డబ్బులు లేకున్నా.. సిటీ బస్సులు ఎక్కొచ్చు! అదెలాగో తెలుసుకోండి!

ABN , First Publish Date - 2020-02-20T10:30:52+05:30 IST

జేబులో డబ్బులు లేకున్నా ఇకపై సిటీ బస్సులు ఎక్కొచ్చు! మీవద్ద చలో కార్డు మీ దగ్గర ఉంటే చాలు! అవును ఇదో రకం మనీ వ్యాలెట్‌ కార్డు! సిటీ బస్సు కండక్టర్ల వద్ద ఈ కార్డును నేటినుంచి ప్రయాణికులు ఉచితంగా పొందవచ్చు.

డబ్బులు లేకున్నా.. సిటీ బస్సులు ఎక్కొచ్చు! అదెలాగో తెలుసుకోండి!

‘చలో’ ఆర్టీసీ!

నగదు లేకున్నా సిటీ బస్సుల్లో ప్రయాణం

పైలట్‌ ప్రాజెక్టుగా కృష్ణా రీజియన్‌లో ‘చలో’ కార్డు

విజయవాడ సిటీ బస్సుల్లో నేటి నుంచి అమలు

స్వైపింగ్‌కు వీలుగా.. కండక్టర్ల టిమ్స్‌ అప్‌గ్రేడ్‌

రూ.100 రీచార్జితో ఉచితంగా చలో కార్డులు


విజయవాడ(ఆంధ్రజ్యోతి): జేబులో డబ్బులు లేకున్నా ఇకపై సిటీ బస్సులు ఎక్కొచ్చు! మీవద్ద చలో కార్డు మీ దగ్గర ఉంటే చాలు! అవును ఇదో రకం మనీ వ్యాలెట్‌ కార్డు! సిటీ బస్సు కండక్టర్ల వద్ద ఈ కార్డును నేటినుంచి ప్రయాణికులు ఉచితంగా పొందవచ్చు. ఆయనకే నచ్చినంత నగదు ఇచ్చి వెంటనే రీచార్జి చేసుకుంటే చాలు! దీంతో ఈ చలో కార్డు ద్వారా కండక్టర్‌కు డబ్బులు చెల్లించకుండానే కార్డు చూపి ప్రయాణం చేయవచ్చు. కండక్టర్‌ తన టిమ్‌ మిషన్‌లో ఈ కార్డును స్వైపింగ్‌ చేయటం ద్వారా మీ వ్యాలెట్‌లో ఉన్న మొత్తం నుంచి ఆటోమేటిక్‌గా చార్జీ కట్‌ అవుతుంది. చిల్లర సమస్య కూడా ఉండదు. ప్రయాణికుడు తన ఏటీఎం కార్డుల వ్యాలెట్‌లో ఇక మీదట చలో కార్డును కూడా పెట్టుకోవచ్చు. 


ప్రయోగాత్మకంగా..

సాంకేతిక బాటలో విప్లవాత్మక అడుగులు వేస్తున్న రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) ఏ ప్రయోగం చేసినా ముందుగా కృష్ణాజిల్లాలోనే చేపడుతుంది. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధానాన్ని అమలు చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా నగదు రహిత చెల్లింపులకు సంబంధించి స్మార్ట్‌ చలో కార్డుల విధానాన్ని కృష్ణాజిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా.. ప్రధానంగా విజయవాడ నగర పరిధిలోని గన్నవరం, ఉయ్యూరు, గవర్నర్‌ పేట-1, గవర్నర్‌ పేట-2, విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం బస్‌ డిపోల పరిధి బస్సుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇందుకోసం చలో సంస్థతో ఆర్టీసీ ఎంవోయూ చేసుకుంది. ఈ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా విజయవాడలో నగదు రహిత చెల్లింపులను ప్రారంభించారు.


ఇందుకు వీలుగా నగర పరిధిలోని ఆరు బస్‌ డిపోల కండక్టర్లకు గతంలోని పాత టిమ్‌ల స్థానంలో స్మార్ట్‌ టిమ్‌లను అందించారు. ఇవి స్మార్ట్‌కార్డ్‌లను రీడ్‌ చేస్తాయి. ఈ స్మార్ట్‌ టిమ్స్‌ బస్‌పాస్‌ల బార్‌కోడ్‌ను క్యూఆర్‌ కోడ్‌ను రీడ్‌ చేస్తాయి. నకిలీ పాసులను గుర్తిస్తాయి. చలో కార్డును స్వైపింగ్‌ చేయటానికి వీలుగా ఉంటాయి. కార్డును టిమ్‌కు టచ్‌ చేసినా ఆటోమేటిక్‌గా కనెక్ట్‌ అవటం ఈ టిమ్స్‌ ప్రత్యేకత! చలో కార్డులు కండక్టర్‌ దగ్గర ఉంటాయి. మొదటి మూడు నెలలు ఈ కార్డులను ఉచితంగా ఇస్తారు. కండక్టర్‌ వద్ద, బస్‌పాస్‌ కౌంటర్ల దగ్గర ఈ కార్డులు ఉంటాయి. ఈ కార్డులకు నగదు రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. కండక్టర్‌కు డబ్బులు ఇస్తే ఆయన రీ చార్జి చేసి ఇస్తాడు. అన్ని రీ చిర్జిలపై 5 శాతం ప్రారంభోత్సవ బోనస్‌ కూడా లభిస్తుంది. చిల్లర సమస్య కూడా ఉండదు.


చలో యాప్‌ ఆవిష్కరణ

చలో ట్రావెల్‌ కార్డుతో పాటు నేటి నుంచి చలో యాప్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవటం ద్వారా సేవలను పొందవచ్చు. ఆర్టీసీ బస్సుల సమాచారాన్ని లైవ్‌ ట్రాక్‌ చేయవచ్చు. చౌక ప్రయాణంతో కూడిన ట్రిప్‌కు ప్లాన్‌ చేసుకోవటానికి ట్రిప్‌ ప్లానర్‌ అనే ఆప్షన్‌ ఉంది. ఈ యాప్‌ ద్వారా మొబైల్‌ టికెట్‌ కూడా కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌ కోసం చూడకుండా.. మీ మొబైల్‌లో ఎప్పుడైనా, ఎక్కడైనా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. విజయవాడ నగరంలో రూ. 85లకే ఒక రోజంతా సిటీ బస్సుల్లో ప్రయాణించేందుకు బస్‌పాస్‌లను కూడా ఈ యాప్‌ ద్వారా తీసుకోవచ్చు.


Updated Date - 2020-02-20T10:30:52+05:30 IST