బరులు వెలవెల.. గుండాటలు కిటకిట!

ABN , First Publish Date - 2021-01-14T07:07:48+05:30 IST

తొలిరోజు జిల్లాలో జూదక్రీడలు హోరెత్తాయి. ఎక్కడికక్కడే కోడిపందేలు, గుండాటలు, పేకాట, అశ్లీల రికార్డింగ్‌ డ్యాన్స్‌ల జాతరలను పెద్దసంఖ్యలో ప్రజలు తిలకించారు.

బరులు వెలవెల..  గుండాటలు కిటకిట!
కొత్తపేట పందేల బరిలో పుంజుతో వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి.

భోగి రోజు అట్టహాసంగా ప్రారంభం

 హోరెత్తిన జూద క్రీడలు.. రాచమర్యాదలతో పేకాట పోటీలు

 తొలి రోజు రూ.25 కోట్లపైనే లావాదేవీలు

 రెవెన్యూ అధికారులకు ప్రజాప్రతినిధుల నుంచి వార్నింగ్‌లు

 పత్తా లేకుండా పోయిన పోలీసు యంత్రాంగం

 హాజరైన ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు


 సంక్రాంతి సంబరాలలో భాగంగా   కోడి పందేలు, గుండాటలు, పేకాటలు,                       అశ్లీల నృత్యాలు తొలి రోజు హోరెత్తిపోయాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రేక్షకులతో ఆయా పందెం బరుల ప్రాంగణాలు కిటకిటలాడాయి. జాతరలను తలపించే రీతిలో బరులు ఉన్నాయి. నోట్ల కట్టలు ప్రవాహంలా చేతులు మారాయి. తొలిరోజైన బుధవారం కోడి పందేల బరులు కొన్నిచోట్ల వెలవెలబోయినప్పటికీ గుండాట బరులు మాత్రం జూదరులతో కిటకిటలాడాయి. రూ.500 తక్కువ కాకుండా బెట్టింగ్‌ వేయాలని నిర్వాహకులు ఆంక్షలు విధించడంతో జూదరుల జేబులకు భారీగా చిల్లులు   పడ్డాయి. పేకాట పోటీలు భారీ స్థాయిలో వివిధ ప్రాంతాల్లో జరిగాయి. సినిమా సెట్టింగుల తరహాలో హంగు, ఆర్భాటాలతో ఏర్పాటుచేసి పేకాట పోటీలు నిర్వహించారు. విందు భోజనాలు, అశ్లీల వినోదాలు ప్రజలను కనువిందుచేశాయి. భోగి సందర్భంగా తొలి రోజు జిల్లావ్యాప్తంగా జరిగిన కోడిపందేలు, గుండాటలు వంటి జూదక్రీడల్లో సుమారు రూ.25 కోట్లు పైగా చేతులు మారినట్టు అనధికార అంచనా. ప్రజాప్రతినిధుల సిఫారసులు, మామూళ్ల మత్తులో ఉన్న పోలీసుల సాక్షిగా జిల్లాలో   జూదక్రీడలు జోరుగా, హుషారుగా సాగాయి. 

