Abn logo
Apr 20 2021 @ 23:34PM

పైపులైను వేశారు.. గుంతలు పూడ్చడం మరిచారు...

16 నెలలుగా పంట సాగు లేదు

రైతులను నష్టపరచడమే లక్ష్యమా ?  

ఆవేదనలో బలసింగాయపల్లె రైతులు 


గ్యాస్‌ నిత్యావసరం. ప్రస్తుత పరిస్థితుల్లో అది లేనిదే ఏ ఇంట్లో పనీ జరగదు. అయితే ఈ గ్యాస్‌ ఎంత ముఖ్యమో అంత ప్రమాదకరం. దీనికి సంబంధించి చేసే పనులు కూడా ఎంతో జాగ్రత్తగా చేయాలి. ఏ మాత్రం నిర్ల క్ష్యంగా ఉన్నా ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మండలంలోని గ్యాస్‌ పైపులైను పనులు పలువురిని భయాందోళనకు గురి చేస్తు న్నాయి. అక్కడి పొలాల మధ్య నుంచి పైపులైన్లు వేసేందుకు 10 అడుగుల గుంతలు తవ్వారే కానీ వాటిని పూడ్చ డంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించారు. వివరాల్లోకెళ్తే.. 


       

చెన్నూరు, ఏప్రిల్‌ 20: ఆంధ్ర నుంచి తమిళనాడు వరకు హెచ్‌పీసీఎల్‌ గ్యాస్‌ పైపులైను ఏర్పాటుకు గతంలో పనులు మొదలయ్యాయి. 2019 నవంబరులో బలసింగాయపల్లె వ్యవసాయ పొలాల గుండా ఈ పనులను మొదలుపెట్టారు. గ్రామానికి చెందిన లేబాక వెంకటసుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, సౌరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, రమణారెడ్డి, క్రిష్ణారెడ్డి రైతుల భూముల గుండా పైప్‌లైను కోసం పది అడుగుల గుంత తవ్వి పైపులు వేశారు. కానీ వారి పనులు అయిపోగానే చేతులు దులుపుకుని వెళ్లా రంటూ ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలు తీసి వాటిని సరిగా పూడ్చకుండా వెళితే ఎలా అని, ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. పైగా అప్పట్లో మూడు నెలలకే పనులు పూర్తి చేస్తామని రైతులకు అగ్రిమెంటు రాసి 14 నెలలైనా పనులు పూర్తి చేయలేదు. ఎకరాకు నష్టపరిహారం ఇచ్చింది లక్షా 30 వేలే. లక్షలాది రూపాయల విలువ గల భూములు అవి. అయినా అందరి అవసరం కోసం ఏర్పాటు చేస్తున్నందున రైతులు మిన్నకుండిపోయారు.  కాగా రైతులు సేద్య పనుల కోసం భూమికి నీళ్లు పెట్టినప్పుడు, వర్షాలు పడ్డప్పుడు గ్యాస్‌ పైప్‌లైను ఎంత దూరం వేశారో అంత దూరం గుంతలు పడుతున్నాయి. దీంతో రైతులు సేద్య పనులు చేయించలేక వెనక్కి రావాల్సిన పరిస్థితి. పైగా ఈ పనులన్నీ భూములకు ఒక పక్కగా జరగలేదు. పూర్తి భూముల మధ్యలో జరిగాయి. సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులు, పైప్‌లైన్‌ యాజమాన్యం చేసిన తీరుతో 16 నెలలుగా రైతులు పంటలు సాగు చేయలేక వదిలేశారు. ఏదో ఒక పంట వేసుకోకపోతే తాము బతికేదెలా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


16 నెలలుగా పంట సాగు లేదు

గ్యాస్‌ పైప్‌ వేసిన పొలాల్లో పంటల సాగు కు  అవకాశం లేకుండా పోయింది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందరి అవసరం కోసం కదా అని మేము భూముల్లో పైపులైను వేసేందుకు అను మతిస్తే పైపులైను వేసి గుంతల్లో మట్టి సరిగా పూడ్చకుండా వెళ్లారు. ఇప్పటికైనా సంబంధిత యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై జిల్లా కలెక్టరును కూడా కలిసి సమస్యను వివరిస్తాం. 

- వెంకటసుబ్బారెడ్డి, రైతు, బలసింగాయపల్లె

Advertisement
Advertisement
Advertisement