కుమారుడు కేంద్రమంత్రి అయినా, మూలాలు మరువని తల్లిదండ్రులు

ABN , First Publish Date - 2021-07-20T18:00:50+05:30 IST

ఎవరి కుమారుడైనా చిన్న రాజకీయ నేత అవతారం ఎత్తితే, కుటుంబీకుల డాబు, దర్పం మామూలుగా ఉండదు. ఒక్కసారిగా వారి

కుమారుడు కేంద్రమంత్రి అయినా, మూలాలు మరువని తల్లిదండ్రులు

చెన్నై : ఎవరి కుమారుడైనా చిన్న రాజకీయ నేత అవతారం ఎత్తితే, కుటుంబీకుల డాబు, దర్పం మామూలుగా ఉండదు. ఒక్కసారిగా వారి వ్యవహార శైలి, మాట తీరు, వస్త్రధారణ ఇలా మొత్తం మారిపోతుంది. కానీ.... ఆ తల్లిదండ్రులు కుమారుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి. అయినా ఆ తల్లిదండ్రులు కూలి పనులే చేసుకుంటున్నారు. ఆ కేంద్ర మంత్రి పేరు ఎల్. మురుగన్. ప్రధాని మోదీ కొన్ని రోజుల క్రితం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. అందులో ఎల్. మురుగన్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్. మురుగన్ స్వగ్రామం తమిళనాడులోని నామక్కల్ జిల్లా పరమత్తి దగ్గర్లో ఉన్న కోనూరు. వారి తల్లిదండ్రుల పేర్లు లోకనాథన్ (65), వరదమ్మాల్ (60). వీరికి ఇద్దరు కుమారులు. మురుగన్, రామస్వామి. మొదటి నుంచి కూడా ఈ తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూనే ఉన్నారు. అయినా కుమారులను బాగా చదివించారు.


కేంద్ర సహాయమంత్రిగా ఉన్న మురుగన్‌కు చిన్నతనం నుంచే విద్యాభ్యాసంపై చాలా శ్రద్ధ ఉండేది. చదువులో ముందుండేవారు. ఆ తర్వాత న్యాయవిద్యను అభ్యసించారు. ఎంఎల్, పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత బీజేపీ రాజకీయాల వైపు ఆకర్షితులై, పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన నిబద్ధత, పనితీరు, విద్యార్హతలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాని మోదీ... ఈయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మురుగన్ తల్లిదండ్రులను మీడియా సంప్రదించింది.. ‘‘కుమారుడు కేంద్రమంత్రి కదా.. ఇంకా కూలీపనులకు వెళ్తారా?’’ అని మీడియా అడగ్గా.... ‘‘మా కుమారుడు మమ్మల్ని పిలిచాడు. కానీ మా సొంత కష్టం మీదే మేం బతుకుతాం. కూలీ పనులకే వెళ్లాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. మాకెలాంటి ఇబ్బందీ లేదు’’ అని మురుగన్ తల్లిదండ్రులు ఆసక్తికరంగా పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-20T18:00:50+05:30 IST