వృథానీటి వినియోగానికి చెక్‌డ్యాములు

ABN , First Publish Date - 2021-06-18T05:43:28+05:30 IST

వృథానీటిని సాగు, తాగు అవసరాలకు వినియోగించుకునేలా చెక్‌డ్యాముల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

వృథానీటి వినియోగానికి చెక్‌డ్యాములు
మున్నేరు చెక్‌డ్యాం నుంచి పరవళ్లు తొక్కుతున్న నీరు, ప్రకాష్‌నగర్‌ వద్ద చెక్‌డ్యాం ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి

మున్నేరుపై మరో రెండు చోట్ల నిర్మాణం

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం కార్పొరేషన్‌, జూన్‌ 17: వృథానీటిని సాగు, తాగు అవసరాలకు వినియోగించుకునేలా చెక్‌డ్యాముల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మం ప్రకాష్‌నగర్‌ వద్ద మున్నేరుపై రూ.7,45కోట్లతోనిర్మించిన చెక్‌డ్యాంను గురువారం ఆయన కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో  కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్నేరుపై మరో రెండు చెక్‌డ్యామ్‌లు కూడా నిర్మించనున్నట్లు వివరించారు. చెక్‌డ్యాంల నిర్మాణంతో భూగర్భజలాలు పెరగడమే కాకుండా వృథాగా పోయే నీరు సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. చెక్‌డ్యాం వల్ల మున్నేరులో 2లక్షల క్యూసెక్కుల నీటిని నిల్వ చేసుకోగలిగామన్నారు. ప్రకాష్‌నగర్‌ చెక్‌డ్యాంకు దిగువన ధంసలాపురం వద్ద మరో చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.7కోట్లు మంజూరు చేశామని, పనులు త్వరగా ప్రారంభించాలని, రంగనాయకుల గుట్ట వద్ద మున్నేరు వాగుపై ఫ్లడ్‌బ్యాంక్స్‌తో చెక్‌డ్యాం నిర్మాణానికి అంచనాలు రూపొందించి అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపాలని ఇరిగేషన్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రకాష్‌నగర్‌ చెక్‌డ్యాం ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా రూపొందించేందుకు చెక్‌డ్యాంకు ఇరువైపులా 500మీటర్ల మేర ఫ్లడ్‌బ్యాంక్‌ల నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. అయితే తాము అంచనాలు తయారు చేశామని అనుమతి మంజూరుకోసం నగరపాలక అధికారులకు పంపనున్నట్టు ఇరిగేషన్‌ అధికారులు మంత్రి పువ్వాడకు తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, సుడా ఛైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహారా, కార్పొరేషన్‌ కమిషనర్‌ అనురాగ్‌జయంతి, ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ శంకర్‌నాయక్‌, ఈఈ అనసూయ, ఆర్డీవో రవీంథ్రనాథ్‌, అర్బన్‌ తహసీల్దార్‌ శైలజ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T05:43:28+05:30 IST