పల్లెల్లోనూ క్రికెట్‌ బెట్టింగ్‌!

ABN , First Publish Date - 2022-04-14T03:52:09+05:30 IST

నాడు ఎక్కడో మెట్రో పాలిటిన్‌ సిటీల్లో ఉన్న క్రికెట్‌ బెట్టింగ్‌ సంస్కృతి నేడు గ్రామీణ ప్రాంతాల్లోని పల్లెలకు సైతం పాకింది. సులువుగా డబ్బులొస్తాయని దురాశతో యువత ఎక్కువగా ఈ బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు.

పల్లెల్లోనూ క్రికెట్‌ బెట్టింగ్‌!
ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ లోగో

వ్యసనపరులుగా మారుతున్న యువత

సీతారామపురం, ఏప్రిల్‌ 13 : నాడు ఎక్కడో మెట్రో పాలిటిన్‌ సిటీల్లో ఉన్న క్రికెట్‌ బెట్టింగ్‌ సంస్కృతి నేడు గ్రామీణ ప్రాంతాల్లోని పల్లెలకు సైతం పాకింది. సులువుగా డబ్బులొస్తాయని దురాశతో యువత ఎక్కువగా ఈ బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు. ఐపీఎల్‌ క్రికెట్‌ వేసవి సరదా అయితే కొంత మందికి బెట్టింగ్‌ వ్యసనంగా మారింది. ఈజీ మనీ కోసం వెంపర్లాడే యువతే లక్ష్యంగా అన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. ఏ క్షణంలో పందెం వేయాలన్నా ఆ సమయంలో పందేలకు సిద్ధంగా ఉండే యాప్‌లతో యువత బెట్టింగ్‌ వలలో చిక్కుకుపోతున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల హోరు. సాయంత్రం అయిందంటే స్మార్ట్‌ఫోన్లలో మ్యాచ్‌ను యువత ఎక్కువగా చూస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఆటకోసం చూడకుండా తాము పందెం కాసిన జట్టు గెలుస్తుందో, లేదోనని చూస్తూ క్రికెట్‌ బెట్టింగ్‌లో దర్జాగా పాలుపంచుకుంటున్నారు. ఎవరి స్థాయికి తగినట్టు వారు కాస్తోకూస్తో బెట్టింగ్‌ కాస్తున్నారు.

అంతా స్మార్ట్‌ఫోన్లలోనే... 

గతంలో బెట్టింగ్‌లు వేయాలంటే బుకీలంతా ఒక కేంద్రంగా స్థావరం ఎంచుకుని గుట్టుగా నిర్వహించేవారు. ఆ స్థావర సమాచారం పోలీసులకు అందితే వారిని సులభంగా పట్టుకునేవారు. ప్రస్తుతం బెట్టింగ్‌ దందా మొత్తం స్మార్ట్‌ఫోన్‌ ఆధారంగా సాగుతోంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ ప్రారంభంలో బుకీల ఫోన్లు ఆన్‌ అవుతాయి. ముందుగా వారు సూచించిన అకౌంట్లలో డబ్బులు జమ చేయాలి. తర్వాత పోటీ పడుతున్న రెండు జట్లు బలాబలాల ప్రకారం బెట్టింగ్‌ ఉంటుంది. బలమైన జట్టుతో, బలహీనమైన జట్టు పోటీలో ఉంటే బలహీనమైన జట్టుపై గెలుస్తున్నారని బెట్టింగ్‌ కాస్తే ఒకటికి రెండు, మూడు రెట్లు కూడా డబ్బులు చెల్లిస్తారు. మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు బెట్టింగ్‌ను జట్లలో ఏ వైపుకైనా మార్చుకునే అవకాశం ఉంటుంది. బంతి బంతికి బెట్టింగ్‌తోపాటు, సిక్స్‌ కొడతాడా? ఫోర్‌ కొడతాడా? వికెట్‌ పడుతుందా? తదితర వాటిపై బెట్టింగ్‌ ఉంటుంది. ఈ తతంగమంతా స్మార్ట్‌ఫోన్లలోనే జరుగుతుండగా యాప్‌ల ద్వారా డబ్బులు చెల్లింపులు జరుగుతాయి. గెలిచిన వారికి మాత్రం డబ్బులు సీక్రెట్‌గా ఇస్తుంటారు. ఈ బెట్టింగ్‌ల్లో డబ్బుల కోసం, జల్సాల కోసం పలువురు విద్యార్థి దశలోనే పక్కదారి పడుతూ, తల్లిదండ్రులకు కన్నీటిని మిగిలిస్తున్నారు. చిన్న పిల్లలు సైతం ఈ బెట్టింగ్‌కు బానిసలు అవుతండటంతో ఈ విష సంస్కృతిపై పోలీసులు దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి.

Updated Date - 2022-04-14T03:52:09+05:30 IST