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

తొలిరోజు జిల్లాలో జూదక్రీడలు హోరెత్తాయి. ఎక్కడికక్కడే కోడిపందేలు, గుండాటలు, పేకాట, అశ్లీల రికార్డింగ్‌ డ్యాన్స్‌ల జాతరలను పెద్దసంఖ్యలో ప్రజలు తిలకించారు. జిల్లావ్యాప్తంగా 150కు పైగా ఏర్పడ్డ కోడిపందేల బరులలో తొలి రోజు రూ.22 కోట్ల నుంచి రూ.25 కోట్ల మధ్య చేతులు మారినట్టు అనధికారిక సమాచారం. ఇక గుండాటలైతే వందలాది బోర్డులతో లక్షలాదిమంది ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. తొలిరోజు గుండాటల ద్వారా రూ.8 కోట్లకు పైనే చేతులు మారినట్టు తెలిసింది. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంతోపాటు పిఠాపురం, పెద్దాపురం, తుని, రాజమహేంద్రవరం రూరల్‌, ఏజెన్సీ ప్రాంతాలు, ఇటు కోనసీమ పరిధిలోని 16 మండలాల్లో భారీగా కోడి పందేల బరులను ఏర్పాటుచేశారు. హైకోర్టు ఆంక్షలు, పోలీసులు విధించిన 144 సెక్షన్‌ నిబంధనను ఉల్లంఘించి జూదక్రీడల నిర్వహణ జోరుగా చేపట్టారు. కోనసీమలో ప్రధానంగా ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలెంలో తొలిరోజు రూ.10 కోట్లపైనే పందేలు, గుండాటలు జరిగి నట్టు సమాచారం. భారీగా కార్లలో పందెంరాయుళ్లు తరలివచ్చి బెట్టింగులు కాశారు. బరిలో పందెం రూ.5 లక్షలు ధరగా నిర్ణయించారు. అయితే పది గుండాట బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ కేవలం ఐదు బోర్డుల ద్వారానే తొలి రోజు గుండాటలు నిర్వహించారు. ఆత్రేయపురం మండలం ర్యాలిలో పేకాట పోటీలు ప్రారంభమైనప్పటికీ తొలి రోజు మందకొడిగా సాగాయి. అమలాపురం రూరల్‌ మండలం వన్నెచింతలపూడిలో వైసీపీ నేతల సమ క్షంలో పందేలు, గుండాటలు జోరుగా సాగాయి. రావులపాలెం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే పందేలు, గుండాటలు జోరుగా సాగాయి. ఇక్కడ పందేలను కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్‌లు పాల్గొని కోళ్లతో సందడి చేశారు. కొత్తపేట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోను కోడి పందేల బరులను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తిలకించి ప్రారంభించారు. కొత్తపేటలో టీడీపీ, వైసీపీ నేత లు సంయుక్తంగా ఏర్పాటుచేసిన బరి వద్ద పందేలను ప్రారంభించి ఎమ్మెల్యే తిలకించారు. కాట్రేనికోన మండలం గెద్దనపల్లి, చెయ్యేరుతోపాటు పలుచోట్ల బరులు ఏర్పాటుచేశారు. ముమ్మిడివరం మండలం రాజుపాలెం, కొత్తలంక, అల్లవరం మండలం గోడి గోదావరి గట్టున, గోడిలంకలలో ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటుచేసి భారీగా కోడిపందేల పోటీలను ఏర్పాటు చేసినప్పటికీ ఈసారి పెద్దగా ప్రజాదరణ లేక తొలి రోజు వెలవెలబోయాయి. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని వివిధ గ్రామాల్లో కోడిపందేల జాతరలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాంలో పందెం బరులు వెలిశాయి. కొన్నిచోట్ల వైసీపీ రాజకీయపక్షాల తరపున కూడా ప్రత్యేక బరులు ఏర్పాటుచేశారు. కొత్తగా అమలాపురం రూరల్‌ మండలం బండారులంక పంచాయితీ సమీపంలోని ప్రైవేటు లేఅవుట్‌లో ఆ గ్రామస్తులు కోడిపందేలు, గుండాటలు నిర్వహించారు. సమనస, కొంకాపల్లి, చిందాడగరువు, ఇందుపల్లి ఎన్‌కౌంటర్‌ బ్రిడ్జి వద్ద కొత్త లేఅవుట్‌లో కోడిపందేలు, గుండాటలు యథావిధిగా జరిగాయి. ఆత్రేయపురం మండలంలోని వివిధ గ్రామా ల్లో కోడిపందేలు ప్రధాన రహదారులకు సమీపంలో నిర్వహిం చడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బొబ్బర్లంకలో పేకలతో కోతాట నిర్వహించారు. రావులపాలెం, ఊబలంక, గోపాలపురంలోని నదీతీరాన వెలిసిన ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లో భారీగా పేకాట పోటీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు తొలి రోజు పందెం బరులు వెలవెలబోయినప్పటికీ ఆయా ప్రాంగణాల్లో ఉన్న గుండాటల శిబిరాలు జనంతో కిటకిటలాడాయి. గుండాట బరుల వద్ద కనిష్టంగా రూ.200, గరిష్టంగా ఎంతైనా సరే కాసేవిధంగా నిర్వాహకులు ఆంక్షలు విధించడంతో గుం డాటల్లో పాల్గొనే జూదరులు నిలువునా దోపిడీకి గురవుతున్నారు. తొలిరోజు జిల్లావ్యాప్తంగా జరిగిన గుండాటలలో రూ.10 కోట్లకు పైనే చేతులుమారినట్టు అనధికారిక అంచనా. ఇక పోలీసు యంత్రాంగం మామూళ్లవేటలో నిమగ్నమైంది. జీపులు వేసుకుని బరులు చెంతకువచ్చి నిర్వాహకులతో మాట్లాడుకుని వెళ్లిపోతున్నారు. పోలీసు సైరన్‌తో వారు చేస్తున్న హడావుడి అంతా ఇంతాకాదు. ఇక రాజోలు నియోజకవర్గంలోని గ్రామగ్రామాన కోడిపందేలతోపాటు పేకాట పోటీలు, అశ్లీల రికార్డింగ్‌ డ్యాన్స్‌లు హోరెత్తిపోతున్నాయి. వైసీపీకి చెందిన అమాత్యుల నుంచి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధుల సూచనలతో పోలీసు యంత్రాంగం స్టేషన్లకే పరిమితం కావాల్సివచ్చింది. సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ ఆదేశాలతో తహశీల్దార్లు పందెంబరులు ఏర్పా టుచేసిన భూయజమానులపై కేసులు కడతామని హెచ్చరిం చడంతో కీలక ప్రజాప్రతినిధులు వారికి ఫోన్‌లో వార్నింగ్‌లు ఇచ్చి అటువైపు కన్నెత్తి చూడకుండా చేస్తున్నారు. కోనసీమలోని వందకు పైగా ప్రాంతాల్లో జరుగుతున్న కోడిపందేల్లో వందలాది కోళ్లు బలవుతున్నాయి. ఇక బరుల వద్ద మద్యం బెల్ట్‌షాపులు ఏర్పాటుచేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

