‘కోయ స్వర’ రామచంద్రుడికి పద్మశ్రీ

ABN , First Publish Date - 2022-01-26T06:33:49+05:30 IST

‘కోయ స్వర’ రామచంద్రుడికి పద్మశ్రీ

‘కోయ స్వర’ రామచంద్రుడికి పద్మశ్రీ
పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య

అత్యున్నత పురస్కారానికి ఎంపికైన ఆదివాసీ కళాకారుడు

మణుగూరు మండలం కూనవరం బిడ్డ  సకిని రామచంద్రయ్యకు దక్కిన గౌరవం

సమ్మక్కసారక్క జాతరలో ఈయన గాత్రం వినపడాల్సిందే

ఆదివాసీ యోధుల చరిత్రలను ఆసువుగా వినిపించడంలో దిట్ట

కొత్తగూడెం/మణుగూరు, జనవరి 25 : మారుమూల అటవీ ప్రాంతంలో పుట్టిన ఆ ఆదివాసీ బిడ్డ ఇప్పుడు దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. నిన్నమొన్నటి వరకు తాతముత్తాతల నుంచి వచ్చిన ఓ డోలు వాయిద్య కళతో దైవకార్యాలు, జాతరలు, ఆదివాసీ పండుగలు, వివాహాదిశుభకార్యాల వద్ద తన స్వర ఝరిని వినిపించిన ఆయన పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. నిరక్షరాస్యుడైన ఆయనకు తెలుగు, కోయభాషల్లో అసువుగా కథలు చెప్పడంలో నేర్పరిగా పేరుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన 65ఏళ్ల సకిని రామచంద్రయ్య కోయ తెగలోని డోలి ఉపకులానికి చెందినవారు. ఆయన తన మాతృభాషలో కులాచారపు గీతాలు పాడుతూ తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్త్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో కోయ తెగల వంశ చరిత్రలను పారాయణం చేసే వారిలో బహుషా రామచంద్రయ్యే చివరి వ్యక్తి కావొచ్చు. కొన్నిసార్లు ఆయన ప్రదర్శన ఇవ్వడా నికి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర సరిహద్దును దాటేవారంటే కోయభాషలో ఆయన పాటలు వినేందుకు ఆదివాసులు ఎంతగా ఎదురుచూసేవారో అర్థమవుతోంది. ఒక్క సమక్క సారలమ్మల చరిత్రే కాదు.. గరికామారాజు, పగిడిద్దరాజు, ఈరామరాజు, గాడిరాజు, బాపనమ్మ, ముసలమ్మ, నాగులమ్మ, సదలమ్మ తదితర ఆదివాసీ యోధుల కథలను ఆసువుగా గానం చేయడంలో దిట్టగా రామచంద్రయ్య కు పేరుంది. ఎండోగామస్‌ గిరిజన ఉప విభాగాలు, వారి ఇంటి పేర్ల వెనుక ఉన్న కథలన్నీ ఆయనకు కంఠస్థమే. 

మేడారంలో ఆయన ప్రత్యేకతే వేరు..

ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారక్క జాతరలో రామచంద్రయ్యకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జాతర జరిగే ప్రతీసారి ఆయనకు ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది. ఆ వనదేవతలకు ఆయన డోలు వాయిద్యం మధ్య పూజలు నిర్వహించడం విశేషం. ఈ ఏడాది జనవరి 31నుంచి ఫిబ్రవరి 3వరకు జరిగే జాతరకు కూడా ఆయన తరలివెళ్లి డోలు వాయించేందుకు సిద్ధంగా ఉన్నారు. 

రామచంద్రయ్య కుటుంబ నేపథ్యం.. 

మణుగూరు మండలంలోని కూనవరం గ్రామానికి చెందిన సకిని ముసలయ్య- గంగమ్మ దంపతుల కుమారుడైన రామచంద్రయ్య.. కూనవరంలో జన్మించారు. రామచంద్రయ్య తన ముత్తాత, తాత, తండ్రుల నుంచి సంక్రమించిన గిరిజన సంప్రదాయ కళను నేర్చుకుని దానినే జీవనాధారంగా మలుచుకున్నారు. బసవమ్మను వివాహామాడగా.. వారికి ముగ్గురు కుమార్తెలు వాణి, వసంత, సుమలతతో పాటు ఓ కుమారుడు బాబురావు ఉన్నారు. ప్రస్తుతం బాబురావు బూర్గంపహాడ్‌ మార్కెట్‌ కమిటీ డైరక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కుమార్తెలకు వివాహమైంది. 

ఆదివాసీ కళకు అవార్డు దక్కింది..

పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య

అంతరించిపోతున్న ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయ కళకు ఈ అవార్డు దక్కింది. ఈ కళను గుర్తించి అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉంది. నా ముత్తాత నుంచి మా తాతకు.. మా తాత నుంచి నా తండ్రి.. ఆయన నుంచి నాకు ఈ కళ వారసత్వంగా వచ్చింది. పినపాక నియోజకవర్గంలో మా ఆదివాసీ గిరిజన కుటుంబాల్లో జరిగే ఏ కార్యక్రమమైనా డోలు వాయించేందుకు నన్ను ఆహ్వానిస్తారు. గిరిజన కళలు సంప్రదాయాలు అంతరించి పోతున్న ఈ రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డోలు వాయిద్యాన్ని కళగా గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ఇవ్వడం ఆనందంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు.

గిరిజన జాతికి రామచంద్రయ్య గర్వకారణం

పువ్వాడ అజయ్‌, రవాణాశాఖ మంత్రి 

తన డోలు కళ ద్వారా దేశంలోనే తెలంగాణ, ఆదివాసీ జాతి కీర్తిని రామచంద్రయ్య ఇనుమడింపజేశారు. గిరిజనుల్లో గతేడాది గుస్సాడి కనకరాజు పద్మశ్రీ పొందితే ఈఏడాది రామచంద్రయ్య ఆ పురస్కారానికి ఎంపికవడం ఆనందంగా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వనజీవి రామయ్యతర్వాత పద్మశ్రీ అందుకోబోతున్న రెండో వ్యక్తిగా రామచంద్రయ్య చరిత్రలో నిలిచిపోతారు. ఆయనకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో అంతరించిపోతున్న ఆదివాసీ కోయ కళలు, వృత్తులకు జీవం పోసేందుకు కృషి చేస్తాం. 

ఎంతో సంతోషంగా ఉంది 

రేగా కాంతారావు, ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే

ఆదివాసీ బిడ్డ అయిన సకిని రామచంద్రయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. భారత దేశం ఎంతో గౌరవప్రదంగా భావించే అత్యు న్నత పురస్కారం.. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కళాకారుడికి రావడం ఎంతో అనందంగా ఉంది. నేను అందుబాటులో లేకపోయినా.. నా సహచరులను పంపి రామచంద్రయ్యకు అభినందనలు తెలిపారు. 

ఆనందంగా ఉంది 

ఏనిక ప్రసాద్‌ , కూనవరం సర్పంచ్‌ 

మారుమూల అటవీ గ్రామమైన మా కూనవరానికి చెందిన రామచంద్రయ్యకు పద్మశ్రీ అవార్డు రావడంతో పట్టలేని అనందంలో ఉన్నాం. చిన్నతనం నుంచి రామచంద్రయ్య డోలు వాయిద్యం, ఆదివాసీ వీరుల కథలు, సమ్మక్క సారక్క చరిత్ర లాంటివి వింటూ పెరిగాం. ఈ కళ ద్వారా ఉన్నతమైన అవార్డు వస్తుందని ఊహించలేదు. ఈ అవార్డు ద్వారా మరుగున పడుతున్న గిరిజన కళకు వెలుగు తేవడం, అదీ మా గ్రామానికి చెందిన వ్యక్తి కావడం ఎంతో సంతోషంగా ఉంది.

రామచంద్రయ్యకు ప్రత్యేక అభినందనలు 

డి.అనుదీప్‌, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్‌ 

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కొత్తగూడెం భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన సకిని రామచంద్రయ్యకు ప్రత్యేక అభినందనలు. గిరిజన కోయ జాతి అణిముత్యమైన ఆయన తన వంశా చారంగా వస్తున్న డోలు వాయిద్యంతో గిరిజన చరిత్రను తెలుపుతూ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ వస్తున్నారు. అలాంటి గిరిపుత్రుడికి మహో న్నత పురస్కారం దక్కడం ఆనందంగా ఉంది. 

