ప్రైవేట్‌ చేతుల్లోకి కింగ్‌కోఠి ప్యాలెస్‌

ABN , First Publish Date - 2022-04-13T18:05:51+05:30 IST

నిజాం రాజుల రాజప్రాసాదం కింగ్‌కోఠి నజ్రీబాగ్‌ ప్యాలెస్‌ నేడు పూర్తిగా వివాదాల్లో కూరుకుపోయింది. ఒకటి తర్వాత ఒకటిగా వెలుగులోకి వస్తున్న విషయాలు అటు

ప్రైవేట్‌ చేతుల్లోకి కింగ్‌కోఠి ప్యాలెస్‌

హస్తగతం చేసుకున్న మహారాష్ట్ర నిర్మాణ సంస్థ

ఉద్యోగులు అక్రమంగా అమ్మేశారంటూ ఫిర్యాదులు 

రెవెన్యూ, రిజిస్ర్టేషన్‌ శాఖ అధికారుల తీరుపై అనుమానాలు  

తాజా వివాదంలో 38 మందిపై కేసులు.. ముగ్గురి అరెస్టు


హైదరాబాద్/హిమాయత్‌నగర్‌: నిజాం రాజుల రాజప్రాసాదం కింగ్‌కోఠి నజ్రీబాగ్‌ ప్యాలెస్‌ నేడు పూర్తిగా వివాదాల్లో కూరుకుపోయింది. ఒకటి తర్వాత ఒకటిగా వెలుగులోకి వస్తున్న విషయాలు అటు ప్రభుత్వంతోపాటు ఇటు నగరవాసులను కూడా విస్మయానికి గురిచేస్తున్నాయి. ఐదారేళ్ల క్రితమే నిజాం వారసుల నుంచి స్థలాన్ని తాము కొనుగోలు చేశామని మహారాష్ట్రకు చెందిన ఓ నిర్మాణ సంస్థ చెబుతుండగా, దాన్ని సదరు సంస్థ నుంచి తాము కొనుగోలు చేశామని కశ్మీర్‌కు చెందిన మరో సంస్థ వాదిస్తోంది. తాజాగా ఇరు కంపెనీలకు చెందిన వివాదం తారాస్థాయికి చేరింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసులు నమోదు చేశారు. గత సోమవారం నేరుగా స్థలంలోకి చొరబడటానికి ప్రయత్నించిన వ్యక్తులలో ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ముగ్గురు వివిధ కేసులలో పాత నేరస్థులని, క్రిమినల్‌ రికార్డ్‌ ఉన్నందున వారిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు నారాయణగూడ సీఐ భూపతి గట్టుమల్లు తెలిపారు 


వివాదాస్పద సంస్థ ?

కింగ్‌కోఠి ప్యాలె్‌సను కొనుగోలు చేశామని చెబుతున్న మహారాష్ట్రకు చెందిన నిహారిక సంస్థ చరిత్ర పూర్తిగా వివాదాస్పదమని తెలుస్తోంది. పురాతన ప్యాలెస్‌లు భవనాల డాక్యుమెంట్లు, వారసత్వ హక్కులలో ఉండే లోపాలను ఆసరాగా చేసుకుని ఈ సంస్థ సదరు స్థలాలను కారుచౌకగా చేజిక్కించుకుంటుందని, ఈ క్రమంలోనే కింగ్‌కోఠి ప్యాలె్‌సను కూడా వక్రమార్గంలో చేజిక్కించుకుని ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజాం వారసుల నుంచి తాము కొనుగోలు చేసిన కింగ్‌కోఠి ప్యాలె్‌సను తమ సంస్థ నుంచి వెళ్లిన ఉద్యోగులు సురే్‌షకుమార్‌, రవీంద్రలు మోసపూరితంగా తప్పుడు దస్తావేజులు సృష్టించి కశ్మీర్‌కు చెందిన ఐరిస్‌ హాస్పిటాలిటీ సంస్థకు విక్రయించారని పేర్కొన్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి దస్తావేజులు పరిశీలిస్తే తెలిసిందని, అందువల్లే 2019 అక్టోబర్‌లో హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఇందుకు సంబంధించి ఓ వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారని నిహారిక సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.  


రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ పెద్దల హస్తం ఉందా?

