Lakhimpur Violence case: ఆశిష్ మిశ్రాకు బెయిల్ నిరాకరణ

ABN , First Publish Date - 2022-07-26T20:37:58+05:30 IST

లఖింపూర్ హింస కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కు బెయిల్ ఇచ్చేందుకు..

Lakhimpur Violence case: ఆశిష్ మిశ్రాకు బెయిల్ నిరాకరణ

లక్నో: లఖింపూర్ హింస కేసు (Lakhimpur Violence case)లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా (Ashish mishra)కు బెయిల్ ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ మంగళవారంనాడు నిరాకరించింది. లఖింపూర్ హింసాత్మక ఘటనలో 8  మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. ఆశిష్ మిశ్రా రాజకీయంగా పలుకుబడి కలిగినందున సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని, విచారణపై ఆ ప్రభావం పడవచ్చని జస్టిస్ కృష్ణ పహల్ బెంచ్ పేర్కొంది. బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తికావడంతో ఈనెల 15వ తేదీన తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.


దీనికి ముందు ఫిబ్రవరి 10వ తేదీన ఆశిష్‌కు లక్నో బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. అయితే సుప్రీంకోర్టు దానిని రద్దు చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు  అనుగుణంగానే బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరిగి విచారణ జరిపింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరి జిల్లాలో ఆందోళనకు దిగిన రైతులపై స్పీడుగా వాహనం నడపడంతో నలుగురు రైతులు మరణించాడు. ఆందోళనకారులు తిరగబడటంతో హింస చెలరేగి ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, వాహనం డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఆశిష్ మిశ్రా సహనిందితుడిగా ఉన్నాడు.

Updated Date - 2022-07-26T20:37:58+05:30 IST