కొమ్మమూరు..కన్నీరు!

ABN , First Publish Date - 2020-11-24T05:08:46+05:30 IST

కొమ్మమూరు ఆయకట్టుకు జిల్లా ధాన్యాగారంగా గుర్తింపు ఉంది. కొమ్మమూరు ఆయకట్టు పరిధిలో అధికారికంగా 72 వేల ఎకరాలు, అనధికారికంగా మరో 20వేల ఎకరాలు, సుమారు లక్ష ఎకరాల్లో మాగాణి సాగు జరగటం అందుకు కారణం. వర్షాలు, వరదల సమయంలో కొమ్మమూరు కాలువకు అనేకచోట్ల గండ్లు పడటం, రైతులు పంట నష్టపోవటం పరిపాటిగా మారింది.

కొమ్మమూరు..కన్నీరు!

కాలువ ఆధునికీకరణ ఇప్పట్లో లేనట్లేనా...?

జిల్లా పరిధిలో కాలువకు 54 ప్రదేశాల్లో గండ్లు

కొన్నిచోట్ల తాత్కాలిక మరమ్మతులు చేసుకున్న రైతులు

ఎమ్మెల్యే బలరాం చొరవతో కొన్ని గండ్లు పూడ్చివేత

కనీసం ఆ వైపు కన్నెత్తిచూడని అధికారులు

కాలువ బాగుపై ఆందోళనలో ఆయకట్టు రైతులు

నెలాఖరులోపు రద్దుకానున్న పాత కాంట్రాక్టు

సత్వర చర్యలను పట్టించుకోని పాలకులు


కొమ్మమూరు కాలువ ఆధునికీకరణకు నిర్లక్ష్యపు గ్రహణం పట్టింది. కాలువ కింద జిల్లాలో లక్ష ఎకరాలకుపైగా మాగాణి సాగవుతోంది. భారీ వర్షాలు, వరదలు వచ్చిన సమయంలో కాలువ కట్టలు బలహీనంగా ఉన్నచోట ఛిద్రమవుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపఽథ్యంలో 2008లో అప్పటి పాలకులు కాలువ ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. పనులను దక్కించుకున్న ప్రోగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కేవలం ముందస్తు చెల్లింపులు పొందేందుకు మాత్రమే శ్రద్ధచూపింది. అది ప్రస్తుతం కొమ్మమూరు ఆయకట్టు రైతుల పాలిట శాపమైంది. ఈ ఏడాది కురిసిన వర్షాలకు కాలువ కట్టకు 54చోట్ల గండ్లుపడ్డాయి. రైతులే ముందుకొచ్చి సొంతనిఽఽధులతో వాటిని తాత్కాలికంగా పూడ్చుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పన్నెండేళ్ల పాటు పనులు చేయకుండా ఉన్న కాంట్రాక్టు సంస్థను రద్దుచేసి మరొకరికి అప్పజెప్పకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుండటపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుపాను హెచ్చరికలు, కాలువ నిండా నీరు పారుతున్న సమయం కావడంతో ఏం జరుగుతుందోననే భయం వారిని వెంటాడుతోంది. 


చీరాల, నవంబరు 23 : కొమ్మమూరు ఆయకట్టుకు జిల్లా ధాన్యాగారంగా గుర్తింపు ఉంది. కొమ్మమూరు ఆయకట్టు పరిధిలో అధికారికంగా 72 వేల ఎకరాలు, అనధికారికంగా మరో 20వేల ఎకరాలు, సుమారు లక్ష ఎకరాల్లో మాగాణి సాగు జరగటం అందుకు కారణం. వర్షాలు, వరదల సమయంలో కొమ్మమూరు కాలువకు అనేకచోట్ల గండ్లు పడటం, రైతులు పంట నష్టపోవటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో కొమ్మమూరు కాలువ ఆధునికీకరణకు 2008లో అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్యాకేజీ నెం-27 కింద రూ.190 కోట్ల నిధులు విడుదల చేశారు. ప్రోగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అనే కంపెనీ పనులకు సంబంధించి టెండరును పొందింది. కేవలం 0.13శాతం పనులు మాత్రమే ఆ కంపెనీ చేసింది. నిబంధనల్లోని సడలింపులు, రాయితీలు ముందస్తు చెల్లింపులు పొందేందుకు మాత్రమే ఆ కంపెనీ చొరవచూపింది. దీంతో కొమ్మమూరు ఆధునికీకరణపనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. ఈ నెలాఖరులోపు సదరు కాంట్రాక్టును రద్దు చేసేందుకు అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. 

నిధులు విడుదల చేసినా..

2008 అప్పటి సీఎం వైఎస్సార్‌ కొమ్మమూరు కాలువ ఆధునికీకరణకు 27వ ప్యాకేజీ కింద రూ.190 కోట్లు విడుదల చేశారు. ప్రోగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కాంట్రాక్టు పనులు దక్కించుకుంది. ఆ తర్వాత కొమ్మమూరు ఆధునికీకరణ పనులకు సంబంధించి ముందస్తు చెల్లింపులు పొందిన తర్వాత చేయాల్సిన పనులపై శీతకన్ను వేసింది. కేవలం 0.13 శాతం అదీ మట్టలు మాత్రమే చేశారు. కాంట్రాక్టుకు సంబంధించిన పనులను చేయకుండా, తమ కాంట్రాక్టు రద్దుకాకుండా ఒకటికి రెండు మూడు పర్యాయాలు ఈఓటీ (ఎక్స్‌టెన్షన్‌ ఆఫ్‌ టైం) పొందింది. ఇందుకు నిబంధనల్లోని వెసులుబాటును ఉపయోగించుకున్నారు. ప్రభుత్వంలో ఆ సంస్థకు పట్టు ఉండటంతో వారిపై తగిన చర్యలు తీసుకోవటంలో కూడా వెనకడుగు వేశారనే భావన రైతుల్లో ఉంది. అది నిజం కూడా. 

కొరవడిన స్పష్టత

కేంద్ర ప్రభుత్వం బకింగ్‌హామ్‌ కెనాల్‌ మోడరైజేషన్‌కు సంబంధించి నావిగేషన్‌ కింద (నౌకా రవాణాకు) ప్రతిపాదన చేసింది. అందుకు సంబంధించి ఓ ప్రణాళికను రూపొందించారు. ఈక్రమంలో కొమ్మమూరు కాలువ ఆధునికీకరణ పనులపై స్పష్టత కొరవడింది. ఆ తరువాత అందుకు సంబంధించిన పనులు కూడా జరగలేదు.

54 చోట్ల కాలువకు గండ్లు 

ఎప్పుడో బ్రిటీష్‌ వారి కాలంలో చేపట్టిన నిర్మాణాలతో ప్రస్తుతం రైతుల అవసరాలకు అనువుగా లేదు. గత నెలలో కురిసిన వర్షాలకు నర్సాయపాలెం లాకుల నుంచి పెదగంజాం వరకు 54చోట్ల కాలువ కట్టలకు గండ్లుపడ్డాయి. ఎమ్మెల్యే కరణ బలరాం చొరవతో పాటు రైతులంతా కలిసి సొంత నిధులతో పూడ్చారు. కాలువ పరిధిలో దిగువ భూములకు నీరు అందాలంటే కారంచేడు బ్రిడ్జి వద్ద 7 అడుగుల మేర నీటిమట్టం ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఎత్తిపోతల పథకాలకు నీరు అందటం లేదు. 





Updated Date - 2020-11-24T05:08:46+05:30 IST