ప్యాలె్‌సతోపాటు దాని ఖాళీ స్థలం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వమే ఆచితూచి వ్యవహరించిన నేపథ్యంలో పక్క రాష్ట్రానికి చెందిన ప్రైవేట్‌ సంస్థ ఎలా దీన్ని హస్తగతం చేసుకుందనేదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఈ స్థలం ప్రైవేట్‌ పరం ఎలా అయింది, రిజిస్ర్టేషన్‌ చేసిన వారు ఎవరు, ప్రభుత్వ పెద్దల హస్తం ఏమైనా ఉందా? ఎవరికి తెలియకుండానే దస్తావేజుల నిజనిర్ధారణ లేకుండానే సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయం అధికారులు రిజిస్ట్రేషన్లు చేశారా? అనేది తేలాల్సి ఉంది. నిహారిక సంస్థ ఆరోపిస్తున్నట్లుగా వారి ఉద్యోగులే నకిలీ దస్తావేజులతో విక్రయించి ఉంటే.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖకు చెందిన అధికారుల ప్రమేయంతోనే ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిందని తేటతెల్లమవుతోంది. అంటే చారిత్రాత్మక కింగ్‌కోఠి ప్యాలె్‌సను ప్రైవేట్‌ వ్యక్తులు అమ్మేసినప్పటికీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ విభాగాల అధికారులు ఎందుకు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలేదు. ఐదేళ్ల వ్యవధిలోనే   రెండు పర్యాయాలు రిజిస్ట్రేషన్‌  శాఖ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లలేదా? లేక ప్రభుత్వం దృష్టికి వెళ్లినప్పటికీ వారు పెద్దగా పట్టించుకోలేదా? తేలాల్సి ఉంది. 


ముగ్గురు పాత నేరస్థుల అరెస్టు

ఐరిస్‌ హాస్పిటాలిటీకి చెందిన యాజమాన్య ప్రతినిధుల ప్రమేయంతో  సోమవారం ప్యాలె్‌సలోకి కొందరు బుల్‌డోజర్లతో ప్రవేశించి కూల్చివేతలకు ప్రయత్నించారు. మొత్తం 38మందిపై నిహారిక ఇన్‌ఫ్రా సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. కూకట్‌పల్లికి చెందిన కమల్‌సింగ్‌, లఖన్‌సింగ్‌, చంద్రాయణగుట్టకు చెందిన అహ్మద్‌బిన్‌ సలామ్‌ జాఫ్రీ పలు కేసుల్లో పాత నేరస్థులుగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసులో దర్యాప్తు కోనసాగుతోందని సీఐ భూపతి గట్టుమల్లు తెలిపారు.  


 రాచరిక ఠీవీ.. కింగ్‌ కోఠి ప్యాలెస్‌

 ఆస్‌ఫజాహీల ఏలికలో అత్యంత వివాదాస్పదమైన రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌. ఏడవ నిజాం రాజుగా అధికార పగ్గాలు చేపట్టిన ఆయనకు చిన్నతనం నుంచి కళాత్మక దృష్టి ఎక్కువని చరిత్ర అధ్యయనకారులు చెబుతారు. ఆయనకు ఆనాటి నజ్రీబాగ్‌ ప్యాలెస్‌ విపరీతంగా నచ్చిందట. నిజానికి ఆ భవనాన్ని రాజకుటుంబానికి చెందిన కమాల్‌ ఖాన్‌ 1890వ దశకంలో యూరోపియన్‌ శైలిలో నిర్మించాడు. అయితే, తర్వాత ప్రభువు కోరిక మేరకు భవనాన్ని మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కు అమ్మారనేది చరిత్ర అధ్యయనకారుల ద్వారా వెలుగులోకి వచ్చిన సమాచారం. ప్యాలె్‌సలోకి అడుగుపెట్టేప్పుడు ఏడో నిజాం వయసు పదమూడేళ్లు. ఆపై  1967, ఫిబ్రవరి24 తుదిశ్వాస విడిచేవరకూ ఆయన అదే మహల్‌లో నివసించారు. 


ప్యాలె‌స్ మీద ప్రేమ...

భవనం కిటికీలు, తలుపుల మీదున్న కేకే అక్షరాలు తొలగిస్తే నిర్మాణ అందం పోతుందని, కేకే అంటే ‘కింగ్‌ కోఠి’ అని నామకరణం చేస్తూ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఫర్మానా జారీ చేసినట్టు చరిత్రకారులు చెబుతారు. ‘ఈ ప్యాలె్‌సమీద ప్రేమతో ఆయన తండ్రి మహబూబ్‌ అలీఖాన్‌ నివసించే చౌమహల్లాకు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ వెళ్లలేదని’ ఇన్‌ట్యాక్‌ నగర కన్వీనర్‌ అనూరాధా రెడ్డి అన్నారు. తూర్పుభాగం లోని అప్పటి నిజాం అధికారిక కార్యాలయాల్లో ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. మరో ముఖ్య భవనమైన ఉస్మాన్‌ మెన్షన్‌ను 1980లో కూల్చి, అదే ప్రదేశంలో ప్రభుత్వ ఆస్పత్రి గదులు నిర్మించారు. హైదరాబాద్‌ చరిత్ర ఘనతను కళ్లకు కట్టే ఏడో నిజాం నివాస గృహాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.  చారిత్రక భవనాన్ని నిజాం మ్యూజి యం వంటి సందర్శనీయ స్థలంగా మార్చడం వల్ల ప్రజా ప్రయోజనంలోకి వస్తుందని అనూరాధారెడ్డి అభిలాషిస్తున్నారు

Updated Date - 2022-04-13T18:05:51+05:30 IST