హర్షాతిరేకాలు

ABN , First Publish Date - 2022-05-19T06:00:26+05:30 IST

జిల్లాల పునర్విభజనలో ఏర్పడిన కోనసీమ జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దీంతో దళిత సంఘాలతో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ సహా వివిధ రాజకీయ పార్టీలు చేసిన ఉద్యమాలు ఎట్టకేలకు ఫలించాయి.

హర్షాతిరేకాలు
అమలాపురంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నినాదాలు చేస్తున్న దృశ్యం

  • ఫలించిన జిల్లా సాధన సమితి నేతల కృషి
  • ముఖ్యమంత్రి జగన అనూహ్య నిర్ణయం
  • డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
  • వాడవాడలా సంబరాలు చేసుకున్న దళిత సంఘాలు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

జిల్లాల పునర్విభజనలో ఏర్పడిన కోనసీమ జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దీంతో దళిత సంఘాలతో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ సహా వివిధ రాజకీయ పార్టీలు చేసిన ఉద్యమాలు ఎట్టకేలకు ఫలించాయి. జిల్లాల పునర్విభజన చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయంలోనే దళితులు ఉద్యమాన్ని ప్రారంభించారు. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా నామకరణం చేయాలనే ఏకైక డిమాండుతో నియోజకవర్గ, మండల కేంద్రాల్లో విజ్ఞాపన దీక్షలు చేపట్టారు. అమలాపురంలో మార్చి 7న లాంగ్‌మార్చ్‌ నిర్వహించారు. అంబేడ్కర్‌ జిల్లా సాధన సమితి నాయకులైన డీబీ లోక్‌, జంగా బాబూరావు, ఇసుకపట్ల రఘుబాబు, ఎంఏకే భీమారావు సహా పలువురు నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ జిల్లాలోని 22 మండలాల్లో పర్యటించి దళిత సంఘాలను చైతన్యవంతం చేయడంతో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులను కలిసి పేరు మార్పు కోసం మద్దతు కూడగట్టారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త జిల్లాలకు ఎన్టీఆర్‌, అల్లూరి, అన్నమయ్య పేర్లు పెట్టిన నేపథ్యంలో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ జిల్లాగా నామకరణం చేయాలనే ఉద్యమాన్ని తెరపైకి తీసుకువచ్చారు. మంత్రులు పినిపే విశ్వరూప్‌, వేణు, వైసీపీ ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాదరావు, కొండేటి చిట్టిబాబు, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని కలిసి కోనసీమ అంబేడ్కర్‌ జిల్లాగా పేరు పెట్టాలని వినతిపత్రం అందజేశారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పినప్పటికీ తుది నోటిఫికేషనలో మార్పులు జరగలేదు. దాంతో జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో దళిత సంఘాలు దశలవారీ ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అంబేడ్కర్‌ జిల్లాను సాధిస్తామని ప్రతినబూనారు. ఈ నెల 13న ఐ.పోలవరం మండలం మురమళ్ల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగనని డీబీ లోక్‌, బాబూరావు, రఘుబాబు ఆధ్వర్యంలో దళిత నాయకులు కలిసి మరోసారి వినతిపత్రం ఇచ్చారు. తమ న్యాయమైన డిమాండును ఆమోదించాలని చేసిన సూచనపై సీఎం సానుకూలంగా స్పందించినట్టు సాధన సమితి నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల వ్యవధిలోనే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మార్పు చేస్తూ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ప్రభుత్వ కార్యదర్శి సాయిప్రసాద్‌ ప్రిలిమినరీ నోటిఫికేషనను విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే దళితులు అమలాపురం కేంద్రంగా సంబరాలు చేసుకున్నారు. గడియార స్తంభం సెంటర్లో సాధన సమితి నాయకుల ఆధ్వర్యంలో యువకులు అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చారు. ఇకపై కోనసీమ జిల్లా పేరును బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్పు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 


దేశంలో రెండో అంబేడ్కర్‌ జిల్లాగా కోనసీమకు గుర్తింపు

ఎంపీ అనురాధ

కోనసీమ జిల్లాను డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మారుస్తూ సీఎం జగన్మోహనరెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దళితులు అత్యధికంగా నివసించే ఈ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలనే డిమాండుతో చేసిన ఉద్యమం సఫలీకృతమైంది. ఇందుకు  కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు ఉత్తరప్రదేశలో అంబేడ్కర్‌ నగర్‌ జిల్లా ఒకటి ఉంది. ఆ తర్వాత దేశంలోనే రెండోదిగా అంబేడ్కర్‌ పేరుతో కోనసీమ జిల్లాను ఏర్పాటు చేయడం అభినందనీయం.


Updated Date - 2022-05-19T06:00:26+05:30 IST