‘కరోనా విషయంలో రాజకీయాలు వద్దు’

ABN , First Publish Date - 2021-04-21T16:48:28+05:30 IST

కరోనా మహమ్మారిని అందరూ కలసికట్టుగా తరిమికొడదామని ఈ విషయంలో రాజకీయాలు తగవని హోంశాఖ మంత్రి బసవరాజ్‌బొమ్మై

‘కరోనా విషయంలో రాజకీయాలు వద్దు’

    - ప్రతిపక్షాలకు హోంశాఖ మంత్రి సూచన 


బెంగళూరు: కరోనా మహమ్మారిని అందరూ కలసికట్టుగా తరిమికొడదామని ఈ విషయంలో రాజకీయాలు తగవని హోంశాఖ మంత్రి బసవరాజ్‌బొమ్మై ప్రతిపక్షాలకు సూచించారు. మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ వాజుభాయ్‌వాలాను మంత్రి అశోక్‌తో కలసి భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ చేస్తున్న విమర్శలు ప్రస్తుత తరుణంలో మంచివి కావన్నారు. కేంద్రప్రభుత్వ సూచన మేరకే గవర్నర్‌ వాజుభాయ్‌వాలా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. అంతమాత్రాన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నట్టే కనిపిస్తోందంటూ డీకే శివకుమార్‌ విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరమే గవర్నర్‌ ఈ సమావేశాన్ని నిర్ణయించారన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌ గవర్నర్లు కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహించారన్నారు. మహారాష్ట్రలో శివసేన - కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. అక్కడలేని అభ్యంతరం ఇక్కడ ఎందుకని ప్రశ్నించారు. మీడియాలో వెలువడుతున్న మాదిరిగా రాష్ట్రంలో కరోనా భయానక పరిస్థితి ఏదీ లేదన్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందన్నారు. రాజకీయలబ్ధి కోసమే కాంగ్రెస్‌ ఇలాంటి విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.

Updated Date - 2021-04-21T16:48:28+05:30 IST