కుడుపూడి చిట్టబ్బాయి ఇకలేరు

ABN , First Publish Date - 2021-04-30T05:18:10+05:30 IST

అమలాపురం మాజీ శాసనసభ్యుడు..

కుడుపూడి చిట్టబ్బాయి ఇకలేరు

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి


అమలాపురం(ఆంధ్రజ్యోతి): అమలాపురం మాజీ శాసనసభ్యుడు, రాష్ట్ర శెట్టిబలిజ నేత, వైసీపీ నాయకుడు కుడుపూడి చిట్టబ్బాయి(73) గురువారం మృతిచెందారు. ఆయన గత కొన్ని రోజుల నుంచి కరోనా సంబంధిత వ్యాధులతో బాధపడుతూ కాకినాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అనేక పదవులు నిర్వహించిన ఆయన 2004లో అమలాపురం శాసనసభ సభ్యునిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఐదేళ్ల పాటు నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశారు. తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరిన చిట్టబ్బాయి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ ఎన్నికల సమయంలో ఆ పార్టీ తరపున ప్రచారం చేసి అభ్యర్థుల విజయానికి దోహదపడుతున్నారు. కోన సీమలో సామాజిక వర్గాల మధ్య కుల ఘర్షణలు ఉత్పన్నమయ్యే సమయంలో అన్నివర్గాల ప్రజలను శాంతింపజేస్తూ వారి మధ్య సయోధ్యకు కృషి చేసేవారు. ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆయన నిత్యం ప్రజలతో మమేకమ య్యేవారు. చిట్టబ్బాయి అన్నివర్గాల ప్రజ ల్లోను మంచి ఆదరణ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు.  


సీఎం జగన్‌తో సహా పలువురి సంతాపం..

చిట్టబ్బాయి మరణవార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్బాంతికి గురయ్యారు. ఫోన్‌లో చిట్టబ్బాయి కుమారులతో మాట్లాడి సంతాపం తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, ఎంపీలు చింతా అనూరాధ, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో సహా అనేక మంది నాయకులు కాకినాడలోని చిట్టబ్బాయి భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అదే విధంగా మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు చిల్లా జగదీశ్వరి, అయితాబత్తుల ఆనందరావు, మానేపల్లి అయ్యాజీవేమా, పరమట వీరరాఘవులు, గిడుగు రుద్రరాజు, మెట్ల రమణబాబు, కుడుపూడి సూర్యనారాయణ తదితరులు చిట్టబ్బాయి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి కోనసీమకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని ఈ సందర్భంగా కొనియాడారు.


నేడు అమలాపురంలో అంత్యక్రియలు..

రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ఆదేశాలతో అమలాపురం బైపాస్‌ రోడ్డులోని మున్సిపాలిటీకి సంబంధించి పద్దె నిమిది సెంట్ల స్థలాన్ని చిట్టబ్బాయి  స్మారక చిహ్నం కోసం మున్సిపాలిటీ సిద్ధం చేస్తోంది. శుక్రవారం ఉదయం కాకినాడ నుంచి చిట్ట బ్బాయి భౌతికకాయాన్ని అమలాపురంలోని స్వగృహానికి  తీసుకురానున్నారు. అక్కడి నుంచి అంతిమయాత్ర నిర్వహించేందుకు వైసీపీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. చిట్టబ్బాయి అంత్యక్రియల ఏర్పాటుపై మంత్రి విశ్వరూప్‌ సూర్యనగర్‌లోని చిట్టబ్బాయి స్వగృహం వద్ద వైసీపీ నాయకులైన చెల్లుబోయిన శ్రీను, మట్టపర్తి నాగేంద్ర, సంసాని నాని, దొమ్మేటి రాము, గొవ్వాల రాజేష్‌తో సంప్రదింపులు జరిపి ఏర్పాట్లు చేస్తున్నారు. కుమార్తె కొచ్చిన్‌ నుంచి రావాల్సి ఉంది. జడ్పీటీసీ మాజీ సభ్యుడు కుడుపూడి బాబు, పొగాకు శ్రీను తదితరులు సంతాపం తెలిపారు.

Updated Date - 2021-04-30T05:18:10+05:30 IST