Kurnool : వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. నిలదీసిన మహిళలు.. ప్రసంగం మధ్యలోనే ఆపేసి..

ABN , First Publish Date - 2022-05-01T14:51:38+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. నిలదీసిన మహిళలు.. ప్రసంగం మధ్యలోనే ఆపేసి..

Kurnool : వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. నిలదీసిన మహిళలు.. ప్రసంగం మధ్యలోనే ఆపేసి..

కర్నూలు : అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలకు వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. జనాల్లోకి వెళ్తున్న ఎమ్మెల్యేలకు ఏదో ఒక రూపంలో ప్రజలు, సొంత పార్టీ కార్యకర్తలు ఊహించని రీతిలో షాక్‌లు ఇస్తున్నారు. శనివారం నాడు ఏలూరు జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పరామర్శకు అని వెళ్తే.. ఆయన్ను ప్రజలు, సొంత పార్టీ వాళ్లే చుట్టుముట్టి, కోడిగుడ్లు విసిరి.. తరిమి తరిమి కొట్టారు. అయితే ఇలా ఎమ్మెల్యేలకే కాదండోయ్.. కొందరు ఎంపీలు, మంత్రులకు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయ్. అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అయితే ఈ ఘటన మరిచిపోక ముందే కర్నూలు జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది.


ఇదీ జరిగింది..!?

ఆదివారం నాడు గూడూరులో సున్నా వడ్డీ పథకం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి, మహిళల అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తోందని చెబుతుండగా.. పొదుపు మహిళలు పైకి లేచి ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఏంటి సార్.. మూడు వేల రూపాయలు ఇచ్చి ఇన్ని గొప్పలు చెబుతున్నారు. చంద్రబాబు 20 వేల రూపాయలు ఇచ్చి సాయం చేశారు. ఇప్పుడు తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేవు. బురద నీరు వస్తోంది. రేషన్ బియ్యం సరిగా లేవు. నిత్యావసర ధరలు పెంచారు.. గ్యాస్ ధరలు కూడా పెంచేశారు. మూడు వేల రూపాయలు ఇచ్చి వేలకు వేలు పన్నులు వేస్తే ఎలా కట్టాలి..? అని ఎమ్మెల్యేను పొదుపు మహిళలు నిలదీశారు. అయితే.. మహిళల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. తన ప్రసంగాన్ని ఆపి మధ్యలోనే సుధాకర్ వెళ్లిపోయారు.

Updated Date - 2022-05-01T14:51:38+05:30 IST