ఆన్‌లైన్‌ క్లాసులకు స్పందన కరువు

ABN , First Publish Date - 2021-05-17T05:05:29+05:30 IST

యోగివేమన యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో విద్యనభ్యశిస్తున్న మొదటి, రెండవ, మూడవ సంవత్సరాల విద్యార్థులకు 13వ తేది నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు జరగాల్సి ఉంది.

ఆన్‌లైన్‌ క్లాసులకు స్పందన కరువు

4 రోజులవుతున్నా మొదలు కాని బోధన 

పట్టించుకోని యూనివర్శిటీ అధికారులు 

కడప(వైవీయూ), మే 16: యోగివేమన యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో విద్యనభ్యశిస్తున్న మొదటి, రెండవ, మూడవ సంవత్సరాల విద్యార్థులకు 13వ తేది నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు జరగాల్సి ఉంది. 4 రోజులవుతున్నా ఈ క్లాసులకు విద్యార్థుల నుంచి, కళాశాల యాజమాన్యాల నుంచి ఎటువంటి స్పందన లేదు. యూనివర్శిటీ అధికారులు దీనిపై శ్రద్ధ చూపకపోవడంతో ఈ క్లాసులు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని పలువురు చర్చించు కుంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా సుమారు 75 కళాశాలల్లో 30 వేలకు పైగా విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో విద్యను అభ్యసించాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలలు మూసివేశారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు వైవీయూనివర్శిటీ రిజిస్ట్రార్‌ యూనివర్శిటీ పరిధిలోని అన్ని కళాశాలలకు ఆన్‌లైన్‌ క్లాసులు జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే రిజిస్ట్రార్‌ ఆదేశాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలు ఆన్‌లైన్‌ క్లాసులు జరిపేందుకు చొరవ చూపడం లేదు. విద్యార్థులకు ఆండ్రాయిడ్‌ ఫోన్‌, లాప్‌టాప్‌ వంటి సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండడం వలన ఆన్‌లైన్‌ క్లాసులకు విద్యార్థులు ఆసక్తి చూపలేదని సమాచారం. గ్రామీణ పేద విద్యార్థులు తమకు సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆన్‌లైన్‌ క్లాసులకు దూరం కావాల్సి వస్తుందని, కనీసం ఉన్నత విద్యామండలి యూనివర్శిటీ అధికారులు ఒక సిస్టంకానీ, ఆండ్రాయిడ్‌ ఫోన్‌ కానీ అందిస్తే ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతామని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 30 వేల మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు జరగాల్సి ఉంది. అయితే యూనివర్శిటీ అధికారులు ఉన్నట్లుండి ఆన్‌లైన్‌ క్లాసులు జరపండని ఆదేశాలు జారీ చేయడం పట్ల విద్యార్థులకు ఇబ్బందిగా మారినట్లు పలువురు చెబుతున్నారు. ఇదే విషయమై రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌ను వివరణ కోరగా ఆన్‌లైన్‌ క్లాసులు జరపాలని ఉన్నత విద్యామండలి సూచనల మేరకు ఆదేశాలు జారీ చేశామని, అయితే కొంత ఇబ్బందిగా ఉండటం వాస్తవమేనని త్వరలో ఆన్‌లైన్‌ క్లాసులు జరిగేటట్లు చూస్తామన్నారు. 


స్పందించని కళాశాల యాజమాన్యాలు 

యూనివర్శిటీ అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లాలోని అధిక సంఖ్యలో కళాశాల యాజమాన్యాలు ఆన్‌లైన్‌ క్లాసులు జరిపేందుకు చొరవ చూపనట్లు సమాచారం. విద్యార్థులకు సరైన సదుపాయాలు లేకపోవడంతోనే ఆన్‌లైన్‌ క్లాసులు జరపడం కష్టమవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే మొదటి, రెండవ, మూడవ సంవత్సరం విద్యార్థులకు 50 శాతంపైగా సిలబస్‌ పూర్తయిందని, కళాశాల యాజమాన్యాలు చెబుతున్నాయి. డిగ్రీ కళాశాలలోని అధ్యాపకులు ఆన్‌లైన్‌ క్లాసులు చెబుదామన్నా విద్యార్థుల నుంచి స్పందన కరువైందని పలువురు అధ్యాపకులు చెప్పుకొచ్చారు. 

Updated Date - 2021-05-17T05:05:29+05:30 IST