Abn logo
Apr 11 2021 @ 09:31AM

కరోనా బాధితులకు ప్రత్యేక చికిత్సా కేంద్రాలు

  - విక్టోరియా హాస్టల్‌లో 570 పడకలు

 - నగరవ్యాప్తంగా 18,852 బెడ్లు సిద్ధం

  - ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌


చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల కోసం ప్రత్యేక చికిత్సాకేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జె.రాధాకృష్ణన్‌ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ అధికమవుతుండటంతో పాక్షిక లాక్‌డౌన్‌ను అమలు చేశామని, ఈ నెలాఖరు వరకు ప్రజలంతా వైరస్‌ నిరోధక నిబంధనలు తప్పకుండా పాటిస్తే కరోనాను కట్టడి చేయగలమని, లేకుంటే గతేడాదిలా కఠిన నిబంధనలతో కర్ఫ్యూ విధించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం కరోనా బాధితుల కోసం పడకల సదుపాయంతో ప్రత్యేక వార్డులు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. శనివారం స్థానిక ట్రిప్లికేన్‌లోని విక్టోరియా కళాశాల హాస్టల్‌ను కరోనా ప్రత్యేక చికిత్స వార్డుగా మార్చే పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెన్నైలోని కరోనా బాధితులకు చికిత్సలందించటానికి విక్టోరియా హాస్టల్‌లో 570 పడకలతో ప్రత్యేక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, కరోనా బాధితుల కోసం నగరమంతటా 18,852 పడకలు సిద్ధం చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, నాగపట్టినం, తంజావూరు జిల్లాల్లోనే  కరోనా వైరస్‌ వ్యాప్తి అత్యధికంగా వుంటోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ కరోనా బాధితుల కోసం వంద నుండి రెండువందల పడకల సదుపాయంతో ప్రత్యేక చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయమని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు, జిల్లా వైద్యశాఖాధికారులకు ఉత్తర్వు జారీ చేసింది. శనివారం నుండి రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిందని, ఈ నెలాఖరు వరకూ ప్రజలంతా కరోనా నిరోధక నిబంధనలు పాటించి, వ్యాక్సిన్లు వేసుకుంటే వైరస్‌ను అదుపులోకి తీసుకురాగలమని రాధాకృష్ణన్‌ తెలిపారు. చెన్నైలో మాస్కులు ధరించకపోతే రూ.200ల జరిమానా విధించడం సమంజసమేనని, ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకూ ప్రజలు ముఖాలకు మాస్కులు ధరించాల్సిందేనని ఆయన చెప్పారు.


ఇంటింటా పరీక్షలు

చెన్నైలో ఇంటింటా కరోనా పరీక్షలు నిర్వహించడం వల్ల వైరస్‌ వ్యాప్తిని నిరోధించగలమని ఆయన చెప్పారు. కుటుంబంలో ఒకరికి కరోనా సోకితే ఆ కుటుంబంలోని సభ్యులందరికీ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని, కనుకనే అన్నింటికంటే ముందు ప్రతి ఇంటా పరిశీలనలు జరిపి, కరోనా పాజిటివ్‌ లక్షణాలు కలిగినవారిని వెనువెంటనే ఐసోలేషన్‌కు పంపుతున్నారని తెలిపారు. 


గిండీకి పోటెత్తుతున్న జనం

నగరవాసులు జలుబు, దగ్గు, జ్వరంతో అస్వస్థతకు గురైతే నేరుగా గిండీ కింగ్‌ ఇన్‌స్టిట్యూటట్‌ వద్ద ఏర్పాటైన ప్రత్యేక చికిత్సా కేంద్రానికి వెళుతున్నారని, అక్కడే తమకు చికిత్సలందిం చాలని, పడకలు కేటాయించాలని పట్టుబడుతున్నారని రాధాకృష్ణన్‌ తెలిపారు. నగరవాసులు కరోనా ముందస్తు పరీక్షలకు గిండీలోని ప్రత్యేక చికిత్సా కేంద్రానికి, ఓమండూరార్‌ ఎస్టేట్‌ ప్రాంతంలోని ప్రభుత్వ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి వెళుతున్నారే తప్ప సెంట్రల్‌ వద్దనున్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి, స్టాన్లీ వైద్యకళాశాల ఆస్పత్రికి, కీల్పాక్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి వెళ్లటం లేదని ఆయన చెప్పారు. ఇకపై నగరవాసులు తమకు పాజిటివ్‌ లక్షణాలు వస్తాయనే అనుమానం కలిగితే తమ ప్రాంతానికి ఏ ఆస్పత్రి దగ్గరగా ఉందో ఆ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు, చికిత్సలు చేసుకోవాలని, వ్యాకిన్లు వేసుకోవడానికి కూడా సమీప ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళితే మంచిదని ఆయన వివరించారు.

 

పెరుగుతున్న కంటైన్మెంట్‌ జోన్లు 

రాష్ట్రంలో కరోనా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదువుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా, శనివారం నుంచి అనేక నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అదేసమయంలో రాష్ట్రంలో కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వీటిలో ఒక్క చెన్నైలోనే 600కు పైగా కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. గత నెల 24వ తేదీ వరకు రాష్ట్రంలో మొత్తం 620 కంటైన్మెంట్‌ జోన్లు వుండగా, ఇపుడు వీటి సంఖ్య చెన్నైతో కలుపుకుని 1500కు చేరుకుంది. చెన్నైతో పాటు మదురై, కోయంబత్తూరు, సేలం, చెంగల్పట్టు, తిరువళ్ళూరు జిల్లాల్లో ఈ కంటైన్మెంట్‌ జోన్లు అధికంగా ఉన్నాయి. 

Advertisement
Advertisement
Advertisement