నాడు రామయ్య.. నేడు రామచంద్రయ్య

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మరో గౌరవం 

ఆదివాసీ బిడ్డకు దక్కిన పద్మశ్రీ పురస్కారం

ఖమ్మం, జనవరి 25 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మరో అరుదైన గౌరవం దక్కింది. కోటి మెక్కలు నాటిన.. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం రెడ్డిపల్లెకు చెందిన ువనజీవి్‌ దరిపల్లి రామయ్యకు 2017 జనవరి 25న కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఆ తర్వాత మరో ఐదేళ్లకు మారుమూల ఆదివాసీ పల్లెకు చెందిన కోయ తెగలోని డోలి ఉపకులానికి చెందిన సకిని రామచంద్రయ్యకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. కేంద్రప్రభుత్వం మంగళవారం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాల జాబితాలో ఆయన పేరు ఉండటంతో ఉమ్మడి జిల్లా వాసులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఒక మారుమూల అటవీ గ్రామంలోని కోయ తెగకు చెందిన రామచంద్రయ్యకు పద్మశ్రీ రావడంతో.. ఐదేళ్ల క్రితం ఒక సామాన్యుడిగా ఉన్న వనజీవి రామయ్యకు, ప్రస్తుతం రామచంద్రయ్యకు పద్మశ్రీ దక్కడం గురించి చర్చించుకుటుఉన్నారు. తెలుగురాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌ గ్రామాల్లోని గిరిజనుల పండుగలు, జాతరలు, వివాహాదికార్యక్రమాల వద్ద పాడడంతో పాటు గిరిజనుల సాంస్కృతిక చరిత్రను వారి కుల దేవతల చరిత్రలు మేడారం జాతర, సమ్మక్క సారక్క ప్రాశస్త్యం గురించి ఆయన తన కళ ప్రచారం చేస్తున్నారు. రామచంద్రయ్యకు పద్మశ్రీ అవార్డు దక్కడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాసంఘాలు హర్షం ప్రకటించాయి. రామచంద్రయ్యకు పద్మశ్రీ పురస్కారం రావడం పట్ల టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత,  

ఖమ్మం ఎంపీ నామానాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. నిజమైన ఆదివాసీకి పురస్కారం దక్కడం అభినందనీయమన్నారు. 

భద్రాద్రి తొలినాదస్వర విద్వాంసుడికీ పురస్కారం

మరణాంతరం పద్మశ్రీకి ఎంపికైన షేక్‌ హసన్‌ సాహెబ్‌  

భద్రాచలం, జనవరి 25: ‘కౌసల్య సుప్రజరామా’ అంటూ నిత్యం భద్రాద్రి రామయ్య సన్నిధిలో తన నాదస్వర సుప్రభాత వాద్యంతో సేవలందించిన దేవస్థాన తొలి నాదస్వర ఆస్థాన విద్వాంసుడు షేక్‌ హసన్‌ సాహెబ్‌కు మరణాంతరం కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరు మండలం గోసవీడుకు చెందిన హసన్‌సాహెబ్‌ 1950లో దేవస్థానం తొలి నాదస్వర విద్వాంసులుగా బాధ్యతలు చేపట్టి 1996వరకు పని చేశారు. 93ఏళ్ల వయసులో గతేడాది జూన్‌ 23న ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కళారంగానికి చేసిన సేవలను గుర్తిస్తూ మరణాంతరం పద్మశ్రీకి ఎంపిక చేస్తూ మంగళవారం వెల్లడించిన జాబితాలో పేరు రావడంతో దేవస్థానం అధికారులు, సిబ్బంది, స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హసన్‌సాహెబ్‌ ఉద్యోగ విరమణ అనంతరం ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరు మండలం గోసవీడులో నివాసముంటూ 2021జూన్‌ 23న తుదిశ్వాస విడిచారు. అయితే భద్రాద్రి దేవస్థానం తొలి నాదస్వర విధ్వాంసుడిగా బాధ్యతలు నిర్వహించిన షేక్‌ హసన్‌సాహెబ్‌కు పద్మశ్రీ వచ్చిన సందర్భంగా దేవస్థానం ఈవో బి.శివాజీ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి రామక్షేత్రంలో నాదస్వర విధ్వాంసులుగా బాధ్యతలు నిర్వహించిన హసన్‌సాహెబ్‌కు పద్మశ్రీ అవార్డు రావడంతో జాతీయస్థాయిలో భద్రాద్రి ఖ్యాతి నిలిచిందన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సైతం హసన్‌సాహెబ్‌కు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భద్రాద్రి దేవస్థానానికి దక్కిన అరుదైన గౌరవమని పేర్కొన్నారు. అయితే ఈ అవార్డును అందుకునేందుకు హసన్‌సాహెబ్‌ మనవడైన హీలంషావుద్దీన్‌ తన తండ్రి షేక్‌మీరాబాబుతో కలిసి వెళ్లనున్నట్లు కుటుంబసభ్యులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.  

నాన్న ఉన్నప్పుడు ఇచ్చిఉంటే ఇంకా బాగుండేది

షేక్‌ ఖాసీంబాబు, చిన్న కుమారుడు, భద్రాద్రి దేవస్థానం నాదస్వర బృంద సభ్యుడు 

నాన్నగారికి పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఆయన జీవించి ఉన్నప్పుడు ఈ అవార్డు ఇచ్చి ఉంటే మరింత బాగుండేది.





Updated Date - 2022-01-26T06:33:49+05:30 IST