యాదాద్రీశుడి సన్నిధిలో వైభవంగా లక్ష్మీ పూజలు

ABN , First Publish Date - 2020-10-24T11:37:48+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం ఆండాల్‌ అమ్మవారికి లక్ష్మీ పూజలు, లక్ష్మీనృసింహుడికి సువర్ణ పుష్పార్చన నిర్వహించారు.

యాదాద్రీశుడి సన్నిధిలో వైభవంగా లక్ష్మీ పూజలు

యాదాద్రి టౌన్‌, అక్టోబరు 23: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం ఆండాల్‌ అమ్మవారికి లక్ష్మీ పూజలు, లక్ష్మీనృసింహుడికి సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. వేకువజామునే సుప్రభాత సేవ, బాలాలయ కవచమూర్తులకు సువర్ణ పుష్పార్చన చేశారు. సాయంత్రం ఆండాల్‌ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసిదళాలు, కుంకుమలతో అర్చించారు. 


సాయంత్రం ఆండాల్‌ అమ్మవారిని ఆరాధిస్తూ ఊంజల్‌ సేవ నిర్వహించారు. అనుబంధ రామలింగేశ్వర ఆలయంలో చరమూర్తులను ఆరాధించిన అర్చకులు శరన్నవరాత్రి వేడుకలను సంప్రదాయ రీతిలో నిర్వహించారు. శ్రీదేవీ అమ్మవారిని కొలుస్తూ నవావరణ, మూలమంత్ర, దేవీ సప్తశతి పారాయణ పఠనాలు చేశారు. అనంతరం లలితా సహస్రనామ పఠనాలతో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. స్వామి వారికి భక్తుల నుంచి శుక్రవారం రూ.3,15,261 ఆదాయం సమకూరింది. 


శిల్పికి తప్పిన ప్రమాదం 

ఆలయ పునర్నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఓ శిల్పికి శుక్రవారం త్రుటిలో ప్రమాదం తప్పింది.  ఆలయ పునర్నిర్మాణ పనుల నిర్వాహణకు తమిళనాడు ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఓ శిల్పి పనులు నిర్వహిస్తున్న క్రమంలో ఐరన్‌ స్కపోర్టింగ్‌ పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. అయితే రాతి ఫ్లోరింగ్‌పై పడిన కార్మికుడికి కాలు బెణికింది. చికిత్స నిమిత్తం కార్మికుడిని ఆస్పత్రికి తరలించారు. అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థపతులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2020-10-24T11:37:48+05:30 IST