సంపు కోసం 60 సెంట్లు ఇస్తే ఎలా బతికేదని రైతుల ఆవేదన. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో భూములు కొందామన్నా.. ఇచ్చిన భూమిలో సగం భూమి కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో కాలువల్లో పుష్కలంగా నీరు ఉందని, మాకు సంపులే వద్దని రైతులు అంటున్నారు. 250 ఎకరాలకు రెవెన్యూ అధికారులకు ల్యాండ్‌ రిక్విజేషన్‌ పంపారు. మరో 200 ఎకరాలు సేకరించడం సమస్యగా మారడంతో.. ఒకే రైతు నుంచి 0.60 ఎకరాలను తీసుకోం.. ముగ్గురు నలుగురు రైతులు భూములు కలిసే చోట ఒకే రైతు నష్టపోకుండా సమానంగా భూమి తీసుకుని సంపు నిర్మిస్తాం.. ఉద్యాన పంటలకు సూక్ష్మ సేద్యం ఎంతో ప్రయోజనం.. అంటూ ఇరిగేషన్‌, ఏపీఎంఐపీ, వ్యవసాయ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించే పనుల్లో నిమగ్నం అయ్యారు. 320 ఎకరాల భూసేకరణ సమస్య వల్ల రూ.4200 కోట్లతో చేపట్టిన కీలకమైన రెండు ప్రాజెక్టుల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. టెండరు నిబంధల ప్రకారం 2023 మార్చి ఆఖరులో ఈ పనులు పూర్తి చేయాలి. సర్వే, భూసేకరణలోనే నెలలు గడిచిపోతుండడంతో గడువులోగా నిర్మాణం సాధ్యమా..? అనే ప్రశ్న తలెత్తుతుంది. జాప్యంతో పాటు నిర్మాణ వ్యయం పెరిగి ప్రభుత్వంపై అదనపు భారం తప్పడం లేదు. 


చిత్రావతి జలాశయం నెల రోజుల్లో నింపేలా గండికోట - చిత్రావతి ఎత్తిపోతల పథకం, పులివెందుల నియోజకవర్గంలో 1.20 లక్షల ఎకరాలు సూక్ష్మ సేద్యం కిందకు తెచ్చేలా మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టులను చేపట్టాం. ఈ ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యగా మారడం వల్ల పనులు మొదలు కాలేదు. భూములు ఇచ్చి రైతులు సహకరించాలి. 

- డిసెంబరు 24న పులివెందుల సభలో సీఎం జగన్‌


భూసేకరణ సమస్య వాస్తవమే 

గండికోట-చిత్రావతి లిఫ్ట్‌, మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య వాస్తవమే. రెండు ప్రాజెక్టులకు వెయ్యి ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. చిత్రావతి లిఫ్ట్‌ పరిధిలో 120 ఎకరాలు సేకరణ సమస్యగా ఉంది. ఇక్కడ భూముల రేట్లు ఎక్కువ ఉన్నాయని, ప్రభుత్వం ఇచ్చే భూపరిహారం మాకు సరిపోదని, ప్రత్నామ్నాయంగా 42 మీటర్ల వెడల్పుతో ఉన్న కాలువను 2350 క్యూసెక్కులకు విస్తరించాలని రైతులు కోరుతున్నారు. ఆ దిశగా సర్వే చేస్తున్నాం. మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టులో 250 ఎకరాలకు ల్యాండ్‌ రిక్విజేషన్‌ పంపాం. 200 ఎకరాలు సేకరణ సమస్యగా ఉంది. రైతులను ఒప్పిస్తున్నాం.          

 - మల్లికార్జునరెడ్డి, ఎస్‌ఈ, గాలేరు-నగరి ప్రాజెక్టు, కడప



Updated Date - 2022-01-03T05:16:58+05:30 IST