Abn logo
May 17 2021 @ 00:26AM

కొవిడ్ సోకని పల్లెలు

- సెకండ్‌ వేవ్‌ ప్రారంభం కాగానే కట్టడి 

- నేదునూరు, యాస్వాడలో ఫలితమిచ్చిన ముందు జాగ్రత్త చర్యలు

కరీంనగర్‌, మే 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా విలయతాండవం చేస్తున్నా కరోనా జిల్లాలో రెండు గ్రామాలను వైరస్‌ తాకలేకపోయింది. జిల్లాలో 313 పంచాయతీలు ఉండగా తిమ్మాపూర్‌ మండలంలోని నేదునూరు, గన్నేరువరం మండలంలోని యాస్వాడలో ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. మొదటి వేవ్‌లో నేదునూరులో ఏడుగురు కరోనా బారినపడి కోలుకున్నారు. దీంతో ఆ గ్రామ పంచాయతీ పాలకవర్గం అప్రమత్తమై ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. తిమ్మాపూర్‌ మండలం నేదునూరులో 240 కుటుంబాలు ఉంటాయి. ఆ పంచాయతీ జనాభా 1,100. గత సంవత్సరం మార్చిలో తొలి విడత కరోనా వ్యాపించిన సందర్భంలో ఈ గ్రామంలో ఏడుగురు వ్యాధి బారినపడ్డారు. ఈ సంవత్సరం మళ్లీ మార్చిలోనే కరోనా రెండో విడత ప్రారంభమై గతం కంటే ఎక్కువ వేగంగా నెల రోజుల వ్యవధిలోనే పల్లెలకు కూడా పాకింది. వ్యాధి విస్తృతిని గమనించిన సర్పంచ్‌, సెక్రెటరీ, పాలకవర్గ సభ్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశావర్కర్లు, పారిశుధ్య సిబ్బంది కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. వైరస్‌ను నియంత్రించడంలో కలిసికట్టుగా పనిచేశారు. ప్రతిరోజూ ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ, జ్వరం, జలుబు ఉన్న వారిని గుర్తించి మందులు పంపిణీ చేస్తున్నారు.  గ్రామంలో అందరూ విధిగా మాస్కు ధరించేలా, కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతివారం హైపోక్లోరైడ్‌ ద్రావాణాన్ని పిచికారి చేయడంతోపాటు ఎవరింటికైనా బంధువులు వస్తే ఆ కుటుంబం వారిని ఐదురోజులపాటు బయట తిరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.  గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చేవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేలా పంచాయతీ పాలకవర్గం సూచనలు జారీ చేసింది. 

- అన్ని జాగ్రత్తలు  తీసుకున్నాం

-  వడ్లూరి శంకర్‌, సర్పంచ్‌, నేదునూరు

కరోనా మొదటి వేవ్‌లో గ్రామంలో ఏడుగురికి పాజిటివ్‌ రావడంతో వ్యాధి కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని వారినికోసారి గ్రామమంతా పిచికారి చేయడంతోపాటు మాస్కులు ధరించడం, సమూహంగా ఉండకుండా చర్యలు తీసుకున్నాం. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిపై దృష్టిసారించి వారిని ఐసోలేషన్‌లో ఉంచడం మంచి ఫలితాలనిచ్చింది. 

మహిళల అవగాహన వ్యాధిని నిరోధించింది...

- రాజేశ్వరి, ఆశా వర్కర్‌

గ్రామంలో పంచాయతీ పాలకవర్గం అందరిని సమన్వయపరిచి తీసుకుంటున్న చర్యలు కరోనా కట్టడికి తోడ్పడ్డాయి. మహిళా సంఘాల ద్వారా మహిళలకు కరోనా వ్యాధిపై కల్పించిన అవగాహన వ్యాధి కుటుంబంలోని వారికి సోకకుండా జాగ్రత్తలు తీసుకునేలా చేసింది. ప్రతిరోజూ ఇంటింటికి తిరిగి ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడం, అవసరమైన పరీక్షలు చేయిస్తూ అందరికి వ్యాధిపట్ల అవగాహన కల్పిస్తున్నాం. 

- ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం..

       - జక్కనపల్లి మధూకర్‌, సర్పంచ్‌, యాస్వాడ

 గ్రామంలో ఎప్పటికప్పుడు కరోనాను నియంత్రించేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. .మాస్కులు ధరించాలని, అనవసరంగా బయటకి రావద్దని, భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నాం. గ్రామంలో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని స్ర్పే చేస్తున్నాం. 

- అందరికీ ఆదర్శంగా యాస్వాడ

గన్నేరువరం: మండలంలోని 16 గ్రామాలకు గాను 15గ్రామాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తూ రోజురోజుకూ ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు కరోనా నియంత్రణ చర్యలు పటిష్టంగా చేపట్టినా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇందుకు భిన్నంగా మండలంలోని యాస్వాడ గ్రామంలో మాత్రం ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాలేదు.  రెండు దశల్లోనూ ఆ గ్రామస్థులు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా తమను  తాము రక్షించుకుంటున్నారు. యాస్వాడలో మొత్తం జనాభా 198. గ్రామంలో 60 ఇళ్లు ఉంటాయి. గ్రామంలో 45సంవత్సరాలు పైబడిన 30మంది ఇటీవల వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటింటికీ వెళ్ళి ప్రజలకు జ్వర పరీక్షలు నిర్వహించి కొద్దిపాటి లక్షణాలున్న వారికి మందులను పంపిణీ చేసినట్లు ఆశా వర్కర్‌ మంజుల, ఏఎన్‌ఎమ్‌ నీలిమ, సెక్రెటరి శ్రీనావాస్‌ తెలిపారు.

- అందరం జాగ్రత్తగా ఉంటున్నాం..

     - బూర నవీన్‌, గ్రామస్థుడు, యాస్వాడ

  మా గ్రామంలో అందరం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరోనా భయంతో త్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకి వెళుతున్నాం. గతంలో గ్రామస్థులు నిత్యావసర సరుకులకు మండల కేంద్రానికి వెళ్లి తెచ్చుకునేవారు. దీంతో గ్రామంలో కరోనా సోకుతుందనే ఆలోచనతో నేను గ్రామంలోనే కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాను. వేరే గ్రామానికి వెళ్లే పనిలేకుండా ఎవరికివారు స్వచ్ఛందంగా హోం క్వారంటైన్‌ పాటిస్తూ లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నాం. 

Advertisement