శ్రీకృష్ణ జన్మభూమి వివాదం ఎప్పుడో ముగిసింది: ఒవైసీ

ABN , First Publish Date - 2020-09-27T22:41:16+05:30 IST

కృష్ణ జన్మభూమి స్థలం మొత్తాన్ని క్లెయిమ్ చేస్తూ మధుర సివిల్ కోర్టులో విష్ణు జైన్ అనే అడ్వకేట్ వేషిన..

శ్రీకృష్ణ జన్మభూమి వివాదం ఎప్పుడో ముగిసింది: ఒవైసీ

న్యూఢిల్లీ: కృష్ణ జన్మభూమి స్థలం మొత్తాన్ని క్లెయిమ్ చేస్తూ మధుర సివిల్ కోర్టులో విష్ణు జైన్ అనే అడ్వకేట్ వేషిన దావాపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్‌కు, షాహి ఈద్గా ట్రస్టుకు మధ్య నడిచిన ఈ వివాదం 1968లోనే ముగిసిందని, ప్రస్తుతం దానిని పునఃసమీక్షించాల్సిన పని లేదని అన్నారు.


ప్రార్థనా స్థలాల మార్పిడిని 1991-ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టం నిరోధిస్తుందని, చట్టం అమలు బాధ్యలను హోం మంత్రిత్వ శాఖకు అప్పగించడం జరిగిందని ఒవైసీ ఓ ట్వీట్‌లో తెలిపారు. ఆ అంశంపై కోర్టులో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని ఒవైసీ ప్రశ్నించారు.


కాగా, కృష్ణ జన్మభూమిలోని మొత్తం 13.37 ఎకరాల భూమి హిందువులు, కృష్ణ భక్తులకు పవిత్రమైందని, దాన్ని తిరిగి అప్పగించాలని విష్ణు జైన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 1968లో కుదిరిన రాజీ ఫార్ములాకు కట్టుబడాల్సిన అవసరం లేదన్నారు. షాహి ఈద్గా మసీదును తొలగించాలని అందులో పేర్కొన్నారు. మసీద్ ఈద్గా ట్రస్టు నిర్వహణా కమిటీ ఆధ్వర్యంలోని ప్రస్తుత కట్టడం కృష్ణ జన్మభూమిపై కట్టారని, మధురలోని కృష్ణ ఆలయాన్ని ఔరంగజేబు కూల్చివేసి అక్కడ షాహి ఈద్గా మసీదు నిర్మించాడని విష్ణు జైన్ పేర్కొన్నారు.


1658 నుంచి 1707 ఏడీ‌ వరకూ  ఔరంగజేబు పాలించిన విషయం, శ్రీకృష్ణుడి జన్మస్థలమైన కాత్ర కేశవ్ దేవ్ సహా హిందూ ఆరాధానా స్థలాలు, ఆలయాలను కూల్చివేయాలని ఆయన ఆదేశాలివ్వడం చరిత్ర చెబుతున్న వాస్తవమని ఆయన అన్నారు.  ఔరంగజేబు సైన్యం కేశవ్ దేవ్ ఆలయాన్ని పాక్షికంగా కూల్చేసి బలవంతంగా అక్కడ ఈద్గా మసీదు నిర్మించిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2020-09-27T22:41:16+05:30 IST