Abn logo
May 4 2020 @ 12:03PM

కీళ్ల నొప్పులు తగ్గడానికి ఏం చేయాలి?

ఆంధ్రజ్యోతి(04-05-2020):

ప్రశ్న: మా అమ్మకు నలభై ఏడేళ్లు. భుజాలు, మోకాళ్ళ నొప్పితో బాధపడుతోంది. కీళ్ల నొప్పులు తగ్గడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

- రిజ్వానా, కడప 

డాక్టర్ జవాబు: కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం అవసరం. కాలానుగుణంగా వచ్చే అన్ని రకాల పండ్లు, క్యారెట్‌, బీట్రూట్‌, కాప్సికం, బీన్స్‌, చిక్కుడు లాంటి రంగు రంగుల కూరగాయల్ని సలాడ్లు, కూరలు లేదా సూప్‌ రూపంలో రోజూ తీసుకోవాలి. క్యాబేజి, కాలీఫ్లవర్‌, బ్రొకొలి, ముల్లంగి లాంటివి అధికంగా తీసుకోవాలి. పసుపు, అల్లం, వెల్లుల్లి ఎక్కువగా తీసుకుంటే మంచిది. పాలిష్‌ చేసిన తెల్ల బియ్యం అన్నం, మైదా పదార్థాలు, బేకరీ ఫుడ్స్‌, వేపుళ్ళు, స్వీట్లు, పంచదార, టీ, కాఫీలు మొదలైనవన్నీ పరిమితంగా తీసుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే మాంసాహారం తగ్గించాలి. తక్కువ కొవ్వు ఉండే కోడి, చేపలు వారానికి ఒకటి రెండుసార్లకు మించకుండా తీసుకోవచ్చు. ఒమేగా-3 అధికంగా ఉండే చేప, అవిసె, ఆక్రోట్‌ గింజలు ఎక్కువగా తీసుకోవాలి. సరైన ఆహారంతో పాటు చేయగలిగినంత వరకు వ్యాయామం కూడా చేస్తే మంచిది.