GHMC : లక్షలకు లక్షలు పెనాల్టీలు సరే.. వసూళ్లేవీ.. ఏంటిది..!?

ABN , First Publish Date - 2022-01-11T19:45:14+05:30 IST

GHMC : లక్షలకు లక్షలు పెనాల్టీలు సరే.. వసూళ్లేవీ.. ఏంటిది..!?

GHMC : లక్షలకు లక్షలు పెనాల్టీలు సరే.. వసూళ్లేవీ.. ఏంటిది..!?

  • ఈవీడీఎం చోద్యం..
  • పార్టీలు, నేతలకు భారీగా జరిమానాలు
  • వసూలు కాని మెజార్టీ పెనాల్టీలు 
  • పేద, మధ్య తరగతి వర్గాలపై ప్రతాపం

- అక్టోబర్‌ 25న జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సందర్భంగా గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు, ప్రవేశ ద్వారాలకు రూ.12 లక్షలకుపైగా పెనాల్టీ విధించారు. 

- బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్ర నేపథ్యంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించడంతో పాటు.. ట్విట్టర్‌లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా జరిమానా వేశారు. 

- ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలకు సంబంధించిన జన్మదినాలు, కార్యక్రమాల సందర్భంగా ఫ్లెక్సీలు, కటౌట్లకు పెనాల్టీ వేస్తున్నారు. 

- టైలర్‌ షాప్‌ నుంచి బడా మాల్‌ వరకు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసే బోర్డులకూ జరిమానా విధిస్తున్నారు. 


- నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని పెనాల్టీ వేస్తోన్న జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) విభాగం వాటి వసూలులో మాత్రం వివక్ష చూపుతోంది. సామాన్యుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న అధికారులు.. పార్టీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, బడా వ్యాపార సంస్థల నుంచి పెనాల్టీల వసూలును పట్టించుకోవడం లేదు. బతుకుదెరువు కోసం వ్యాపారం చేసుకునే వారిని బెంబేలెత్తిస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌.. అర్ధ, అంగ బలం, రాజకీయ పలుకుబడి ఉన్న వారి జోలికి వెళ్లకపోవడంపై విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్లీనరీ నేపథ్యంలో విధించిన జరిమానాలు ఇప్పటికీ చెల్లించలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారొకరు తెలిపారు. ‘ఎంత జరిమానానో చెబితే చెల్లిస్తామని గతంలో టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పారు. ఆ తరువాత వాళ్లు రాలేదు. మేం అడగలేదు’ అని పేర్కొన్నారు.


తాజాగా ఇద్దరు నేతలకు..

హైదరాబాద్‌ సిటీ/రాంనగర్‌ : మల్కాజ్‌గిరి శాసనసభ్యుడు మైనంపల్లి హన్మంతరావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పార్టీ నేత గరిసె నరేందర్‌కు సోమవారం రూ.25 వేలు జరిమానా వేశారు. రాంనగర్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, తదితరుల ఫొటోలతో ఏర్పాటుచేసిన కటౌట్‌, బ్యానర్లకు రూ.15 వేలు పెనాల్టీ విధించారు. నిబంధనలకు విరుద్ధంగా కటౌట్‌లు, ప్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు ఈ చలాన్లను సోమవారం ఆర్‌.మోజెస్‌ ఇంటి అడ్ర్‌సకు పంపించారు.


వేస్తున్నారంతే..

పార్టీల కార్యక్రమాలు, ప్రజాప్రతినిధులు, నేతల జన్మదినం, ఇతరత్రా సందర్భాలను పురస్కరించుకొని ఫ్లెక్సీలు, జెండాలు, బ్యానర్లు ఏర్పాటు చేసినందుకు కనిష్ఠంగా రూ.5 వేల నుంచి గరిష్ఠంగా రూ.2 లక్షలు, అంతకంటే ఎక్కువ పెనాల్టీ వేస్తున్నారు. ట్విట్టర్‌ ద్వారా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించిన క్రమంలో వేసిన జరిమానాలు లక్షకుపైగా ఉంటాయని ఆ విభాగం వర్గాలు చెబుతున్నాయి. వీటి మొత్తం రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. పెనాల్టీ విధిస్తోన్న ఈవీడీఎం.. వసూలును విస్మరిస్తోంది. మొత్తం జరిమానాల్లో చెల్లిస్తోన్న వారు 30-35 శాతంలోపే అని ఓ అధికారి చెప్పారు. అవి కూడా సామాన్యుల నుంచి వసూలు చేస్తున్నవే. నయానో, భయానో ప్రజల నుంచి జరిమానా వసూలు చేస్తున్న అధికారులు పార్టీలు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల జోలికి మాత్రం వెళ్లడం లేదు. 


సామాన్యులపై ప్రతాపం..

మల్కాజ్‌గిరి సర్కిల్‌ పరిధిలో కుట్టు మిషన్‌ నడిపించే ఓ మహిళ బోర్డు ఏర్పాటుచేస్తే.. ఆ బోర్డును తీసుకెళ్లడంతో పాటు రూ.5 వేలు జరిమానా వేశారు. పెనాల్టీ చెల్లించి బోర్డు తీసుకెళ్లాలని హుకూం జారీ చేశారు. ఈ తరహా ఘటనలు నగరంలో చాలా జరిగాయి. పేద, మధ్య తరగతి వర్గాలపై ప్రతాపం చూపుతున్న అధికారులు.. పైసా, పలుకుబడి ఉన్న వారిని మాత్రం వదిలేస్తున్నారు. కూకట్‌పల్లిలో ఓ వ్యక్తి తన ఇంటి గోడకు టులెట్‌ అని పేపర్‌ అంటించినందుకు పెనాల్టీ వేశారు. గోడకున్న పేపర్‌ తొలగించాక జరిమానా వేయడం విశేషం.  ఆన్‌లైన్‌లో వచ్చే ఫిర్యాదులకు సంబంధించి సామాన్యుల విషయంలో వెంటనే జరిమానా వేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌.. ప్రముఖులకు సంబంధించి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుండడం గమనార్హం.

Updated Date - 2022-01-11T19:45:14+05:30 IST