వీఐపీ రోడ్డులో కూలుతున్న రిటైనింగ్‌ వాల్స్‌

ABN , First Publish Date - 2021-08-11T05:19:28+05:30 IST

ఎన్‌హెచ్‌-16 మీదగా గుంటూరు నగరంలోకి వచ్చే నాలుగు చక్రాల వాహనాల సౌకర్యార్థం చుట్టుగుంట నుంచి కేవీపీ కాలనీ మీదుగా విస్తరించిన వీఐపీ రోడ్డు శిథిలమౌతోంది.

వీఐపీ రోడ్డులో కూలుతున్న రిటైనింగ్‌ వాల్స్‌
చుట్టుగుంట నుంచి కేవీపీ కాలనీ మీదగా ఎన్‌హెచ్‌-16ని కలిపే వీఐపీ రోడ్డు దుస్థితి

గుంటూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఎన్‌హెచ్‌-16 మీదగా గుంటూరు నగరంలోకి వచ్చే నాలుగు చక్రాల వాహనాల సౌకర్యార్థం చుట్టుగుంట నుంచి కేవీపీ కాలనీ మీదుగా విస్తరించిన వీఐపీ రోడ్డు శిథిలమౌతోంది. పలుచోట్ల రిటైనింగ్‌ వాల్‌ కూలి డ్రైనేజీలో పడిపోయింది. దీంతో అక్కడ రోడ్డు డ్రైనేజీలోకి ఒరిగిపోతోంది. ఈ రోడ్డుని ప్రారంభించి పట్టుమని రెండేళ్లు అయినా పూర్తికాక ముందే ఈ పరిస్థితి తలెత్తడం రోడ్డు ఇంజనీరింగ్‌పై అనుమానాలు తలెత్తేలా చేస్తోంది. వీఐపీల కాన్వాయ్‌లు మిర్చియార్డు వై-జంక్షన్‌ వద్దకు వెళ్లి వెనక్కు రానవసరం లేకుండా ఈ రోడ్డుని నగరపాలకసంస్థ నిర్మించింది. చుట్టుగుంట నుంచి రోడ్డుని విస్తరించి నాలుగు వరసలుగా సెంట్రల్‌ మీడియన్‌తో అభివృద్ధి చేశారు. ఉప్పువాగు వద్ద వంతెన నిర్మించకుండా అలానే వదిలేశారు. రిటైనింగ్‌ వాల్‌ నాణ్యత లేకుండా నిర్మించడం వలన భారీ వాహనాలు రోడ్డు పక్కన పార్కింగ్‌ చేయగానే అది ఒరిగిపోతోంది. అయినప్పటికీ కాంట్రాక్టర్‌ చేత మరమ్మతులు చేయించడంలో నగరపాలకసంస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, కమిషనర్‌ చల్లా అనురాధ ఈ రోడ్డులో పర్యటించి శిథిలమైన రెయిలింగ్‌, అసంపూర్తిగా వదిలేసిన ఉప్పువాగు వంతెన విస్తరణ తదితర పనులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2021-08-11T05:19:28+05:30 IST