ఒక్కటే వాన.. పొంగి పొర్లిన వాగులు వంకలు

ABN , First Publish Date - 2020-09-27T05:52:41+05:30 IST

కొల్లాపూర్‌లో భారీ వర్షం కురిసిం ది. శుక్రవారం అర్ధ రాత్రి నుంచి ప్రారంభమైన భారీ వర్షం శనివారం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. దీంతో 72.4 మి.మీటర్ల వర్షపాతం.....

ఒక్కటే వాన.. పొంగి పొర్లిన వాగులు వంకలు

జలమయమైన రహదారులు

నీట మునిగిన పంట పొలాలు

ఉధృతంగా ప్రవహిస్తున్న దుందుభీ నది


కొల్లాపూర్‌, సెప్టెంబరు: కొల్లాపూర్‌లో భారీ వర్షం కురిసిం ది. శుక్రవారం అర్ధ రాత్రి నుంచి ప్రారంభమైన భారీ వర్షం శనివారం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. దీంతో 72.4 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 15 రోజుల నుంచి వరుసగా కురుస్తున్న వర్షాల కారణంతోపా టు శుక్రవారం కురిసిన భారీ వర్షానికి కొల్లాపూర్‌ మండలంలోని చెరువులు, కుంటలు అలుగులు పారాయి. కొల్లాపూర్‌ పట్టణంలోని వరిదెల ఊర చెరువు నేడు యథావిధిగా పారుతూనే ఉంది. మం డల పరిధిలోని నల్లమల గ్రామాల్లో విస్తృతంగా కురుస్తున్న వర్షాల కారణంగా రాకపోకలకు అంత రాయమేర్పడింది. నార్లపూర్‌, మొల చింతలపల్లి, ముక్కిడిగుండం గ్రామాల ప్రజలు వరద నీటి వల్ల ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ అధికారులు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 


పొంగిపొర్లిన వాగులు, వంకలు 

కొల్లాపూర్‌ రూరల్‌, పెంట్లవెల్లి: శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండల పరిధిలోని వాగు లు, వంకలు, చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి.  పంట పొలాలు నీట మునిగాయి. 


అలుగు పారిన అమ్మ చెరువు 

తిమ్మాజిపేట: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మండలంలోని పలు గ్రామాల్లో వచ్చిన వరద నీటికి కుంటలు నిండిపోయాయి. తిమ్మాజిపేటలోని అమ్మ చెరువు అలుగు పారింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. చేగుంట, తిమ్మాజిపేట, మారేపల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లో అంతర్గత రోడ్లు వరద నీటిలో మునిగాయి. కోడుపర్తి, చేగుంట, మరికల్‌, మారేపల్లి, అప్పాజిపల్లిలోని చెరువులు, కుంటలు ఇప్పటికే వరద నీటికి నిండిపోయాయి. తిమ్మాజిపేట మండలంలో 58 మి.మీ వర్షపాతం నమోదైన ట్లు తహసీల్దార్‌ సరస్వతి తెలిపారు. 


ఉధృతంగా దుందుభీ నది ప్రవాహం

తాడూరు: ఎగువ ప్రాంతంలో ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తుండడంతో శనివారం దుందుభీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కల్వకుర్తి, సిర్సవాడ మార్గాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగి పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.


8 సెంటీమీటర్ల వర్షపాతం

వెల్దండ: వెల్దండ మండలంలో 8.07 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భైరాపూర్‌ గ్రామానికి రాకపోకలు స్థంభించిపోయాయి. గాన్‌గాట్‌ తండాకు వెళ్లే బ్రిడ్జిపైన ఏర్పాటు చేసిన మిషన్‌ భగీరథ పైపులు కొట్టుకుపోయాయి.


ఉధృతంగా పారుతున్న చారకొండ పెద్దవాగు 

చారకొండ: మండలంలో శుక్రవారం రాత్రి కురి సిన వర్షానికి శనివారం చారకొండ పెద్దవాగు ఉధృ తంగా పారుతోంది. దీంతో చారకొండ సమీపంలో ఉన్న చెక్‌డ్యాం (కత్వా) పొంగి పొర్లుతోంది.



Updated Date - 2020-09-27T05:52:41+05:30 IST