కోడి కత్తితో దాడి.. ఒకరికి గాయాలు

కిర్లంపూడి, జనవరి 13: కిర్లంపూడి గ్రామంలో కోడిపందేలు జరుగుతున్న ప్రదేశంలో కోడికత్తితో వ్యక్తిని గాయపరిచిన సంఘటన ఇది. మోటారు సైకిల్‌ పై వెళుతున్న సమయంలో మణికంఠ, రమణ అనే ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కొంత సమయం తర్వాత మణికంఠ.. రమణను కోడి కత్తితో గాయపరిచాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించగా మూడు కుట్లు పడ్డాయి. 

గోడిలో ‘బరి’ గొడవ.. టీడీపీ అధ్యక్షుడిపై కేసు

అల్లవరం, జనవరి 13: గోడిలో కోడి పందేల బరి ఏర్పాటు విషయమై వాగ్వాదం జరగడంతో అధికార పార్టీకి చెందిన నాయకుని ఫిర్యాదు మేరకు మండల టీడీపీ అధ్యక్షుడు దెందుకూరి సత్యనారాయణరాజుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ బి.ప్రభాకరరావు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 6న ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగి, కులం పేరు తో దూషించినట్టు వైసీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్యనారాయణ రాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. ఆలయ భూముల్లో బరి వద్దని టీడీపీ నాయకుడు అడ్డుకున్నట్టు సమాచారం.



Updated Date - 2021-01-14T07:07:48+05:30 IST