నాటకానుభవాల పునాదిపై నిలిచి... గెలిచిన ‘కోట’

ABN , First Publish Date - 2022-07-10T15:23:37+05:30 IST

రేడియో నుంచి చాలా నేర్చుకున్నాను. ఉచ్చారణ ఎలా వుండాలి? ఏ వాక్యాన్ని ఎక్కడ ఎలా విరవాలి? ఏ పదాన్ని ఎక్కడ ఎంత నొక్కి చెప్పాలి? ఇవన్నీ రేడియో నాటకాల్లో

నాటకానుభవాల పునాదిపై నిలిచి... గెలిచిన ‘కోట’

(కోట శ్రీనివాసరావు పుట్టినరోజు జులై 10) 

“రేడియో నుంచి చాలా నేర్చుకున్నాను. ఉచ్చారణ ఎలా వుండాలి? ఏ వాక్యాన్ని ఎక్కడ ఎలా విరవాలి? ఏ పదాన్ని ఎక్కడ ఎంత నొక్కి చెప్పాలి? ఇవన్నీ రేడియో నాటకాల్లో నటిస్తూ నేర్చుకున్నాను” తన డెబ్బయి నాలుగో పుట్టినరోజున ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు చెప్పిన మాటలు ఇవి. ఒకప్పుడు రేడియోలో పనిచేసిన మనిషిగా ఈ మాటలు విని నేనూ సంతోషపడ్డాను.


“బ్యాంకులో ఉద్యోగం. సాయంత్రాలు నాటకాలు రిహార్సల్స్. మధ్యమధ్య రేడియో నాటకాలు. రవీంద్ర భారతిలోనే నూట యాభయ్ కి పైగా నాటకాలు వేసిన అనుభవం. ఎవరో అన్నారు, సినిమాల్లో కూడా ప్రయత్నించరాదా అని. నాది నల్లటి ఛాయ. ఎప్పుడన్నా నీ మొహం అద్దంలో చూసుకున్నావా అంటారేమో అని బెరుకు”  అలాంటి మనిషి ఒకటీ అరా కాదు, లెక్కకు మించిన సినిమాల్లో వేశారు. అవీ చిన్నాచితకా వేషాలు కావు. నటనా వైదుష్యానికి గుర్తుగా ఎనిమిది నందులు ఆయన సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ ఆకాశంలో ఓ వెలుగు వెలిగారు. నేను రేడియోలో చేరిన కొత్తల్లో కోట శ్రీనివాసరావు గారు నారాయణ గూడా (దీపక్ మహల్ పక్కన) స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. అప్పుడప్పుడు తోటి నాటకాల నటులతో కలిసి రేడియో ఆవరణలో కనిపించేవారు. 


ఒకరోజు అయన అన్నమాటలు నాకు బాగా జ్ఞాపకం.

“మా బ్యాంకు వాళ్లకు ఆటలు ఆడేవాళ్ళు తప్ప మా బోటి నటులు పనికిరారు. (ఆ రోజుల్లోనే స్టేట్ బ్యాంకు ఉద్యోగి మహమ్మద్ అజహరుద్దీన్   క్రికెట్ క్రీడాకారుడిగా  నిలదొక్కుకుంటున్నారు. చిన్నతనంలో విఠల్ వాడీలో గల్లీ క్రికెట్ ఆడేవారని చెప్పుకునేవారు) వాళ్లకు అడగడమే ఆలస్యం సెలవు దొరుకుతుంది. నాకేమో రాకరాక ఓ సినిమా వేషం వచ్చింది. వారం రోజులు సెలవు కావాలంటే దొరకడం గగనం. సరే మేము సినిమాల్లో వేషాలు   వేసి డబ్బులు తీసుకుంటున్నాం అంటున్నారు. వాళ్ళు మాత్రం క్రికెట్ ఊరికే ఆడుతున్నారా! ఎందుకీ వివక్ష?” అనేది ఆయన ఆవేదన.


సినిమాలు పెరిగాక ఆయన ఆ ఉద్యోగం వదిలేశారు, అది వేరే విషయం.

స్టేట్ బ్యాంకులో మధుర బాబుగారని ఓ అధికారి వుండేవారు. (చనిపోయి కొద్ది సంవత్సరాలు అవుతోంది) హైదరాబాదు మెయిన్ బ్రాంచికి మేనేజర్. సమర్ధుడైన ఆఫీసర్ అని పేరు. ఆ రోజుల్లో ఆయన హవా బాగా వుండేది. ఈ రోజు రాష్ట్రంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అనిపించుకుంటున్న వారిలో అనేకమంది ఆయనకోసం ఆఫీసు బయట వెయిట్ చేస్తుంటే నేను ఆరోజుల్లో చూశాను. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారూ మధురబాబు గారు మంచి స్నేహితులు. మా అన్నయ్య విశాఖ గ్రామీణ బ్యాంకు చైర్మన్ గా, మధురబాబుగారు నాగార్జున గ్రామీణ బ్యాంకు చైర్మన్ గా పనిచేశారు. తదనంతర కాలంలో మా అన్నయ్య చెన్నై, పుదుచ్చేరి, కేరళరాష్ట్రాల స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా, మధురబాబు గారు జనరల్ మేనేజర్ గా పనిచేశారు. 


ప్రపంచ ప్రసిద్ధ కేన్సర్ నిపుణులు నోరి దత్తాత్రేయుడు మధురబాబు గారికి స్వయానా తమ్ముడు. వేరే విషయం అంటూ వేరే వేరే విషయాల్లోకి పోతున్నానని అనుకుంటున్నారా. లేదు. కోట శ్రీనివాసరావు గారికీ బ్యాంకుకూ సంబంధం ఉన్నట్టే, ఒకప్పుడు ఏ బ్యాంకులో అయితే రెండు రోజులు సెలవు కోసం ఇబ్బందులు పడ్డారో అదే స్టేట్ బ్యాంకులో జనరల్ మేనేజర్ గా పనిచేసిన  ఈ మధురబాబు గారికీ సంబంధం వుంది. అది కూడా అలాంటిలాంటి సంబంధం కాదు. తదనంతర కాలంలో ఈ ఇద్దరూ స్వయానా వియ్యంకులు అయ్యారు.


భండారు శ్రీనివాసరావు

(సీనియర్ పాత్రికేయులు, రచయిత)

9849130595


Updated Date - 2022-07-10T15:23:37+05:30 IST